T.G. Gurukul schools
Top Stories, సూపర్ ఎక్స్‌క్లూజివ్

Telangana:నాణ్యతేది ‘గురు’?

  • బీఆర్ఎస్ పాలనలో గురుకుల పాఠశాలల తీరు అధ్వానం
  • నిధులన్నీ ప్రజాప్రతినిధుల కైంకర్యం
  • కాంట్రాక్టర్లతో కలిసి కుమ్మక్కు
  • పక్కాభవనాలు లేక మూతపడిన ఇంజనీరింగ్ కళాశాలల్లో నిర్వహణ
  • విద్యార్థులకు కనీస సదుపాయాలు లేక సతమతం
  • నాసిరకం ఆహారంతో నానా పాట్లు
  • గురుకులాలలో చదివే విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే అధికం
  • పర్యవేక్షణ లోపంతో గతేడాది అమానుష ఘటనలు
  • గురుకులాల ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు

BRS debilitating Gurukul education system during 10 years :
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో గొప్పగా చెప్పుకున్న పథకం పేద విద్యార్థలకు గురుకులాల ఏర్పాటు. గురుకులాల వ్యవస్థ తో పేద విద్యార్థులకు కేజీ టూ పీజీ నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పారు గతపాలకులు. నాణ్యమైన విద్యను పక్కపబెడితే..సౌకర్యాలు మాత్రం అత్యంత దుర్భర పరిస్థితిలో ఉన్నాయి. తెలంగాణలో 9 వందలకు పైగా గురుకులాలు ఉన్నాయి. 600కు పైగా గురుకులాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని చోట్ల పక్కా భవనాలు లేకపోవడంతో మూసేసిన ఇంజనీరింగ్ కళాశాలలలో, ఫంక్షన్ హాళ్లలో గురుకులాలను నిర్వహస్తున్నారు. కొత్తగా తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ గురుకులాల ప్రక్షాళనపై దృష్టి పెట్టింది. గత ప్రభుత్వ లోపాలను సరిచేసేందుకు కసరత్తు చేస్తోంది.


ఒక్కో క్యాంపస్ లో నాలుగయిదు

బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నామని చెబుతూ అంతర్గతంగా విద్య, విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించింది. పేదలకు విద్యను అందించే గురుకులాలను అపహాస్యం చేసింది. కనీస సదుపాయాలు కల్పించలేక చేతులెత్తేసింది. ఒక్కో క్యాంపస్ లో నాలుగు, ఐదేసి గురుకులాలను నిర్వహించడంతో అంత మంది విద్యార్థులకు టాయిలెట్లు, బాత్రూంలో, డార్మెట్‌ హాల్‌, డైనింగ్‌ హాల్‌, తరగతి గదులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు గురుకులాల్లో నిరుపేద విద్యార్థులు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు ఫుడ్‌ పాయిజనింగ్‌, పాముకాటులు నిత్యకృతమయ్యాయి. మహిళ అభివృద్ధి అంటూ కేజీవీబీ ఏర్పాటు చేసినప్పటికీ ఎక్కడా కూడా సొంత భవనాలు లేక నిర్వహణ సరిగా లేక వారిపై పర్యవేక్షణ కరువై సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. మహిళా కళాశాలలో యూనివర్సిటీల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పే అనేక అంశాల్లో గురుకుల విద్యావ్యవస్థ ఒకటి. అయితే వీటి నిర్వహణ రోజు రోజుకూ దిగజారుతున్నది. అడ్మిషన్లు మొదలు ఆధునిక భవనాలలేమి, నాసిరకం ఆహారం, నాణ్యతలేని చదువు, లోపించిన పర్యవేక్షణ ఇలా విద్యా వసతుల విషయంలో గురుకులాలు వెనుకబడి లోపభూయిష్టంగా నడుస్తున్నాయి.


అమానుష ఘటనలు

గురుకుల విద్యాసంస్థల్లో చదువు కోసం ఎదురుచూస్తున్న వారు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, పేదలు. వీటిలో అణగారిన కులాల, వర్గాల విద్యార్థుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నది. అలాంటప్పుడు ఆ గురుకులాలను ఎంతో నిబద్ధత, చిత్తశుద్ధితో నిర్వహించినప్పుడే వాటి ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల నిర్వహణలో నిర్లక్ష్యం పెరిగింది. ఎప్పటిలాగే విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్లు ఎక్కాల్సి వస్తోంది. ఆధునిక భవనాల లేమి, వసతుల లేమి సహా.. తేళ్లు, పాములు కరిచి విద్యార్థులు మరణించినా అధికారులకు గానీ, ప్రభుత్వ అధినేతలకు గాని లెక్కేలేదు. మైనార్టీ గురుకుల విద్యార్థినులు చదువుకోవాల్సిన వయసులో గురుకులాల్లో తల్లులు అవుతుంటే పరిస్థితిని ఏమని అర్థం చేసుకోవాలి? గత విద్యా సంవత్సరం సంగారెడ్డి జిల్లాలో మైనార్టీ గురుకుల విద్యార్థిని గురుకులంలోనే ప్రసవించిన ఘటన గురుకుల విద్యావ్యవస్థ తీరును నిలదీసింది. ఇలాంటి సంఘటనలు మానవత్వానికే మచ్చ అని గుర్తెరిగి అధికారులు, ప్రిన్సిపాల్, టీచర్లు బాధ్యతగా ఉండాలి కదా ? రాజకీయ నాయకుల, కాంట్రాక్టర్ల అవసరాలని గుర్తుంచడమేనా వీరి బాధ్యత? పరిస్థితిని చక్కదిద్దాలంటే ఈ వ్యవస్థలోని పైస్థాయి అధికారులు అయిన కార్యదర్శుల నుంచి కింది స్థాయి అధికారులు అనునిత్యం ప్రతి గురుకులంలో ఆకస్మిక తనిఖీలు చేయాల్సి ఉంది.

నాణ్యత లేని చదువులు

ప్రభుత్వం విద్య కోసం, ఆయా వర్గాల సంక్షేమం కోసం చేసే ఖర్చును తాము భవిష్యత్‌ తెలంగాణకు పెట్టుబడిగా చూస్తామని గొప్పగా చెప్పుకుంటున్నంత మేర నిధుల కేటాయింపు చేయడం లేదు. నిర్వహణ విషయంలో పైస్థాయి అధికారులను ప్రత్యేకంగా నియమించకపోవడం వల్ల వ్యవస్థ నిర్లక్ష్యానికి గురవుతున్నది. విద్యార్థుల సమస్యలను, భవనాల నిర్వహణ, భోజనం, కనీస వసతులు, నాణ్యమైన చదువు తదితర అంశాలను పట్టించుకోవడం లేదు. కార్యదర్శి స్థాయి అధికారులు హైదరాబాద్‌లోని ఆయా సంస్థల కేంద్ర కార్యాలయాలకే పరిమితం అవడం, క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ లేక పోవడం వల్ల ఆర్‌సీవో, ఆర్‌ఎల్‌సీలు, ప్రిన్సిపాల్​తో కాంట్రాక్టర్లు కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీసీ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా, మైనార్టీ, సాంఘిక సంక్షేమ గురుకులాలలో ప్రతిరోజు ఏదో ఒక చోట తమ సమస్యల పరిష్కారానికి స్టూడెంట్లు ఆందోళనలు చేస్తున్నారు.

నైతిక బాధ్యత లేదా?

తెలంగాణ ఆవిర్భావం తరువాత విద్యార్థి సంఘాలను, విశ్లేషకులను, సామాజిక ఉద్యమ శక్తులను విద్యాలయాలలోనికి రానివ్వడం లేదు, దీంతో వాటిలో ఏం జరుగుతుందో ఆ నోట ఈ నోట సమాచారం తెలుస్తున్నదే తప్ప ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. అసలు ఈ విద్యాసంస్థల్లో చదివేదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గాల పిల్లలు. ఇందులో చదువు చెప్పేది కూడా ఈ వర్గాల నుంచి వచ్చిన ఉద్యోగస్తులే అధిక శాతం ఉంటారు. పాలకులకు లేకపోయినా కనీసం ఈ వర్గాల అధికారులు, ఉద్యోగస్తులకు నైతిక బాధ్యత ఉండాలి.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు