CM Revanth Reddy: ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువచ్చేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ముఖ్యంగా భూ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆదివారం శిక్షణ పొందిన సర్వేయర్లకు లైసెన్స్‌లు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణలో ప్రతీ పోరాటం భూమి చుట్టూనే జరిగిందన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నాడు సాయుధ రైతాంగ పోరాటం జరిగిందని వివరించారు. భూమిని కన్న తల్లిలా మనమంతా భావిస్తామని అన్నారు.
గత ఎన్నికల్లో..
భూ యజమానుల హక్కులను కాపాడి, భూ సరిహద్దులను నిర్ణయించే బాధ్యత లైసెన్స్ సర్వేయర్లపై పెట్టబోతున్నామన్నారు. ఈ క్రమంలో సర్వేయర్ తప్పు చేస్తే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందన్నారు. అందుకే ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. గత ప్రభుత్వంలో తెచ్చిన ధరణి చట్టం కొద్ది మంది దొరలకే చుట్టంగా మారిందని మండిపడ్డారు. ధరణి భూతాన్ని పెంచి పోషించి భూమిపై ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్న దొరలకు గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఎన్నికల కంటే ముందే ధరణి దరిద్రాన్ని వదిలిస్తామని హామీ ఇచ్చామని, పవర్‌లోకి రాగానే ప్రజలకు విముక్తి కల్పించామన్నారు.
Also Read: Afghan Cricketers Died: పాకిస్థాన్ వైమానిక దాడులు.. ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లు మృతి
నియామకాలపై గత పాలకులు నిర్లక్ష్యం
భూ భారతిని తీసుకువచ్చి మేలు చేయబోతున్నామన్నారు. ఇక, పదేళ్లుగా ఉద్యోగ నియామకాలపై గత పాలకులు నిర్లక్ష్యం వహించారని సీఎం అన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగ నియామక ప్రక్రియను చేపట్టి నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామని తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా తెలంగాణ(Telangana)ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యం అని చెప్పారు. ఆ దిశగా ముందుకెళ్లేందుకు అందరి సహకారం ఉండాలన్నారు. రైతులందరికీ అండగా నిలిచి రాష్ట్రానికి మంచి పేరు తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని సీఎం సూచించారు.
