Neems Boro Smash! No Land But Money Settlement
Top Stories, క్రైమ్

Neems Boro:నీమ్స్ బోరో, భూం.. భూం! ల్యాండ్ ఉండదు కానీ, డబ్బంతా!

– నీటి మూటల్లా నీమ్స్ బోరో మాటలు
– భూమి లేకుండానే అమ్మకాలు
– యర్రబొగుడ, శేరిదామరగిద్ద వద్ద దందా
– గ్రామాల్లోని అమాయకులతో కోట్లలో బిజినెస్
– చెప్పే భూమికి, ఉండే భూమికి చాలా తేడా
– ఒకరికి అమ్మిన ప్లాట్ వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్
– మార్కెటింగ్ పర్సన్స్‌కు మాయమాటలు
– ప్లాట్ ఇస్తానని ఐదేళ్లు మొక్కల పెంపకం పేరుతో కాలయాపన
– లీజు సమయంలో అమ్మకూడదని కండిషన్స్
– 1000 ఎకరాల పేరుతో 500 కోట్ల దోపిడీ
– అక్రమాలకు కేరాఫ్ నీమ్స్ బోరో పార్ట్-3

-దేవేందర్ రెడ్డి (స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం)

Neems Boro Smash! No Land But Money Settlement: నీమ్స్ బోరో ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. నారాయణ్ ఖేడ్ ప్రాంతంలోని భూముల కేంద్రంగా సాగించిన దందా చిన్నదేం కాదు. యర్రబొగుడ, శేరిదామరగిద్ద గ్రామాల్లోని సర్వే నెంబర్ 22, 24, 31, 39, 40, 41, 95లో భూమి ఉంది. ఇక్కడ ఒక గ్రామంలో 75 ఎకరాల 13 గుంటల భూమి, మరో గ్రామంలో 116 ఎకరాల ఒక గుంట భూమి ఉండగా మొత్తం 191 ఎకరాలు అంటూ అమ్మకాలు జరిపింది నీమ్స్ బోరో. కానీ, పొజిషన్‌లో ఉన్నది మాత్రం కేవలం 75 ఎకరాలకు 70 ఎకరాలు, 116 ఎకరాలకు 74 ఎకరాలు. అంటే 46 ఎకరాలకు పైగా తేడా ఉంది. ఆక్సీరిడ్జ్ పేరుతో ధరణిలోని లొసుగుల ద్వారా రిజిస్ట్రేషన్ తతంగం కూడా ముగించారు. ఉన్న భూమి కంటే ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు జరిపారు. 2017లో ఇదంతా జరగగా, తర్వాతి ప్రాజెక్టుల్లోనూ ఇలాగే వ్యవహరించింది నీమ్స్ బోరో. అసలు భూమే లేకుండా అమ్మకాలు జరిపింది. ఒకరికి అమ్మిన ప్లాట్ మళ్లీ వేరే వాళ్లకు చూపించి రిజిస్ట్రేషన్ చేసింది.

వీళ్లు బినామీలేనా?

ఉద్యోగం పేరుతో గ్రామాల నుంచి అమాయక యువకులను తీసుకొచ్చి నీమ్స్ బోరో ఆఫీస్ నుంచి అకౌంట్స్ తీసి వారి పేర్ల మీద కోట్లాది రూపాయల బిజినెస్ చేశారు మురళీకృష్ణ. ఓంకార్, రాజు, నాగేందర్, దత్తు, ఆంజనేయులు పేరుతో దందా సాగించినట్టు తెలుస్తోంది. వీళ్లు ఎవరు, వీరిపై జరిగిన లావాదేవీలు బయటకొస్తే గుట్టంతా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది.

అవకతవకలు ఉన్న నీమ్స్ బోరో వెంచర్లు ఇవే!
1) యర్రబొగుడ
2) వల్లూరు
3) కారసగుత్తి
4) నేచర్ ఉడ్స్
5) ఫార్చ్యూన్ ఉడ్స్
6) ఆక్సీరిడ్జ్
7) ఉడ్ లాండ్స్
8) సన్ షైన్

మార్కెటింగ్ వాళ్లకు మాయ మాటలు

మార్కెటింగ్ పర్సన్స్‌కు మాయమాటలు చెప్పడంలో మురళీకృష్ణ దిట్ట. పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటాడు. కరోనా తర్వాత లెక్కలు తిరగేస్తే 800 ఎకరాల్లో 500 కోట్ల దందా జరిగినట్టు సమాచారం. చివరకు తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మార్కెటింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్‌లో మనోధైర్యాన్ని నింపేందుకు ఛానల్స్‌లో ఇంటర్వ్యూలు ఇస్తూ, తన దగ్గర ఉన్నవాళ్లు వెళ్లిపోకుండా ఏదో ఒక హడావుడి ఉండేలా చూసుకున్నాడు. నీతిమంతుడిలా కలరింగ్ ఇస్తున్నాడు. అందర్నీ బురిడీ కొట్టించిన చక్క సుబ్రమణ్యంకే టోపీ పెట్టాడంటేనే అర్థం చేసుకోండి నీమ్స్ బోరో ఎండీ మురళీకృష్ణ ఎలాంటి వ్యక్తో. మార్కెటింగ్‌కి ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పి మోసం చేసినట్టు సమాచారం. ఓనర్ చెప్పినవన్నీ తప్పకుండా పాటించి మాయమాటలతో అమాయకులకు ఫామ్ ల్యాండ్ ప్లాట్ అంటగట్టింది మార్కెటింగ్ టీమ్. వీరి కింద ఇంకా వందలాది మంది ఏజెంట్లు ఉన్నారు. భారీ కమీషన్లకు ఆశపడి అబద్ధాలు, మోసాలే పెట్టుబడిగా కల్లిబొల్లి కబుర్లతో అమ్మకాలు చేస్తూ దందాలు చేస్తుంటారు.

ఐదేళ్ల కండిషన్

తమవి కాని చుట్టుపక్కల భూములని కూడా వారివే అని చూపిస్తూ అమ్మకాలు జరిపింది నీమ్స్ బోరో. అమ్మిన తర్వాత కస్టమర్ రిజిస్ట్రేషన్‌కు వచ్చినప్పుడు అప్పటికప్పుడు అసలీ లే అవుట్‌కి సంభందం లేని పక్కనున్న శేరిదామరగిద్దలో కొన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసేవారు. అమ్మేటప్పుడు ప్రతీ ప్లాటుకు రోడ్డు ఉంటుందని పోస్టర్లు చూపిస్తారు. కానీ, కొన్న ఎకరా, అరెకరా భూములకు కారు, ట్రాక్టర్ కాదు కదా కనీసం మోటారు సైకిల్ కూడా వెళ్లలేనివే ఎక్కువుంటాయి. నడిచి వెళ్లాలన్నా వేరే వారి భూముల నుండి వెళ్లాలి. వారి పంటలను తొక్కుకుంటూ పోవాలి. అందుకే, ఇక్కడ చాలా భూములు అసలు అడుగు పెట్టలేని పరిస్థితిలో ఉంటాయి. పైగా, చెట్లు పెట్టేందుకు కొంతమందిని తీసుకొచ్చి నాసిరకం మొక్కల పెంపకం చేశారు. సరైన సౌకర్యాలు లేని చోట హడావుడి చేశారు. ప్లాట్ ఇస్తానని చెప్పి ఐదేళ్లు చెట్లు పెంచండి అంటూ మళ్లీ వాళ్ల పేరు మీదే లీజు రాయించాడు మురళీకృష్ణ. లీజు సమయంలో ఐదేళ్ల వరకు అమ్మడానికి వీల్లేదని కండిషన్స్ పెట్టాడు.

భూముల లెక్కల్లో చాలా తేడా

ఫామ్ ప్లాట్‌గా వీరిచ్చే 605 గజాలు/5 గుంటల భూమిని వీరు చూపించినట్లుగా రోడ్లు వేయాలంటే ప్రతీ ఎకరాకు రమారమి 6 ప్లాట్లే వస్తాయి. కానీ, వీరు మొత్తం వచ్చే 8 ప్లాట్లను కూడా గుంటలుగా విభజించి రిజిస్ట్రేషన్ చేయించారు. అసలు వీరు కొన్న కొండలోయల్లో ఉన్న భూములు కూడా పట్టాదార్ పాస్ పుస్తకంలో ఉన్నంత విస్తీర్ణం ఉండదు. చాలా మంది వీరికమ్మిన భూములు ఎక్కడ ఉన్నాయో కూడా వారికి తెలియదు. అవి ఉన్నా వీరికి ఎకరమని చూపించే భూములు ఆ రైతులు చూపించే హద్దుల ప్రకారం కొలిస్తే చాలావరకు 5 నుండి 20 గుంటల వరకూ తక్కువగానే ఉంటాయి. పట్టాదార్ పాస్ పుస్తకంలో ఉంటుంది కాబట్టి ఎకరం భూమి గానే రిజిస్ట్రేషన్ వస్తుంది. దానినే వీరు కస్టమర్లకు 7-8 ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. రిజిస్ట్రేషన్‌లో ఉన్న సర్వే నెంబరుకు వీరు కస్టమర్‌కు చూపించిన స్థలానికి చాలా తేడా ఉంది. సర్వే నెంబర్లు లే అవుట్లలో లేవు కాబట్టి, మీ ప్లాట్ ఇదేనంటూ వందలాది కస్టమర్లకు కూడా డెవలప్ చేసిన కొద్ది ప్లాట్లనే చూపించి నమ్మబలికి మోసం చేశారు. ఈ వెంచర్‌లో వీరమ్మిన 120 ఎకరాల ప్లాట్ల విస్తీర్ణం మునకు, కొండ గుట్టలన్నీ కలిపినా వీరి దగ్గరున్న విస్తీర్ణానికి చాలా తక్కువ భూమే ఉంటుందని అంచనా. యర్రబొగుడ వెంచర్‌లో ప్లాట్ కొన్న కస్టమర్లకు ఎక్కడో 35 కి.మీ. దూరంలో సంబంధం లేని సీర్గాపూర్‌లో రిజిస్ట్రేషన్ ఇచ్చారు. అదేమని అడితే ఈ మెయిన్ వెంచర్‌లో కొన్ని హద్దులు ఆ మండలంలోనివే అని చెప్పినట్లుగా సమాచారం.

‘స్వేచ్ఛ’ కథనాలతో మొదలైన భయం.. యాప్‌లో ప్రాజెక్టు మాయం

కేవలం యాప్ ద్వారా కథంతా నడిపిస్తున్నాడు మురళీకృష్ణ. అయితే, యాప్‌లో ఈమధ్య సన్ షైన్ ప్రాజెక్టును తీసేశాడు. ఒక్కో ప్రాజెక్టుకు యాప్ నుంచి మంగళం పాడుతున్నాడు. ‘స్వేచ్ఛ’ కథనాలతో భయం మొదలై, తప్పులున్న ప్రాజెక్టులను యాప్‌లో సరిచేసుకుంటూ దిద్దుబాటు చర్యలకు దిగాడు. నిజానికి ఫామ్ లాండ్స్‌కు రోడ్లు ఉండవనే ప్రభుత్వ నిర్ణయాలు నీమ్స్ బోరో లెక్కలోకే రావు. భౌతికంగా భూమి లేకున్నా, రికార్డుల్లో ఉండటం, దానికి ధరణి పోర్టల్ అనువుగా ఉండటం, అంతకు మించి ప్రతీ ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు ఆఫీస్‌లలో లెక్క ప్రకారం లంచాలుండటం, ప్రజల కష్టార్జితమైన ఆస్తిపాస్తులను చూసే రిజిస్ట్రారు కార్యాలయాల్లో కూడా భాధ్యత, చర్యలు లేని కాంట్రాక్ట్ సిబ్బందితో వ్యవహారాలన్నీ నడుస్తున్నాయి. దీంతో నీమ్స్ బోరో ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఈ వెంచర్ అమ్మి మరో రెండు మూడేళ్లకు ఏడేళ్లు అవుతుంది. వీరు చెప్పినట్టుగా ఈ యర్రబొగుడ వెంచర్‌లో ప్లాట్ కొన్న కస్టమర్లకు మలబార్ పంట లాభాన్ని కలిపి ప్లాట్లను ఇచ్చి వేయాలి. కానీ, ఈ వెంచర్‌లో 90 శాతం మందికి మొక్కలే లేవు. ప్లాట్లకు దారులు, రోడ్లు కాదు కదా కనీసం కాలిబాట కూడా లేదు. చాలా మందికి అవెక్కడున్నాయో తెలియదు.

ఉడ్ ల్యాండ్స్ దందాపై నెక్ట్స్ కథనం

ఉడ్ ల్యాండ్స్ పేరుతో ఉన్నదంతా ఊడ్చేశాడు మురళీకృష్ణ. అది ఎలా జరిగింది..? అసలేం జరిగింది? అనేది తర్వాతి కథనంలో చూద్దాం.

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?