Bandi Sanjay Kumar: కరీంనగర్ రాంనగర్ సత్యనారాయణ స్వామి టెంపుల్ నుండి ఆర్ఎస్ఎస్ నిర్వహించిన రూట్ మార్చ్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ వస్త్రధారణతో ధరించి కేంద్ర మంత్రి బండి సంజయ్ తోపాటు రాష్ట్రీయ స్వయం సేవక్ రూట్ మార్చ్ లో ఆయన కుమారుడు బండి సాయి సుముఖ్ పాల్గొన్నారు. కరీంనగర్ లో రాష్ట్రీయ సేవక్ సంఘ్ శత జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ స్వయం సేవకులు ఆదివారం భారీ కవాతు ప్రదర్శన చేపట్టారు. శాతవాహన యూనివర్సిటీ రోడ్ లోని వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల నుండి కరీంనగర్ పట్టణంలో పలు ప్రాంతాల మీదుగా రాంనగర్ వరకు రూట్ మార్చ్ ( పథ సంచలన్) కార్యక్రమం కొనసాగింది. అనంతరం శ్రీ చైతన్య జూనియర్ కళాశాల మైదానంలో సంచలన్ సమరోప్ (ముగింపు సమావేశం) జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య వక్త గా హాజరయ్యారు. ఈ కవాతు సందర్భంగా అందరి ద్రుష్టి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పైనే పడింది. రాష్ట్రీయ స్వయం సేవక్ డ్రెస్ ధరించి ఈ కవాతులో పాల్గొన్నారు. స్వయం సేవకులతో కలిసి చైతన్య కాలేజీ వరకు కవాతు చేశారు. బండి సంజయ్ చిన్నప్పుడు కరీంనగర్ లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తగానే జీవితాన్ని ప్రారంభించారు. చదువుకునే సమయంలో కరీంనగర్ రాంనగర్ బస్తీలో ముఖ్య శిక్షక్ గా కొనసాగారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల కవాతు సందర్భంగా కరీంనగర్ రాంనగర్ సత్యనారాయణ స్వామి టెంపుల్ వద్దకు వచ్చిన కేంద్ర మంత్రి ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్ లో పాల్గొన్నారు. మరోవైపు పెద్ద ఎత్తున తరలివచ్చిన విద్యార్థులు, స్థానిక ప్రజలు సైతం ఆర్ఎస్ఎస్ కవాతును ఆసక్తిగా తిలకించడంతోపాటు కవాతుపై పూల వర్షం కురిపిస్తూ తమ మద్దతును తెలియజేశారు. మరోవైపు బండి సంజయ్ తోపాటు ఆయన కుమారుడు బండి సాయి సుముఖ్ సైతం ఆర్ఎస్ఎస్ కవాతులో పాల్గొని అందరి ద్రుష్టిని ఆకర్షించారు. ఆర్ఎస్ఎస్ కవాతు ముగిసిన అనంతరం నిర్వహించిన సమారోప్ కార్యక్రమంలోనూ బండి సంజయ్ పాల్గొన్నారు. మాట్లాడుతూ సంఘ్ స్థాపకులు డాక్టర్ కేశవ్ రావు బలి రామ్ పంత్ హెడ్గేవార్ ఆత్మవిశ్వాసంతో, దూర దృష్టితో 1925 సంవత్సరంలో విజయదశమి రోజున ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ వందేళ్లుగా సమాజ, మాతృ భూమి సేవ కోసం స్వచ్ఛందంగా పనిచేస్తుందన్నారు.
భారతదేశ సమస్యలకు మన సమాజంలో ఉన్న అనైక్యతే ప్రధాన కారణమని డాక్టర్ జి భావించారని, ఆ దిశలోనే జాతిని సంఘటితం చేసే కార్యానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. సమాజ , దేశహితం గురించి ఆలోచించే వ్యక్తులు దేశం నలుమూలల నుంచి కావాలనే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందన్నారు. సామాజిక స్పృహ, జాతీయ భావన, సంఘటిత దృష్టి, నిస్వార్థం, తోటి వారి పట్ల ప్రేమ కలిగి ఉండడం, ఈర్ష ద్వేషం లేకుండా ఉండే వ్యక్తుల నిర్మాణం కోసమే ఆర్ఎస్ఎస్ నిరంతరం పనిచేస్తుందన్నారు. ఒక గంట శాఖ కార్యక్రమాల ద్వారా సమాజంలోని వ్యక్తుల్లో పరివర్తన తీసుకురావాలనే సంకల్పంతో ఆర్ఎస్ఎస్ ఇన్నేళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. హిందూ సమాజంలో మనమందరం ఒకే జాతి వారం అనే భావన నిర్మాణం కావాలన్నారు. హిందుత్వాన్ని మతకోణంలో , రాజకీయ కోణంలో ఆలోచించినంతవరకు ఆర్ఎస్ఎస్ ని అర్థం చేసుకోలేమని, ఆర్ఎస్ఎస్ ను అర్థం చేసుకోవాలంటే ఒక ఆరు నెలలు సంఘంలో వచ్చి పనిచేయాలని పిలుపునిచ్చిన సర్ సంఘ చాలక్ మోహన్ భగవత్ జీ చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
