BRS: బీఆర్ఎస్ నేతల్లో లబ్ డబ్ మొదలైంది. నేడు ఓట్ల లెక్కింపు చేపడుతుండటంతో గెలుస్తామా? లేదా? ఫలితాలు ఎలా వస్తాయనేదానిపై ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఓట్ల వివరాలతో పాటు పోలింగ్ బూత్ ల వారీగా బీఆర్ఎస్(BRS) కుపడిన ఓట్లపై అంచనాకు వచ్చారు. తమకే మెజార్టీ ఓట్లు పడ్డాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయంతోనే రాబోయే ఏ ఎన్నికల్లోనైనా తమదే గెలుపు అనే ధీమాతో ఉన్నారు. మాస్ ప్రజలు, సైలెంట్ ఓటింగ్, బస్తీ ఓటర్లకు తమకు అనుకూలంగా ఓటువేశారని గెలుపు తధ్యమని పేర్కొంటున్నారు. కాంగ్రెస్(Congress) కు ఎంఐఎం(MIM) దోస్తీ కట్టడంతోనే బీఆర్ఎస్(BRS) కు అనుకూలంగా మారిందని, మైనార్టీ ఓటర్లు సైతం తమకు మొగ్గుచూపారని ఆశిస్తున్నారు.
దీంతో బీఆర్ఎస్‌కు మైనస్..
మరోవైపు మెజార్టీ సర్వేలు కాంగ్రెస్ కు జై కొట్టడంతో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సర్వేలు బీఆర్ఎస్ కు చెప్పడం, అసలు గ్రౌండ్ లో ఏం జరిగిందోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పోల్ మేనేజ్ మెంట్ చేయడం ఆపార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉందని, దీంతో బీఆర్ఎస్ కు మైనస్ అవుతుందనే ఆందోళన సైతం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కు పోల్ మేనేజ్ మెంట్(Poll Management) లో కొంత వెనుకబడటం, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని భావించినప్పటికీ చివరి నిమిషంలో కాంగ్రెస్ చక్రం తప్పిందని పలువురు పార్టీ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎంఐఎం ఓట్లపై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఒక్క షేక్ పేటలోనే ఆశించిన స్థాయిలో పడ్డాయని, మిగతా 5 డివిజన్లలో పడలేదని, కొన్ని డివిజన్లలో కాంగ్రెస్ కు ప్రజలు మొగ్గుచూపారని గులాబీలో చర్చమొదలైంది.
Also Read: Kaantha Controversy: ‘కాంత’.. ఎవరి తాత, నాన్నల కథ కాదు.. కాంట్రవర్సీపై రానా, దుల్కర్ క్లారిటీ!
కేటీఆర్‌కు పార్టీ పూర్తి పగ్గాలు
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డిని విజయం సాధించలేకపోయింది. కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. దీంతో పార్టీకేడర్, నాయకులు సైతం నిరాశనిస్పృహలో ఉన్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో ఓడిపోతే పార్టీ పరిస్థితి ఏంటనే ఆందోళనను పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇది గెలిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, మున్సిపల్(municipalities), కార్పొరేషన్ల(corporations)లో పార్టీకి జోష్ రానుంది. ఓడితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. ఈ ఉప ఎన్నికను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి బాధ్యతలు చేపట్టారు. అన్నీ తానై ఉప ఎన్నికల ప్రచారం కొనసాగించారు. పార్టీ నేతలకు సైతం ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తూ ముందుకు సాగారు. ఇది ఆయనకు తొలిమెట్టు లాంటిదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గెలిస్తే మాత్రం కేటీఆర్ కు పార్టీ పూర్తి పగ్గాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Also Read: Al Falah University: దిల్లీ పేలుడు ఎఫెక్ట్.. చిక్కుల్లో అల్ ఫలాహ్ యూనివర్సిటీ.. కేంద్రం కీలక ఆదేశాలు
