KTR Meet Sunitha: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేతితో ఓటమి పాలైన బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీత నివాసానికి శనివారం ఉదయం మాజీ మంత్రి కేటీఆర్ (KTR Meets Sunitha) వెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆయన, సునీత గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నించారు. నియోజకవర్గం అంతటా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ ఓటమి పాలుకావడంతో ఆమెను ప్రత్యక్షంగా కలిసి కేటీఆర్ మాట్లాడారు.
జూబ్లీహిల్స్‌లోని సునీత నివాసానికివెళ్లి సునీతతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు, అక్రమాలు చేసినా ఎదుర్కొని నిలబడి గట్టి పోటీ ఇచ్చారంటూ సునీతను కేటీఆర్ అభినందించారు. జూబ్లీహిల్స్ పోటీ విషయంలో సునీతతో పాటు వారి పిల్లలు కూడా చక్కటి స్ఫూర్తిని, పోరాటాన్ని ప్రదర్శించారని మెచ్చుకున్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందంటూ వారికి కేటీఆర్ ధైర్యం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. కాగా, ఇటీవలే భర్తను పోగొట్టుకొని, ఆ తర్వాత ఎన్నికల్లో ధైర్యంగా పోటీ చేసిన మహిళ అభ్యర్థిని ఈవిధంగా నివాసానికి వెళ్లి ఓదార్చడం హుందాతనంగా ఉందని బీఆర్ఎస్ అభిమానులు చెబుతున్నారు.
కార్యకర్తకు పరామర్శ
ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలో గాయపడ్డ రాకేష్ అనే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కేటీఆర్ పరామర్శించారు. మాగంటి సునీత, కౌశిక్ రెడ్డితో పాటు పలువురు నాయకులతో కలిసి వెళ్లి రెహ్మత్‌నగర్‌లోని కార్యకర్త నివాసానికి వెళ్లి మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారు ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు, అక్రమాలు చేసినా.. వాటిని ఎదుర్కొని… pic.twitter.com/TtsbKrXf5k
— BRS Party (@BRSparty) November 15, 2025
