Bandla Ganesh: ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh) సినీ నిర్మాణానికి కొంతకాలంగా దూరంగా ఉన్నప్పటికీ, ఇటీవల కాలంలో తన మాటలు, చేష్టలతో మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ‘తెలుసు కదా’ సినిమా సక్సెస్ మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి. త్వరలోనే తాను ‘సెకండ్ ఇన్నింగ్స్’ (Second Innings) ప్రారంభించబోతున్నానని, ఇకపై సినిమా అంటే ఏంటో చూపిస్తానని ఆయన చేసిన ప్రకటన.. సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ ఈవెంట్‌కు కొద్ది రోజుల ముందు చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్ హీరోలను పిలిచి బండ్ల గణేష్ గ్రాండ్‌గా దీపావళి పార్టీ (Diwali Party) ఇవ్వడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇది కేవలం రీ ఎంట్రీ కోసం చేస్తున్న ప్రయత్నమనే ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. ఇప్పుడు ‘సెకండ్ ఇన్నింగ్స్’ గురించి ఆయన స్వయంగా మాట్లాడటంతో, బండ్లన్న రీ ఎంట్రీ కన్ఫర్మ్ అయినట్లే భావించవచ్చు.
Also Read- The Girlfriend: నేషనల్ క్రష్ ‘ద గర్ల్ ఫ్రెండ్’ ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
స్టార్ హీరోలతో సినిమాలు
అయితే, ఆయన తదుపరి అడుగు ఎలా ఉండబోతోందనే విషయంపై ఇండస్ట్రీలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ‘గబ్బర్ సింగ్, బాద్ షా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన బండ్ల గణేష్, తన రీ ఎంట్రీలోనూ స్టార్ హీరోలైన చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లేదా ఇతర అగ్ర హీరోల డేట్స్ కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. స్టార్ హీరోలు గనుక అందుబాటులో లేకుంటే, చిన్న సినిమాలు, అప్‌కమింగ్ హీరోలతో ముందుకు సాగాలనే ప్రత్యామ్నాయ ప్రణాళికతో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రణాళికకు బలం చేకూరుస్తున్నట్లుగా, ఇటీవల జరిగిన ఒక ఈవెంట్‌లో యంగ్ హీరో తేజ సజ్జా (Teja Sajja)పై బండ్ల గణేష్ కురిపించిన ప్రశంసలను ఉదహరిస్తున్నారు. తేజ సజ్జాను ‘నెక్స్ట్ అల్లు అర్జున్’గా అభివర్ణించడం చూస్తుంటే.., బండ్ల గణేష్ చిన్న సినిమాలు, కొత్త టాలెంట్‌తోనూ సినిమాలు తీసేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతం కనిపిస్తోంది.
Also Read- Sree Vishnu: దగ్గరలో ఏదైనా బార్ ఉందా?.. శ్రీ విష్ణు హీరోయిన్.. ఇలా అడిగేసిందేంటి?
తక్కువ బడ్జెట్ సినిమాలు కూడా..
అలాగే ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) తరహాలో తక్కువ బడ్జెట్‌లో, బలమైన కంటెంట్‌తో కూడిన చిత్రాలు నిర్మిస్తూనే, మరోవైపు స్టార్ హీరోల డేట్స్ కోసం ప్రయత్నించి, తన మార్క్ ఉండే బిగ్ బడ్జెట్ సినిమాలను కూడా తీయాలనేది బండ్ల గణేష్ వ్యూహంగా కనిపిస్తోంది. ‘లిటిల్ హార్ట్స్’ హీరో మౌళిపై బండ్ల గణేష్ కురిపించిన ప్రశంసలు కూడా ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. మొత్తానికి, ‘సినిమా అంటే ఏంటో చూపిస్తా’ అంటూ బండ్ల గణేష్ ప్రకటించిన ఈ ‘సెకండ్ ఇన్నింగ్స్’ ఎటువంటి అద్భుతాలను సృష్టిస్తుందో చూడాలి. ఆయన రాకతో తెలుగు చిత్ర పరిశ్రమ మరింత ఉత్సాహభరితంగా మారడం ఖాయం. ‘తెలుసు కదా’ ఈవెంట్‌లో మరో యంగ్ నిర్మాత ఎస్‌కెఎన్ కూడా బండ్ల గణేష్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అలాంటి నిర్మాత కామ్‌గా ఉండటం నచ్చలేదని, మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకున్న విషయం తెలిసిందే. చూద్దాం.. మరి బండ్లన్న రీ ఎంట్రీ ఎలా ఉండబోతోందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
