KTR Resign Posters: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్‌కు గడువు దగ్గర పడుతుండడంతో, ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాస్త్రాలు, వ్యూహాలకు మరింత పదును పెట్టాయి. జూబ్లీహిల్స్ స్థానాన్ని దక్కించుకొని తమ సత్తా చాటాలన్న లక్ష్యంతో, కసిగా చివరి నిమిషంలో ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. ఇంటింటి ప్రచారాలు, కుల సమీకరణాలు, రహస్య భేటీలు రంజుగా కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్రంగా రక్తికట్టించే రాజకీయం నడుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలాచోట్ల ‘రిజైన్ కేటీఆర్’ పోస్టర్స్ (KTR Resign Posters) కలకలం రేపుతున్నాయి.
ఏంటీ పోస్టర్ల రాజకీయం?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే, కంటోన్మెంట్ నియోజకవర్గం మాదిరిగా వేల కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి అంటే, ఏంటో చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, హస్తం పార్టీ సీనియర్ నేతలు హామీ ఇస్తున్నాయి. అయితే, ఈ వాగ్దనంపై కౌంటర్‌గా కేటీఆర్ ఇటీవల మాట్లాడుతూ, కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించిన పనుల ఆధారాలు, జీవో కాపీలను చూపిస్తే తను రాజీనామా చేస్తానంటూ సవాలు విసిరారు. మాజీ మంత్రి విసిరిన ఈ సవాలును హస్తం పార్టీ శ్రేణులు సీరియస్‌గా తీసుకున్నాయి. కేటీఆర్‌ను ఇరకాటంలోకి నెట్టేవిధంగా, కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల ఆధారాలను వెలికితీశాయి. ఇవిగో ఆధారాలు ఇప్పుడు రాజీనామా చెయ్యి కేటీఆర్ అంటూ సవాళ్లు విసురుతున్నాయి. ఈ క్రమంలో ‘రిజైన్ కేటీఆర్’ పేరిట జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో పోస్టర్లు వెలిశాయి.
Read Also- BJP Paid Crowd: వాహ్ మోదీ వాహ్.. పూలు చల్లితే రూ.500, ఏడిస్తే రూ.1000!.. ప్యాకేజీ అదుర్స్ కదూ?
అభివృద్ధి పనుల జీవో కాపీతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం విడుదల చేసిన నిధులు అభివృద్ధి పనులు జీవో కాపీలను జత చేసి, ‘రిజైన్ కేటీఆర్’ అంటూ పోస్టర్లపై రాసుకొచ్చారు. ‘‘హ్యాష్ ట్యాగ్ రిజైన్ కేటీఆర్’’ అనే టైటిల్‌తో ఈ పోస్టర్లు వెలిశాయి. కంటోన్మెంట్ డెవలప్‌మెంట్ లిస్ట్ ఇదిగో, కేటీఆర్ గారు రాజీనామాకు మీరు రెడీనా? అని ప్రశ్నించారు. జేబీఎస్-శామీర్ పేట ఎలివేటెడ్ కారిడార్‌కు రూ.4,263 కోట్లు, పారడైజ్ జంక్షన్ – డెయిరీ ఫాం రోడ్ ఎలివేటెడ్ కారిడార్ రూ.1,487 కోట్లతో ప్రారంభించామంటూ అభివృద్ధి పనులను పేర్కొన్నారు. డబ్బు సంచులతో కేటీఆర్ పారిపోతున్నట్టుగా ఒక వ్యంగ్య చిత్రాన్ని కూడా ఈ పోస్టర్లపై ముద్రించారు.
పనులు తనిఖీ చేసిన ఎమ్మెల్యే గణేష్
కంటోన్మెంట్‌లో అభివృద్ధిని కేటీఆర్ టార్గెట్ చేసిన నేపథ్యంలో, స్థానిక ఎమ్మెల్యే గణేష్ స్వయంగా రంగంలోకి దిగారు. ప్యారడైజ్ జంక్షన్ వద్ద ఎలివేటెడ్ కారిడార్ పనులను పరిశీలించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరితో కలిసి పనులను పరిశీలించారు. ఎన్‌హెచ్-44 వెంబడి ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు ఈ పనులు జరుగుతున్నాయి. 2025 సెప్టెంబర్ 15న విడుదలైన జీవో 194 ప్రకారం అధికారికంగా పనులు ప్రారంభమయ్యి జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు రూ.5,400 కోట్లు కేటాయించారు. 55.52 ఎకరాల భూమిని సేకరించారు. భూపరిహారంగా రూ.357 కోట్లు కేటాయించారు. దీంతో, మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.5,700 కోట్లుగా ఉంది. ఈ పనుల మంజూరు, ప్రారంభంలో ఎమ్మెల్యే గణేష్ కీలక పాత్ర పోషించారు.
Read Also- Pawan Kalyan: శేషాచలం అడవుల్లో పవన్.. కాలినడకన 4 కి.మీ ప్రయాణం.. కీలక ఆదేశాలు జారీ
