Dharma Mahesh Kakani: రహస్యంగా రికార్డు చేసిన వీడియోలు.. ఆడియో టేపులను అడ్డం పెట్టుకుని 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నట్టు సినీ నటుడు ధర్మ మహేశ్ కాకాణి (Dharma Mahesh Kakani) తన భార్య చిరుమామిళ్ల గౌతమి (Chirumamilla Gautami), ఓ ఛానల్ సీఈవోపై కూకట్ పల్లి పోలీసులకు సోమవారం రాత్రి 9.30 గంటలకు ఫిర్యాదు చేశాడు. డబ్బు ఇవ్వని పక్షంలో తను నడుపుతున్న జిస్మత్ అరబిక్ మండి రెస్టారెంట్లపై యాజమాన్య హక్కులను తమకు బదిలీ చేయాలని బెదిరిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు బీఎన్ఎస్ 308(3) సెక్షన్‌తో పాటు 2008 ఐటీ యాక్ట్ సెక్షన్ 72 ప్రకారం కేసులు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read- Sree Vishnu: శ్రీవిష్ణు హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం.. దర్శకుడు ఎవరంటే?
నీ భవిష్యత్, మీ నాన్న వ్యాపారం దెబ్బతీస్తాం..
స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి వెంకటరత్నం మనవడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడరైన కాకాణి వెంకటేశ్వరరావు కుమారుడు కాకాణి ధర్మ మహేశ్. ప్రస్తుతం టాలీవుడ్‌లో నటుడిగా ఉన్నారు. అదే సమయంలో జిస్మత్ అరబిక్ మండి పేర ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారు. కాగా, ఆయన భార్య గౌతమి, ఓ ఛానల్ సీఈవోతో కలిసి కాకాణి మహేశ్‌కు తెలియకుండా రహస్య కెమెరాలు, రికార్డింగ్ పరికరాలు ఉపయోగించి కొన్ని వీడియోలు, ఆడియో సంభాషణలను రికార్డ్ చేశారు. సెప్టెంబర్ 25న కాకాణి మహేశ్ తన తండ్రితో మాట్లాడిన వ్యక్తిగత సంభాషణలను, ఇలాగే రికార్డ్ చేసి ఛానల్‌లో టెలికాస్ట్ చేశారు. ఆ తర్వాత తమ వద్ద మరికొన్ని వీడియోలు, ఆడియోలు ఉన్నాయని చెప్పి రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా ఇవ్వని పక్షంలో వాటిని కూడా టెలికాస్ట్ చేయటంతో పాటు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని బెదిరించారు. సినీ పరిశ్రమలో నీ భవిష్యత్తును నాశనం చేయటంతోపాటు మీ నాన్న వ్యాపారాన్ని కూడా దెబ్బ తీస్తామని భయపెట్టారు. దాంతోపాటు వీడియోలు, ఆడియోలు బయట పెడితే పెళ్లి కాని నీ సోదరి వివాహం ఇక ఎప్పటికీ జరగదంటూ బ్లాక్ మెయిల్ చేశారు. ఈ క్రమంలో మహేశ్ కాకాణి వ్యక్తిగతంగా మాట్లాడిన కొన్ని ఫోన్ సంభాషణలు, సీసీటీవీ విజువల్స్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయటంతోపాటు.. సీఈవోగా ఉన్న సదరు వ్యక్తి తన ఛానల్‌లో కూడా టెలికాస్ట్ చేశారు. టెలికాస్ట్ చేసిన తర్వాతి రోజునే పీ.వీ. రవి అనే వ్యక్తి మరీనా స్కైస్లో ఉన్న తన ఇంటికి వచ్చినట్టుగా మహేశ్ కాకాణి ఫిర్యాదులో తెలిపారు.
Also Read- Bigg Boss Telugu 9: బిగ్ బాస్ ఇంట్లో దెయ్యాలు.. సుమన్ శెట్టి గేమ్ స్టార్ట్స్!
ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు
ఆ సమయంలో తన తండ్రి కూడా ఇంట్లోనే ఉన్నట్టు పేర్కొన్నారు. వచ్చిన వెంటనే రవి వాట్సాప్ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా తన భార్య గౌతమి, ఛానల్ సీఈవోలతో మాట్లాడించినట్టు తెలిపారు. ఆ సమయంలో గౌతమి, సీఈవోలు రూ. 10 కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారన్నారు. అలా ఇవ్వని పక్షంలో జిస్మత్ అరబిక్ మండి రెస్టారెంట్ల యాజమాన్య హక్కులను బదిలీ చేయాలని చెప్పారన్నారు. అప్పుడే వీడియోలు, ఆడియోలను టెలికాస్ట్ చేయకుండా ఆపుతామన్నారన్నారు. రవి జర్నలిస్టుగా పని చేస్తున్నాడని, గౌతమికి అతను బంధువని తెలిపారు. తన భార్య గౌతిమితో సదర్ ఛానల్ సీఈవోకి ఎఫైర్ ఉన్నట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. గత మే నెల నుంచి బెదిరింపులను మరింత ఎక్కువ చేశారని పేర్కొన్నారు. తన కుటుంబ వివాదాన్ని అడ్డం పెట్టుకుని ఇదంతా చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో వారిద్దరూ మాదాపూర్‌లోని వైల్డ్ గోట్ కేఫ్, గచ్చిబౌలిలోని హార్ట్ కప్ కేఫ్‌తో పాటు వేర్వేరు చోట్ల కలుసుకొని తనపై కుట్రలు చేస్తూ వచ్చారని వివరించారు. తనతోపాటు తన కుటుంబ సభ్యుల కదలికలను గమనిస్తూ వస్తున్నారన్నారు. ఈ క్రమంలో తన ఫోన్‌ను కూడా ఇంటర్ సెప్ట్ చేస్తూ వచ్చారని పేర్కొన్నారు. తన న్యాయవాదితో మాట్లాడిన సంభాషణలను కూడా రికార్డు చేసినట్టుగా తెలిపారు. అంతటితో ఆగకుండా తన తండ్రి, కుటుంబ సభ్యులైన భాగ్యలక్ష్మి, కాకాణి అరుణతోపాటు తన న్యాయవాది ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. బ్లాక్‌మెయిలింగ్‌లో భాగంగా గౌతమి, సీఈవోతో కలిసి తనపై తప్పుడు క్రిమినల్ కేసు కూడా నమోదు చేయించినట్టు తెలిపారు. తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ మానసికంగా హింసకు గురి చేస్తున్న ఇద్దరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
