Jatadhara review: నటుడిగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రయాణం చేస్తున్న సుధీర్ బాబు, ఈసారి హారర్ ఫాంటసీ థ్రిల్లర్ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కీలక పాత్ర పోషించిన ఈ ద్విభాషా చిత్రం (తెలుగు, హిందీ) ‘జటాధర’. ఈ సినిమా విషయంలో సుధీర్ బాబు చాలా కేర్ తీసుకున్నట్లు చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. హీరో సుధీర్ బాబు అయితే సాహస యాత్రలు కూడా చేశారు. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగింది. అయితే ఆ పెరిగిన హైప్ ను సుధీర్ బాబు హాండిల్ చేశారా లేదా గాలికి వదిలేశారా.. ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.
Read also-Katrina Kaif: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన వెంకటేష్ హీరోయిన్.. సంబరాల్లో ఫ్యాన్స్
కథాంశం
కేరళలోని ప్రసిద్ధ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో వేల కోట్ల నిధిని రక్షించడానికి పూర్వకాలంలో పవిత్రమైన పిశాచ బంధనం వేస్తారు. కొందరి అత్యాశ, దురాశ కారణంగా ఆ బంధనం వీడి, ధన పిశాచి (సోనాక్షి సిన్హా) రూపంలో ఒక దుష్టశక్తి బయటకు వస్తుంది. ప్రస్తుత కాలంలో, దెయ్యాలు, భూతాలు లేవని బలంగా నమ్మే ఘోస్ట్ హంటర్ శివ (సుధీర్ బాబు) ఒక కేసును పరిష్కరించడానికి రంగంలోకి దిగుతాడు. అహంకారంతో ఉన్న శివకు, ధన పిశాచికి మధ్య జరిగిన మైథాలజీ-హారర్ పోరాటం, అతనికి తన గతం గురించి తెలిసిన భయంకరమైన నిజాలు ఏమిటి? అనేది సినిమా కథాంశం.
నటీనటుల ప్రదర్శన
ఘోస్ట్ హంటర్ శివ పాత్రలో సుధీర్ బాబు నటన ఆకట్టుకుంటుంది. పాత్రలో తన పరిణతిని, ఇంటెన్సిటీని చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన ప్రదర్శన సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ధన పిశాచి పాత్రలో సోనాక్షి సిన్హా ఒక భిన్నమైన, భయంకరమైన మేకోవర్‌లో కనిపించారు. ఆమె లుక్స్, మేకప్ ఆ పాత్రకు సరిపోయినప్పటికీ, నటనలో మరింత తీవ్రత (ఇంటెన్సిటీ) ఉంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఆమె తెలుగు తెరకు పరిచయం కావడం విశేషం.
Read also-SSMB29 Kumbha first look: ‘SSMB29’నుంచి మరో అప్డేట్.. ఆ పోస్టర్ ఏంటి బాసూ హాలీవుడ్ రేంజ్ లో ఉంది..
సాంకేతిక అంశాలు
దర్శకులు వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్‌లు మైథాలజీని, హారర్‌ను మేళవించి కొత్త జోనర్‌ను అందించడానికి ప్రయత్నించారు. కథాంశం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, ప్రథమార్థం చాలా నెమ్మదిగా సాగడం, కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉండటం వలన నిరాశపరుస్తుంది. ద్వితీయార్ధం మాత్రం కొంతవరకు మెరుగ్గా, ఉత్కంఠభరితమైన మలుపులతో సాగుతుంది. హారర్ సన్నివేశాలు, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. సంగీతం సినిమా హారర్ వాతావరణాన్ని పెంచడంలో, క్లైమాక్స్‌ను ఎలివేట్ చేయడంలో అద్భుతంగా పని చేసింది. విజువల్స్ చాలా బాగున్నాయి. కెమెరా పనితీరు సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లడానికి సహాయపడింది. గ్రాఫిక్స్ విషయంలో మాత్రం మరింత శ్రద్ధ పెట్టాల్సిందిగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల నాణ్యత తగ్గింది.
బలాలు
- సుధీర్ బాబు నటన
- కొన్ని హారర్ సన్నివేశాలు
- నేపథ్య సంగీతం
బలహీనతలు
- ఫస్టాఫ్ నెమ్మదిగా సాగడం
- పేలవమైన వీఎఫ్‌ఎక్స్
- స్క్రీన్‌ప్లేలో కొన్ని లోపాలు
రేటింగ్: 2 /5
