Sharwanand fitness journey: టాలీవుడ్ నటుడు శర్వానంద్ తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి, ముఖ్యంగా తన కూతురు పుట్టిన తర్వాత ఆరోగ్యంపై తన దృష్టి ఎలా పెరిగిందో పంచుకున్నారు. 2019లో జరిగిన స్కైడైవింగ్ ప్రమాదం కారణంగా తాను 92 కిలోల బరువు పెరిగానని, ఆ తర్వాత బరువు తగ్గడానికి పడిన కష్టం గురించి కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. 2019లో, ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా స్కైడైవింగ్ స్టంట్ చేస్తుండగా భుజానికి గాయమైంది. దీనికి శస్త్రచికిత్స అవసరం అయింది. దాని నుంచి కోలుకోవడానికి చాలా నెలల సమయం పట్టింది. ఆ సమయంలో, ఆయన బరువు 92 కిలోలకు పెరిగానంటూ చెప్పుకొచ్చారు. “నా జీవితంలో పెద్ద మలుపు 2019లో వచ్చింది. నాకు ప్రమాదం జరిగి చేతికి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. నేను చాలా కాలం యాంటీబయాటిక్స్ వాడాను, దాని వల్ల నాకు విపరీతంగా ఆకలి వేసేది. నేను 92 కిలోల వరకు బరువు పెరిగాను. నేను ఎంత మారిపోయానో నాకు చాలా కాలం తర్వాత గానీ తెలియలేదు.” అని అన్నారు.
Read also-Jayakrishna debut movie: హీరోగా జయకృష్ణ ఘట్టమనేనిని పరిచయం చేస్తున్న హిట్ సినిమాల దర్శకుడు..
ఫిట్‌నెస్ వైపు దృష్టి
తాను ఓ సినిమాలో 18 ఏళ్ల కుర్రాడి పాత్ర పోషించాల్సి రావడంతో, బరువు తగ్గాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. అప్పటి నుండి ఆయన కఠినమైన ఫిట్‌నెస్ దినచర్యను పాటించడం మొదలుపెట్టారు. రోజూ ఉదయం 4:30 గంటలకు లేవడం, KBR పార్క్‌లో దాదాపు 12 కిలోమీటర్లు నడవడం అలవాటు చేసుకున్నారు. షూటింగ్ లేని రోజుల్లో మధ్యాహ్నం జిమ్‌లో, సాయంత్రం మళ్ళీ సుదీర్ఘ నడక తదితర విషయాల్లో శిక్షణ తీసుకునేవారు. శర్వానంద్ ఆహార ప్రియుడు అయినప్పటికీ, కఠినమైన డైట్‌ను పాటించారు. “ఫిట్‌నెస్‌లో 70% ఫలితం మనం తీసుకునే ఆహారం నుంచే వస్తుంది” అని ఆయన నమ్ముతారు. దానికి తగ్గట్టుగా ఆహారాన్ని కూడా తీసుకునే వారు.
Read also-Diwali movies on OTT: ఓటీటీకి క్యూ కడుతున్న దీపావళి సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
గతేడాది ఆయన కూతురు పుట్టిన తర్వాత ఆరోగ్యం పట్ల ఆయనకున్న దృష్టి మరింత బలపడింది. తండ్రిగా మారడం తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చిందని ఆయన తెలిపారు. “నా కూతురు పుట్టిన తర్వాత, ఆరోగ్యం ఎంత ముఖ్యమో నాకు తెలిసింది. అంతకు ముందు నేను ఎప్పుడూ వ్యాయామం చేయలేదు, కానీ ఆ దశ నన్ను లోతుగా ఆలోచించేలా చేసింది. అది నా ఆరోగ్యం, నా శరీరం, నా ఆత్మపై దృష్టి పెట్టేలా చేసింది. ఈ రోజు, ఆరోగ్యం అనేది నాకొక లక్ష్యం కాదు, అదొక జీవన విధానం. నేను నా కుటుంబం కోసం బలంగా, చురుకుగా ఉండాలనుకుంటున్నాను, అదే నన్ను ముందుకు నడిపిస్తుంది.” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన రాబోయే సినిమా ‘బైకర్’ కోసం చాలా ఫిట్‌గా మారారు. బరువు తగ్గడం కేవలం శారీరక మార్పు మాత్రమే కాదు, మానసిక మార్పు కూడా అని శర్వానంద్ చెప్పారు. నిలకడగా ప్రయత్నించడం ద్వారా ఎవరైనా తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అనేది ఆయన మాటల్లోని సారాంశం.
