Mithra Mandali OTT: కొన్ని సినిమాలు థియేటర్లలో మెప్పించలేకపోయినా, ఓటీటీలలో మాత్రం మంచి ఆదరణను రాబట్టుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువగా జరుగుతుంది. థియేటర్లలో ఆశించినంత సక్సెస్ అవని సినిమాలు, ఓటీటీకి వచ్చేసరికి చాలా తక్కువ సమయంలోనే మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను రాబట్టుకుని, ఆయా ఓటీటీ సంస్థలను ఆశ్చర్యపరుస్తున్నాయి. రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన ‘మిత్రమండలి’ సినిమా కూడా, ఇప్పుడు ఓటీటీలో దూసుకెళుతున్నట్లుగా.. ఈ సినిమా రైట్స్ తీసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సంస్థ వెల్లడించింది. బన్నీ వాస్ (Bunny Vas) సమర్పణలో బివి వర్క్స్, సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్స్‌పై విజయేందర్ రచనా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిత్ర మండలి’ (Mithra Mandali). ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా వెండితెరపై ప్రేక్షకులను అలరించడంలో ఫెయిలైంది. కానీ, ఓటీటీలో మాత్రం ఈ సినిమాను అమెజాన్ వీక్షకులు బాగా ఆదరిస్తుండటంతో చిత్రయూనిట్ హ్యాపీగా ఉంది.
Also Read- Bigg Boss Telugu 9: హౌస్‌లో ‘మండే’ మంటలు మొదలయ్యాయ్.. ఇంకెవరూ ఆపలేరు!
నెంబర్ 2లో ట్రెండింగ్..
ఈ సినిమా 16 అక్టోబర్ 2025న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో టఫ్ కాంపిటేషన్ నడుమ విడుదలైన ఈ సినిమాను ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. దీంతో, చాలా త్వరగానే అంటే 20 రోజులు గ్యాప్‌లోనే ఓటీటీలోకి ఈ సినిమాను తెచ్చేశారు. నవంబర్ 6న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ చిత్రం.. ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్‌లో దూసుకెళుతోంది. దేశవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ ట్రెండింగ్‌లో టాప్ 2లో నిలిచిన ఈ చిత్రం.. ప్రస్తుతం టాప్ 1 ట్రెండింగ్‌లో ఉన్న ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) చిత్రానికి పోటీగా నిలుస్తుండటం చూసి, చిత్రయూనిట్ కూడా ఆశ్చర్యపోతున్నారు. థియేటర్లకు ప్రేక్షకులను రాబట్టలేకపోయిన ‘మిత్ర మండలి’ చిత్రానికి, ఓటీటీలో మాత్రం ఇలాంటి రెస్సాన్స్ రావడం నిజంగా గ్రేట్ అనే చెప్పుకోవాలి. అందుకే టీమ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నట్లుగా చెబుతున్నారు.
Also Read- RT76: భర్త మహాశయులకు ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏంటంటే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!
ట్రెండింగ్‌కు కారణమిదేనా?
‘మిత్రమండలి’ విషయానికి వస్తే.. ఒక పట్టణంలోని నలుగురు మిత్రుల మధ్య జరిగే ఫన్నీ సన్నివేశాలను సహజంగా చూపిస్తూ, వారి మధ్య జరిగే సన్నివేశాలను, సందర్భాలను పూర్తి స్థాయిలో వినోదభరితంగా దర్శకుడు తెరకెక్కించారు. మంచి విజువల్స్, నిర్మాణ విలువలతో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం అన్ని జోనర్ల ప్రేక్షకులను అలరిస్తుండంతోనే టాప్‌లో ట్రెండింగ్ అవుతుందని మేకర్స్ అంటున్నారు. దర్శకుడు విజయేందర్ ఈ చిత్రాన్ని సరికొత్త శైలిలో తెరకెక్కించగా.. నటీనటుల నటన, సంగీతం అన్నీ కలిసి సినిమాకు మరింత ప్రధాన ఆకర్షణగా నిలిపాయి. బహుశా ఇదే ట్రెండింగ్‌లో ఇంతటి ర్యాంకింగ్ సాధించటానికి కారణమై ఉండొచ్చని అంటున్నారు చిత్ర నిర్మాతలు. కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ చిత్రానికి ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, వీటీవీ గణేష్ వంటి వారు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
