Revanth On JubileeHills Result: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో, గత ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో పెద్దగా సానుకూల ఫలితాలు లేని సందర్భంలో, ఇప్పుడు ప్రజలు అండగా నిలబడి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారని ఆయన అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంక్షేమంలో, అభివృద్ధి కార్యాచరణలో ముందుకు వెళ్లండి, కార్యక్రమాల అమలులో ముందుకు వెళ్లాలంటూ ప్రజలు ఆశీర్వదించారని ఆయన వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ గెలుపును ప్రజల ఆశీర్వాదంగా, బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పారు. ఈ గెలుపునకు కృషి చేసిన ప్రతిఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సాధించిన విజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం (Revanth On JubileeHills Result) స్పందించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్, పలువురు మంత్రులు, నూతన ఎమ్మెల్యే నవీన్ కుమార్ యాదవ్‌తో కలిసి ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను ఆయన మెచ్చుకున్నారు. నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన మంత్రులు, కాంగ్రెస్ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌కు కూడా ప్రత్యేక అభినందనలు చెప్పారు.
‘‘ఎన్నికల్లో గెలిస్తే ఉప్పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవడం కాంగ్రెస్ పార్టీకి తెలియదు. ప్రతిపక్షంలో ఉండే ప్రజాసమస్యలపై పోరాటం చేయడం, ప్రభుత్వంలో ఉంటే ప్రజా సమస్యల పరిష్కారం చేయడం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అందుకే, ఈ సూత్రాన్ని తూ.చ. తప్పకుండా పాటిస్తోంది కనుకే శతాబ్దంపైగా ప్రజా ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మనుగడ సాగిస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రజలు విలక్షమైన తీర్పు ఇచ్చారు. పోలైన ఓట్లలో 51 శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యం ద్వారా ఎప్పుడూ, లేనంత బలాన్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 51 శాతం, బీఆర్ఎస్‌కు 38 శాతం, బీజేపీకి 8 శాతం చొప్పున ప్రజలు ఓట్లు వేశారు. దీని ద్వారా ఎవరి పాత్ర ఏమిటి? అనేది ప్రజలు నిర్ణయించారు. గత రెండేళ్లు నిశితంగా గమనించిన తర్వాత ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also- Telusukada OTT: ఓటీటీలోకి వచ్చేసిన సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసుకదా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
జూబ్లీహిల్స్ గెలుపును బాధ్యతగా తీసుకుంటామన్నారు. జంట నగరం నుంచి అధిక ఆదాయం వస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. దానికి తగ్గట్టే నగరాన్ని తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని చెప్పారు. హైదరాబాద్‌ను ప్రపంచ మహా నగరంలో తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా విష ప్రచారం, తప్పుడు వార్తలు, పేయిడ్ వార్తలు, ఫేక్ సర్వేలపై ఆధారపడి ప్రభుత్వాన్ని అవమానించడం, అవహేళనం చేయడం లాంటివి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా, ఈగల్ ఫోర్స్ ఇవన్నీ ప్రజలకు మేలు చేయడానికి తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
‘‘అసెంబ్లీలో కూర్చుని హరీష్ రావు మా వైపు అసూయగా చూస్తారు. కేటీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదని ప్రజలే చెప్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా మీరు మీ బాధ్యతను నిర్వర్తించండి. ఫేక్ న్యూస్‌ను కేటీఆరే క్రియేట్ చేసి ఆయనే చదువుతాడు. మీడియా ఛానెల్స్ డబ్బుల కోసం పెయిడ్ ఆర్టికల్స్ వ్యాప్తిచేయకూడదు. మిగతా రాష్ట్రాల్లో లాగా ఛానెల్స్‌ను కనిపించకుండా చెయ్యడం ఒక్క నిమిషం పని. బీఆర్ఎస్‌ను ఇంకా బ్రతికించాలని చూస్తున్నాయి కొన్ని మీడియా ఛానెల్స్’’ అని సీఎం రేవంత్ అన్నారు.
కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘ఆయన క్రియాశీలక రాజకీయల్లోకి వస్తే అప్పుడు నేను ఆయనపై స్పందిస్తాను. కేసీఆర్ కుర్చీ కోసం కేటీఆర్, హరీష్ రావు కొట్టుకుంటున్నారు. కేసీఆర్ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది’’ అని వ్యాఖ్యానించారు. కేటీఆర్ తనకన్నా వయసులో చిన్నవాడని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
కిషన్ రెడ్డి సహాయ నిరాకరణ
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహాయనిరాకరణ చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ‘‘కేంద్రంలో మాకు నిధులు రానివ్వకుండా అడ్డుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మనకు ఇవ్వాల్సిన అనుమతుల కోసం చర్చించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు చర్చించేందుకు రావాలి’’ అని విమర్శించారు.
