Singareni Collieries: ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల వల్ల తొలి అర్ధ సంవత్సరంలో అన్ని విభాగాల్లో వెనుకబడి ఉన్నామని, ప్రస్తుతం వర్షాలు పూర్తిగా తగ్గిపోయినందున ఉత్పత్తిని గణనీయంగా పెంచి లోటును భర్తీ చేసుకొని లక్ష్యాలు సాధించాలని సింగరేణి సీఎండీ బలరాంనాయక్(CMD Balaram Nayak) అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లకు ఆదేశించారు. హైదరాబాద్(Hyderabad) సింగరేణి భవన్ లో గురువారం ఆయన సంస్థ డైరెక్టర్లు, వివిధ కార్పొరేట్ విభాగాల జీఎంలతో పాటు అన్ని ఏరియాల్లోని జనరల్ మేనేజర్లతో విడివిడిగా సమావేశమై ఏరియాల వారీగా ఉత్పత్తి, రవాణా వంటి అంశాలను సమీక్షించారు.
నిబంధనల ప్రకారం..
ఈ సందర్భంగా బలరాం నాయక్ మాట్లాడుతూ నవంబర్ లో సాధించాల్సిన 72 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యానికి గాను రోజుకు 2 లక్షల నలభై వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి రవాణా సాధించాలని ఆయన సూచించారు. అలాగే రోజుకు కనీసం 13 లక్షల 75 వేల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను తొలగించాల్సి ఉంటుందన్నారు. మైనింగ్ తో పాటు పర్సనల్, రక్షణ, తదితర అధికారులు కూడా ఒక్క ఫైల్ కూడా పెండింగ్ లో లేకుండా అన్ని పనులు ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం ఏయే అధికారికి లేదా ఉద్యోగికి ఏ అవకాశాలు రావాలో అవి వారు పొందేవిధంగా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. సింగరేణి సంస్థను సంపూర్ణంగా ప్రమాదరహిత కంపెనీగా రూపుదిద్దాలని నిర్ణయించుకున్నామని, కానీ గతేడాది దురదృష్టవశాత్తు 3 మరణాలు సంభవించాయన్నారు.
Also Read: Generational Divide: ఆట మైదానంలో తండ్రుల ఆటలు.. మొబైల్ ఫోన్లలో కొడుకులు..!
మార్చి కల్లా కనీసం..
ఈ ఏడాది ఒక్క మరణం కూడా జరగకుండా ప్రమాదాలను నివారించడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా భూగర్భ గనుల్లో తనిఖీలు పెంచాలన్నారు. కొత్తగూడెం(Kothagudem) వీకే ఓపెన్ కాస్ట్(VK Open Cast) గనికి సంబంధించి అన్ని అనుమతులు లభించిన నేపథ్యంలో వచ్చే మార్చి కల్లా కనీసం 6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని బలరాంనాయక్ అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ఏడాది మొత్తం నాలుగు గనులు ప్రారంభించుకోవాలన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాత్రమే ఏరియాల జీఎంలతో నెలవారీ సమీక్షలు నిర్వహిస్తుండగా.. గురువారం అందరితో నేరుగా రివ్యూ చేపట్టడం గమనార్హం. ఈ సమీక్షలో సంస్థ డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, తిరుమల రావు, ఈడీ కోల్ మూమెంట్ వెంకన్న, అడ్వైజర్ ఫారెస్ట్రీ మోహన్ పరిగేన్, జనరల్ మేనేజర్ మార్కెటింగ్ కోఆర్డినేషన్ శ్రీనివాస్, వివిధ కార్పొరేట్ విభాగాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.
