KTR: ప్రతి ఒక్క కౌంటింగ్ ఏజెంట్, ఎలక్షన్ ఏజెంట్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సూచించారు. తెలంగాణ భవన్ లో ఏజెంట్లు, సీనియర్ నేతలతో గురువారం కీలక భేటి నిర్వహించారు. నేడు జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు.
అక్రమాల అడ్డుకట్టే లక్ష్యం
లెక్కింపును పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, కౌంటింగ్ ప్రక్రియ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఓట్ల లెక్కింపు పర్యవేక్షణ కోసం పార్టీ సీనియర్ నాయకులను, ప్రముఖులను ఎలక్షన్ ఏజెంట్లుగా, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించిందని తెలిపారు. కౌంటింగ్ అక్రమాలకు అడ్డుకట్టే లక్ష్యం అని పేర్కొన్నారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిందని, ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. కౌంటింగ్ సందర్భంగా కూడా కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఏజెంట్లకు సూచించారు. ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియను బీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.
Also Read: ACB Raid: ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్.. లంచం ఎంతంటే?
మలావత్ పూర్ణకు కేటీఆర్ పరామర్శ
ఎవరెస్ట్ అధిరోహకురాలు మలావత్ పూర్ణ(Malavat Purna)కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫోన్ చేసి మాట్లాడారు. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గిరిపుత్రికగా పేరు తెచ్చుకున్న మలావత్ పూర్ణ తండ్రి దేవీదాస్ మృతి చెందడంతో గురువారం ఆమెను ఓదార్చారు. పూర్ణ తండ్రి మరణంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పూర్ణకు ధైర్యం చెప్పిన కేటీఆర్, త్వరలోనే స్వయంగా వచ్చి ఆమె కుటుంబాన్ని కలవనున్నట్లు హామీ ఇచ్చారు.
Also Read: Happy Childrens Day: బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
