Tummala Nageswara Rao: కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోళ్లలో కొర్రీలు మాత్రం సడలించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా స్పందన కరువైంది. దీంతో రైతులు పత్తిని అమ్ముకోవడానికి ఇబ్బందులు తప్పడం లేదు. కాటన్ కొనుగోలు సీసీఐ పరిధిలో ఉండటం, తెలంగాణకు చెందిన కేంద్రమంత్రులుగా ఉన్న బండిసంజయ్, కిషన్ రెడ్డిలు సైతం చొరవ తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.
వర్షాలతో ఆరకపోవడం..
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. 28లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. దానికి అనుగుణంగా కొనుగోళ్ల కోసం 318 జిన్నింగ్ మిల్లను నోటిఫై చేశారు. కొనుగోళ్లు సైతం ప్రారంభమయ్యాయి. అయితే ఈ కొనుగోళ్లలో కేంద్రం విధించిన ఆంక్షలు రైతులకు శాపంగా మారాయి. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, అధిక వర్షాలతో పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉంది. 12శాతం తేమశాతం మించకుండా ఉండాలని సీసీఐ నిబంధనలు ఉన్నాయి. దీంతో పత్తి వర్షాలతో ఆరకపోవడంతో 20శాతం వరకు తేమ వస్తుంది. దీంతో కొనుగోలు చేయకపోవడంతో పత్తిరైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై కేంద్రం తేమశాతం మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులు చేసినప్పటికీ ఆశించిన స్పందన కరువైంది. 12శాతం తేమ ఉంటేనే మద్దతు ధర క్వింటాకు రూ.8110 అందజేస్తున్నారు. అయితే ఇప్పుడు నిబంధనలతో కొనుగోళ్లు చేయకపోవడం, అటు మద్దతు ధర రాకపోవడంతో నానా తంటాలు పడుతున్నారు. రోడ్డు ఎక్కుతున్న సందర్భాలు తరచూ జరుగుతున్నాయి.
Also Read: The Girlfriend collection: రష్మిక మందాన్నా ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..
మిగిలినది ఎక్కడ అమ్ముకోవాలి
మరోవైపు ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు నిబంధన ఉంది. ఇది రైతులకు శాపంగా మారింది. రాష్ట్రంలో 11 నుంచి 15 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది. దీంతో మిగిలినది ఎక్కడ అమ్ముకోవాలనేది ఇప్పుడు రైతులకు ప్రశ్నగా మిగిలింది. రైతుల సమస్యలను తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర టెక్స్ టైల్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ కు, సీసీఐ ఎండీ లలిత్ కుమార్ గుప్తా, తెలంగాణ నుంచి కేంద్రమంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు సైతం లేఖలు రాశారు. మినహాయింపు ఇవ్వాలని, అందుకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తులు చేశారు. అయినప్పటికీ వారి నుంచి స్పందన కరువైంది. దీంతో ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ , నల్లగొండ ఇలా ఉమ్మడి జిల్లాల్లో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ ప్రీ నెంబర్ పెట్టినా, కపాస్ కిసాన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నా నిబంధనలు మార్చకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు.వీటన్నింటికి తోడు కపాస్ కిసాన్ యాప్ కేవలం రాత్రి 10 గంటల సమయంలో మాత్రమే ఓపెన్‌గా ఉండడంతో రైతులకు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందిస్తుందా? లేదా అనేది చూడాలి.
Also Read: BJP Paid Crowd: వాహ్ మోదీ వాహ్.. పూలు చల్లితే రూ.500, ఏడిస్తే రూ.1000!.. ప్యాకేజీ అదుర్స్ కదూ?
