Illegal mining in brs regime
Top Stories, క్రైమ్

Mining: మైనింగ్.. మ్యాటర్స్.. తెలిసింది గోరంతే.. తెలియాల్సింది కొండంత!

– మైనింగ్ మాఫియాలో పైకి కనిపించేదంతా వేరు
– తెరచాటు బాగోతాలెన్నో
– అడ్డగోలు తవ్వకాల్లో గ్రానైట్, ఇసుక, క్రషర్
– ఎకో జోన్ లలో ఇప్పటికీ తవ్వకాలు
– ఇసుక మాఫియాపై ఎన్జీటీ రూ.50 కోట్ల ఫైన్
– ఏరియాలుగా పంచుకున్న బీఆర్ఎస్ నేతలు
– గూడెం బ్రదర్స్ ఇళ్లలో ఈడీ సోదాలు
– వెలుగులోకి ఆనాటి మైనింగ్ అక్రమాలు
– అవినీతిలో నెంబర్ వన్ గా విజిలెన్స్ అధికారులు
– పెనాల్టీల పేరుతో నేతల్ని లొంగదీసుకున్నదెవరు?
– ఇన్నాళ్లూ మైనింగ్ మాఫియాను పెంచి పోషించింది ఎవరు?

‘స్వేచ్ఛ’ ఎక్స్ క్లూజివ్

దేవేందర్ రెడ్డి, 9848070809

స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు బీఆర్ఎస్ నేతలు తెలంగాణను దోచేశారు. ఏ రంగంలో చూసినా వీళ్ల అవినీతి నీడలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ఆరని చిచ్చుగా రగులుతుంటే, కరెంట్ కొనుగోళ్ల సెగలు మరింత హీట్ పెంచుతున్నాయి. ఇదే సమయంలో మైనింగ్ పేరుతో గులాబీ నేతలు చేసిన దందాలు వెలుగుచూస్తున్నాయి. దీనికి కారణం పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి చెందిన మూడు ప్రదేశాల్లో ఈడీ సోదాలకు దిగడమే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మైనింగ్ మాఫియా ఆగడాలు చర్చనీయాంశమయ్యాయి.

గూడెం గ్రానైట్ దోపిడీ

గురువారం ఉదయం 8 గంటలకు మహిపాల్ రెడ్డి ఇంటి తలుపు తట్టింది ఈడీ. ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా అధికారులు సోదాలకు దిగారు. ఎమ్మెల్యేకు సంబంధించిన సంతోష్ గ్రానైట్ కంపెనీలోనూ తనిఖీలు కొనసాగాయి. అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఇప్పటికే మధుసూదన్ రెడ్డితో పాటు మహిపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే సోదాలు చేపట్టారు ఈడీ అధికారులు. గతంలో ఆర్డీఓ నేతృత్వంలో జరిగిన విచారణలో అక్రమ మైనింగ్ గుర్తించారు. నగర శివారులోని లక్డారంలో నమోదైన కేసు ఆధారంగా సోదాలు చేపట్టింది ఈడీ. పెద్ద ఎత్తున బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అయితే, ఈడీ అడిగిన ప్రశ్నలకు గూడెం బ్రదర్స్ సమాధానం చెప్పలేదని సమాచారం. భూగర్భ గనుల శాఖకు భారీ మొత్తంలో సీనరేజీని ఎగవేసినట్టు ఈడీ గుర్తించి, రూ.341 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో మూడు రకాల మైనింగ్ మాఫియా

సహజ వనరులకు తెలంగాణ నిలయం. ముఖ్యంగా మైనింగ్ జోరుగా సాగుతుంటుంది. ఈ మైనింగ్ అనేది మూడు రకాలుగా జరుగుతుంటుంది. ఒకటి గ్రానైట్, రెండు ఇసుక, మూడు క్రషర్. వీటిలో గ్రానైట్, ఇసుక చాలా కీలకం. బలమున్నోడిదే రాజ్యం అన్నట్టు, బీఆర్ఎస్ హయాంలో ఈ మూడింటిలో వందల కోట్ల వ్యాపారం సాగింది. రూల్స్ అతిక్రమించి మరీ దందాలు కొనసాగాయి. పదేళ్లకు ముందు స్కూటర్లపై తిరిగిన వాళ్లు, ఇప్పుడు బెంజ్ కార్లలో తిరుగుతున్నారంటే, అది మైనింగ్ పుణ్యమే.

గ్రానైట్ మాటున దోచేసిన గులాబీ లీడర్లు

రాష్ట్రంలో గ్రానైట్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బ్లాక్ గ్రానైట్, రెండోది కలర్ గ్రానైట్. కొన్ని కంపెనీలు సరైన అనుమతులు లేకుండానే సాగుతున్నాయి. అలాగే, నిబంధనలకు అతిక్రమించి మరీ తవ్వకాలు చేస్తున్నాయి. విజిలెన్స్ అధికారులు అప్పుడప్పుడు రెయిడ్స్ చేసినా, సరైన చర్యలు ఉండడం లేదు. కొందరు అధికారులు సదరు కంపెనీలతో కుమ్మక్కు అవుతుండడమే ఇందుకు కారణం. గ్రానైట్ విషయంలో కేవలం మహిపాల్ రెడ్డే కాదు, గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర కూడా కేసులు ఎదుర్కొంటున్నారు. గతంలో వీరు ఇతర పార్టీల్లో ఉండేవారు, కేసీఆర్ ఈ లింకులనే ఉపయోగించి తన వైపునకు తిప్పుకున్నట్టు ఆరోపణలున్నాయి. తర్వాత బీఆర్ఎస్ హయాంలో రెచ్చిపోయి తవ్వకాలు చేసి సహజ సంపదను దోచేశారనే ఆరోపణలు వచ్చాయి. గంగుల కమలాకర్ వైజాగ్ మీదుగా విదేశాలకు కలర్ గ్రానైట్ సప్లయ్ చేస్తుంటారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ మనుషులు, కేటీఆర్ మనుషులు ఇలా చాలామంది బీఆర్ఎస్ లీడర్లు మైనింగ్ మాఫియాలో ఇన్వాల్స్ అయినట్టు విమర్శలున్నాయి.

ఇసుక తవ్వకాల్లోనూ అంతే!

గత 9ఏళ్లలో ఇసుక మాఫియాకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మేడిగడ్డకు దగ్గరలో దాదాపు 5 కోట్ల మెట్రిక్ క్యూబిక్ మీటర్లు తవ్వేశారు. మానేరు డ్యాం దగ్గర కూడా తవ్వకాలు జరిపితే, ఎన్జీటీ రూ.50 కోట్ల ఫైన్ వేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దీన్ని కట్టాలా వద్దా? అని సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు చూస్తోంది. ఇసుక మైనింగ్ వల్ల ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చిందని గులాబీ లీడర్లు చెప్పినా, విచ్చల విడిగా అక్రమంగా ఇసుక మాఫియా లాభపడిందనే ఆరోపణలున్నాయి.

సరైన అనుమతులు లేకుండానే!

ఎక్కడైనా మైనింగ్ చేయాలంటే, ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ (ఈసీ’, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు క్లియరెన్స్(పీసీబీ) అవసరం. కానీ, సరైన అనుమతులు లేకుండానే తొమ్మిదిన్నరేళ్లు బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన సంస్థలు రెచ్చిపోయి తవ్వకాలు సాగించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎకో సెజ్ లలో కూడా కొండలను పిండి చేసేశారని అంటున్నారు. హైదరాబాద్ శివారులోని మహావీర్ వనస్థలి ఎకో జోన్. అలాగే, పాకాల దగ్గర ఎకో జోన్ ఉంది. వీటి దగ్గర కొన్ని కంపెనీలు ఇల్లీగల్ గా గ్రానైట్ తవ్వకాలు జరుపుతున్నాయి. దానికి సంబంధించి ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కొత్త ప్రభుత్వంలో ఆఫీసర్లను మార్చి, దాడులు చేస్తున్నారు తప్ప చర్యలు ఉండడం లేదు. విష్ణు గ్రానైట్ అనేది కృష్ణ అగర్వాల్ కు సంబంధించిన కంపెనీ. 2022లో ఓ కేసులో హైకోర్టులో కేసు వేసినా, అధికారులు కుమ్మక్కయ్యారు. అంతేకాదు, ఎక్కువ ఫైన్ వేస్తే కోర్టులకు వెళ్లి స్టే లు తెచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. 1998 నుంచి ప్రముఖ కంపెనీల కేసులు ఇప్పటికీ కొనసాగుతున్నాయంటే అర్థం చేసుకోండి.

Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?