Telangana News: గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే కీలక బాధ్యతలో ఉన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు వాహన సదుపాయం కల్పించాలని తెలంగాణ ఎంపీడీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జొన్నల పద్మావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని టీజీఓ భవన్‌లో ఎంపీడీఓల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎంపీడీఓలు ప్రభుత్వ పథకాల అమలులో కీలకమని, వారికి వాహన సదుపాయం లేకపోవడంతో మండలాల్లో పర్యవేక్షణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని జొన్నల పద్మావతి తెలిపారు. వెంటనే ఎంపీడీఓలకు వాహనాలు మంజూరు చేయాలని, పెండింగ్‌లో ఉన్న వాహన బిల్లులన్నీ విడుదల చేయాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. పదోన్నతికి అర్హత పొందిన ఎంపీడీఓలకు డీపీపీ ద్వారా డిప్యూటీ డీఎంఓలుగా పదోన్నతులు ఇవ్వడంలో ఆలస్యం అవుతుందని ఎంపీడీఓల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియను ప్రభుత్వం తక్షణం పూర్తి చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read: Vasudeva Sutham Song: మాస్టర్ మహేంద్రన్ ‘వసుదేవసుతం’ నుంచి ‘ఏమైపోతుందో’ సాంగ్ రిలీజ్..
15 రోజుల విరామం
సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు ఒకేసారి నోటిఫై కావడం నిర్వహణపరంగా ఇబ్బందులు తలెత్తుతాయని పలువురు ఎంపీడీఓలు సమావేశంలో పేర్కొన్నారు. రెండు ఎన్నికల మధ్య కనీసం 15 రోజుల విరామం ఉండాలని, ఒక ఎన్నిక పూర్తయ్యాక మరొక ఎన్నిక నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. మండల పరిషత్‌ల పనితీరు కోసం అవసరమైన గ్రాంట్లు, సీనియరేజ్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ వంటి నిధులు విడుదల కాకపోవడంతో పనులు మందగిస్తున్నాయని ఎంపీడీఓలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఎం. మోహన్, అసోసియేట్ అధ్యక్షుడు గంగుల సంతోష్ కుమార్, చిరంజీవి, శ్రీనివాస్, కె. రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Also Read: iBOMMA: ఐబొమ్మ రవి ప్రమోట్ చేసిన యాప్స్ వల్ల అనేకమంది ఆత్మహత్య: సీపీ సజ్జనార్
