BJP on Minister Post: టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin).. నేడు తెలంగాణ కేబినేట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే అజారుద్దీన్ ప్రమాణ స్వీకారాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పొలిటికల్ స్టంట్ గా దీన్ని అభివర్ణిస్తోంది. మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం చేయకుండా అడ్డుకోవాలంటూ ఎన్నికల సంఘానికి సైతం బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే మంత్రి పదవి అంశంలో బీజేపీ ఆడుతున్న డబుల్ గేమ్ బట్టబయలు అయ్యింది.
అక్కడ ఒకలా.. ఇక్కడ మరొకలా
రాజస్థాన్ లో ప్రస్తుతం భజన్ లాల్ శర్మ (Bhajan Lal Sharma) నేతృత్వంలోని బీజేపీ పార్టీనే అధికారంలో ఉంది. అయితే 2024లో అక్కడ ఉపఎన్నికలు జరిగాయి. గంగాపూర్ జిల్లా కరణ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కుర్మీత్ సింగ్ కూనర్ అకస్మిక మరణంతో గతేడాది జనవరి 5న ఉపఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సురేంద్ర పాల్ సింగ్ కు సరిగ్గా ఆరు రోజుల ముందు మంత్రి పదవి కట్టపెట్టింది. డిసెంబర్ 30, 2023లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది. అలాంటి బీజేపీ.. ఇప్పుడు తెలంగాణ జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు వచ్చేసరికి అజారుద్దీన్ కు పదవి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరి చాలా హాస్యస్పదంగా ఉందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నారు.
టీపీసీసీ చీఫ్ ఫైర్..
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీ అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిని గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్రంగా ఎండగట్టారు. రాజస్థాన్ లో ఒక నీతి.. తెలంగాణలో మరొక నీతా అంటూ బీజేపీని ప్రశ్నించారు. రాజస్థాన్ లో పోటీలో ఉన్న అభ్యర్థిని మంత్రిని చేయగా లేని తప్పు.. ఇక్కడ పోటీలో లేని అజారుద్దీన్ ను కేబినేట్ లోకి తీసుకుంటే వచ్చిందా? అని నిలదీశారు. అజారుద్దీన్ ను మంత్రి వర్గంలోకి తీసుకుంటే మీకొచ్చిన నొప్పి ఏంటని ఘాటుగా ప్రశ్నించారు. ఆరు నూరైన అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకొని తీరుతామని బీజేపీకి స్పష్టం చేశారు. అటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) సైతం మంత్రి పదవి విషయంలో బీజేపీ అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు.
Also Read: IND-W vs AUS-W Records: సెమీస్‌లో జెమీమా రోడ్రిగ్స్ మైల్‌స్టోన్ ఇన్నింగ్స్.. బద్దలైన రికార్డ్స్.. అమ్మాయిలు ఇరగొట్టేశారు!
బీఆర్ఎస్ కోసమేనా?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS)కు మేలు చేకూర్చేలా బీజేపీ పార్టీ (BJP Party) వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. తాజాగా అజారుద్దీన్ అంశం దీనికి బలాన్ని చేకూరుస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ (Congress vs BRS) మధ్య ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల్లో బీజేపీ ప్రభావం నామమాత్రంగానే ఉంటుందని పేర్కొంటున్నాయి. అయినప్పటికీ బీజేపీ.. కాంగ్రెస్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తుండటం వెనుక బీఆర్ఎస్ తో చేసుకున్న లోపాయికారి ఒప్పందమే కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన పోటీదారైన బీఆర్ఎస్ కు లేని ఇబ్బంది.. బీజేపీకి ఏంటన్న ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి.
కాంగ్రెస్ వ్యూహాం?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు (JUbilee Hills Bypoll) సమీపిస్తున్న తరుణంలో అజారుద్దీన్ కు కేబినేట్ లో చోటు కల్పించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ముస్లింల ఓటు బ్యాంకును ఆకర్షించడమే ఈ నిర్ణయం వెనుకున్న ముఖ్య ఉద్దేశమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. పైగా అజారుద్దీన్ కు జూబ్లీహిల్స్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉండటం.. గతంలో అక్కడి నుంచి పోటీ చేసి 64 వేల ఓట్ల వరకూ సాధించడం తమకు కలిసివస్తుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. ఉపఎన్నికల సమయంలో అజారుద్దీన్ ను కేబినేట్ లోకి తీసుకోవడంపై బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

