- ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన ‘సిట్’
- కీలక సమాచారం రాబట్టిన సిట్ దర్యాప్తు బృందం
- వణికిపోతున్న నల్లగొండ పోలీసు యంత్రాంగం
- కేసుకు సంబంధించిన కీలక సాంకేతిక ఆధారాలు లభ్యం
- కొండాపూర్ కన్వర్టెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ కార్యాలయంలో తనిఖీలు
- సర్వర్లు, హార్డ్ డిస్కులతో పాటు కొన్ని మినీ డివైజ్ లు సీజ్
- సంస్థ డైరెక్టర్ బూసి పాల్ రవికుమార్ ఇచ్చిన కీలక సమాచారం
- మేజిస్ట్రేట్ ఎదుట ఒప్పుకున్న రవికుమార్
- సిట్ నెక్ట్స్ టార్గెట్ రాజకీయ నాయకులే..
Munugodu bypoll effect SIT enquiry speedup Phone tapping:
ఎన్నికల కోడ్ తో కొద్దిగా మందగించిన ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఊపందుకుంది. కోడ్ కారణంగా రాజకీయ నాయకులను విచారించని దర్యాప్తు బృందం ఇప్పుడు ఆ ప్రక్రియ వేగవంతం చేసే పనిలో నిమగ్నమయింది. కాగా రాష్ట్రంలోనే పెను సంచలనం క్రియేట్ చేసిన మునుగోడు ఉప ఎన్నికల వ్యవహారం ఇప్పుడు నల్లగొండ పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో నల్లగొండ పరిధిలో పనిచేసిన పోలీసు యంత్రాంగం ఏ క్షణాన ఏం ముంచుకొస్తుందో అని ఆందోళన పడుతున్నారు. ఇక స్పెషల్ ఇంటిలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)లో చట్టవిరుద్ధంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ దందాపై సాంకేతిక ఆఱారాలు సేకరిస్తున్న సిట్ బృందానికి ఇప్పటికే కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక టైమ్ లో అప్పటి అధికార బీఆర్ఎస్ కు కొందరు పోలీసు అధికారులు అనుకూలంగా వ్యవహరించారని..భారీ మొత్తంలో డబ్బును టాస్క్ ఫోర్స్ వాహనాలలో తరలించాలరని వచ్చిన ఆరోపణలపై కీలక ఆధారాలు సిట్ కు లభించాయని తెలుస్తోంది.
నల్లగొండ పోలీసుల మెడకు ఉచ్చు
మునుగోడు ఉప ఎన్నిక పోలీసుల మెడకు ఉచ్చుగా మారుతోంది. సిట్ విచారణలో వెలుగు చూస్తున్న అక్రమాల మకిలీ మొత్తం నల్లగొండ జిల్లా పోలీసు యంత్రాంగానికి శాపంగా మారనుంది. ఈ అక్రమ వ్యవహారంపై సీట్ దర్యాప్తులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ కొండాపూర్ లోని కన్వర్టెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టింది సిట్ దర్యాప్తు బృందం. అక్కడ దొరికిన సర్వర్లు, హార్డ్ డిస్క్లతో పాటు కొన్ని మినీ డివైజ్ లను జప్తు చేసింది సిట్. ఎస్ఐబీ లో ఫోన్ ట్యాపింగ్ జరిపేందుకు కావలసిన టెక్నికల్ సహకారాన్ని సదరు ఈ సంస్థే సమకూర్చింది. దీనితో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన యాక్సెస్ లాగ్స్, సెర్చ్ లాగ్స్ కోసం సంస్థ డైరెక్టర్ బూసి పాల్ రవికుమార్ కు నోటీసులు ఇచ్చింది సిట్ సంస్థ. ఆయన నుంచి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
రవికూమార్ స్టేట్ మెంట్ కీలకం
రవికుమార్ ఇచ్చిన సమాచారం ఈ కేసుకు కీలకంగా మారనుంది. రవికుమార్ తో మేజిస్ట్రేట్ ఎదుట 160 సీఆర్పీ కింద వాంగ్మూలం ఇప్పించింది సిట్. అంతేకాదు కన్వర్టెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ సంస్థలో పనిచేస్తున్న మేనేజర్ రాగి అనంతచారి, మరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఓలేటి సీతారామ శ్రీనివాస్ ల నుంచి కీలక సమాచారం రాబట్టడమే కాకుండా వారితో కూడా మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలాలు చెప్పించింది సిట్. ప్రస్తుతం ల్యాబ్స్ లో జప్తు చేసిన పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించి విశ్లేషించే పనిలో నిమగ్నమయింది సిట్ బృందం.
టెలికాం అనుమతులు ఎలా ఇచ్చింది?
సంఘవిద్రోహ శక్తులు, కరడుగట్టిన నేరస్థుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు మాత్రమే టెలికాం కంపెనీలు అనుమతి ఇస్తుంటాయి. అందుకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదం తప్పనిసరి. అయితే ప్రభాకర్‌రావు బృందం చట్టవిరుద్ధంగా బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించిన సిట్.. దీనిపై సాంకేతిక ఆధారాల సేకరణకు టెలికాం కంపెనీల నోడల్ అధికారులకు 91 సీఆర్పీ నోటీసులు జారీ చేసింది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీవోటీ) కి సైతం నోటీసులు ఇచ్చింది. వారి నుంచి కూడా కీలక సమాచారం లభించినట్లు తెలుస్తోంది.
సీఐ వాంగ్మూలం
గతేడాది చివర్లో వచ్చిన శాసనసభ ఎన్నికల న ేపథ్యంలో ఆగస్టు నుంచి నవంబర్ చివరి నాటికి సుమారు 1200 సెల్ ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. ఎస్ఐబీ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు, కీలక నిందితుడు ప్రణీత్ రావు ఆదేశాలతో తాను 60 నుంచి 70 ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ బృందానికి ఇప్పటికే ఓ సీఐ వాంగ్మూలం ఇచ్చారు. . అందులో సిద్దిపేటలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసిన చక్రధర్‌గౌడ్‌తోపాటు రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ దాసరి భూమయ్య తదితరుల సెల్‌ఫోన్ సంభాషణలను విన్నట్లు వెల్లడించారు. అలానే ఎస్‌ఐబీతోపాటు టాస్క్‌ఫోర్స్‌ల్లో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బంది పలువురు ప్రభాకర్‌రావు బృందం నిర్వాకాలపై వాంగ్మూలాలు ఇస్తుండటంతో నిందితుల చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సిట్ తదుపరి టార్గెట్ రాజకీయ నాయకులు కానున్నారు.