- ఒక్కొక్కటిగా బయటకొస్తున్న నీట్ అవకతవకలు
- క‘న్నీట్’పాలవుతున్న విద్యార్థులు
- అవినీతి, అక్రమాలకు నెలవుగా మారిన ఎన్టీఏ
- ఎన్టీఏను పెంచి పోషిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం
- అవకతవకలు జరిగాయని ఒప్పుకున్న కేంద్ర మంత్రి
- బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే అవకతవకలన్నీ..
- నీట్ లో ఎన్నడూ లేనన్ని నూరు శాతం మార్కులు
- ఎప్పుడూ ఇద్దరు లేక ముగ్గురికే నూరు శాతం
- ఈ సారి ఏకంగా 67 మందికి నూరు శాతం మార్కులు
- ఒక్కో విద్యార్థి నుంచి లక్షలు వసూళ్లు
Countrywide suffering with NEET irregularities
దేశవ్యాప్తంగా ప్రతి ఏటా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో విద్యార్థుల పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన పెద్ద ప్రహసనంగా మారింది. వీటి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం నియమించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పాదర్శకంగా పనిచేయకపోవడం వలన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తిప్పలు తప్పడం లేదు. ఎన్టీఏ నిర్వాకంతో లక్షలాది విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. నీట్ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలోనూ అనేక పరీక్షల నిర్వహణలో ఎన్టీఏ సంస్థ విమర్శలను ఎదుర్కొంది. ప్రస్తుతం వివాదానికి కారణమైన నీట్ విషయంలనూ తన తీరు మార్చుకోలేదు. నీట్ ఫలితాలను వెల్లడిస్తున్నట్లు కనీసం గంట ముందు కూడా అధికారికంగా ప్రకటించలేదు. తీరా ఫలితాలపై 20 పేజీల పత్రికా ప్రకటనను జారీ చేసిన ఎన్టీఏ అందులో 1563 మందికి గ్రేస్ మార్కులు కలిపామనే అంశాన్ని ప్రస్తావించకపోవడం సంస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకంగా మార్చింది.
ఎట్టకేలకు ఒప్పుకున్న మంత్రి
నీట్‌లో ఎలాంటి అక్రమాలు జరుగలేదని వాదించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. అక్రమాలు జరిగిన మాట నిజమేనని తాజాగా ఒప్పుకొన్నారు. నీట్ అక్రమాలు గుజరాత్, బీహార్‌లో వెలుగుచూడటం.. అక్కడ ఎన్డీయే కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉండటం రాజకీయంగానూ చర్చనీయాంశమైంది. ఈ ఏడాది మే 5న నిర్వహించిన నీట్ యూజీ-2024 పరీక్షకు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, ర్యాంకుల ప్రకటన విఝయంలో ఎన్టీఏ వ్యవహరించిన తీరు ఆదినుంచీ అనుమానాస్పదంగానే ఉంది. 2019 నుంచీ ఎన్నడూలేని విధంగా ఈ సారి ఏకంగా 67 మందికి 720కి 20 మార్కులు రావడంతో అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది. 2019, 2020 లో ఒక్కొక్కరికి మాత్రమే 720 మార్కులు వచ్చాయి. 2021లో ముగ్గురు, 2022లో ఒక్కరు2023లో ఇద్దరు మాత్రమే నూటికి నూరుశాతం మార్కులు తెచ్చుకున్నారు. ఒక్కసారిగా 67 మందికి గంపగుత్తగా 720 మార్కులు ఎలా వచ్చాయని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలో ఒకే సెంటర్ లో పరీక్షలు రాసిన ఆరుగురికి 720కి 720 మార్కులు వచ్చాయి. కొన్ని పరీక్ష కేంద్రాలలో సాంకేతిక సమస్యలు రావడంతో నీట్ పరీక్ష కొన్ని చోట్ల ఆలస్యంగా మొదలైంది. దీనితో 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపినట్లు ఎన్టీఏ వెల్లడించింది.
టాపర్లకు కూడా గ్రేస్ మార్కులు
గ్రేస్ మార్కులు కలిపిన వారిలో కొందరు టాపర్లు కూడా ఉన్నారు. అయితే, ఏ ప్రాతిపదికన ఈ మార్కులు కలిపారు? దీని కోసం ఏ నిబంధనలను పాటించారు? అని ఎన్టీఏను పలువురు ప్రశ్నించారు. వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో వెనక్కి తగ్గిన ఎన్టీఏ తిరిగి ఆ అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని తేలిగ్గా చెప్పింది. ఇక అవకతవకలనుంచి దృష్టి మళ్లించడానికి దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాల రోజు అంటే జూన్ 4న ఫలితాలు విడుదల చేసింది.
గుజరాత్, బీహార్
గుజరాత్‌లోని పంచమహ జిల్లా గోద్రా పట్టణంలోని ఓ సెంటర్‌లో ఖాళీ ఓఎమ్మార్ షీట్‌లను ఇచ్చి వెళ్లమని విద్యార్థులకు టీచర్లు సూచించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలా 27 మంది విద్యార్థులతో వీరికి రూ.10 నుంచి 12 లక్షల చొప్పున బేరం కుదిరినట్లు సమాచారం. అలాటే బీహార్ లో ఒక్కో విద్యార్థినుంచి రూ.30 నుంచి 35 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.