Singareni News: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌కు చారిత్రక రంగంలో అరుదైన గౌరవం దక్కింది. సుమారు 110 లక్షల సంవత్సరాల క్రితం భూమిపై సంచరించిన ఓ భారీ ఏనుగు జాతి(Elephant breed) ఆనవాళ్లను సింగరేణి వెలికి తీయడం, వాటిని ఇప్పుడు ప్రతిష్ఠాత్మక బిర్లా సైన్స్ మ్యూజియం(Birla Science Museum)లో ప్రత్యేక పెవిలియన్‌గా ఏర్పాటు చేయడం సంస్థకు గర్వకారణంగా మారింది. సింగరేణి మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని తవ్వకంలో లభ్యమైన ‘స్టెగోడాన్’ జాతి ఏనుగు దంతాల అవశేషాలు, డైనోసార్ కాలం నాటి శిలాజ కలపను ప్రదర్శిస్తూ బిర్లా సైన్స్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ‘సింగరేణి పెవిలియన్’ ను సంస్థ సీఎండీ ఎన్. బలరాం(CMD Balaram), బిర్లా పురావస్తు, ఖగోళ, వైజ్ఞానిక సంస్థ చైర్‌పర్సన్ నిర్మల బిర్లా శనివారం లాంఛనంగా ప్రారంభించారు.
ఎలా దొరికాయి?
ఈ సందర్భంగా సీఎండీ బలరాం మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం రామగుండం-1 ఏరియాలోని మేడిపల్లి ఓపెన్ కాస్టు గనిలో మైనింగ్ కార్యకలాపాలు జరుపుతుండగా, రెండు భారీ ఏనుగు దంతాలు, దవడ ఎముకలు శిలాజ రూపంలో లభ్యమయ్యాయని పేర్కొన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో సుమారు 110 లక్షల సంవత్సరాల క్రితం సంచరించి, అంతరించిపోయిన స్టెగోడాన్ జాతికి చెందిన ఏనుగు అవశేషాలుగా శాస్త్రజ్ఞులు వీటిని గుర్తించారని తెలిపారు. చరిత్ర పూర్వ యుగానికి చెందిన ఈ అరుదైన ఆనవాళ్లను ప్రజలు, విద్యార్థులు వీక్షించడానికి అనువుగా బిర్లా సైన్స్ సెంటర్‌లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించడానికి కృషి చేస్తున్న బిర్లా సైన్స్ సెంటర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
Also Read: Bhatti Vikramarka:హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
12 అడుగులు.. అరుదైన జాతి
నాటి ఏనుగు దంతాల గురించి వివరాలు అందిస్తూ.. ఇవి సుమారు 110 లక్షల సంవత్సరాల క్రితం జీవించిన స్టెగోడాన్ జాతికి చెందినవని తెలిపారు. ఇప్పటి ఏనుగు దంతాలు రెండు లేదా మూడు అడుగుల పొడవు మాత్రమే ఉంటే, నాటి ఏనుగు దంతాలు సుమారు 12 అడుగుల పొడవు వరకు ఉండేవని, ఏనుగు సుమారు 13 అడుగుల ఎత్తు, 12.5 టన్నుల బరువు కలిగి ఉండేదని వివరించారు. ఈ స్టెగోడాన్ జాతి అవశేషాలు గతంలో నర్మదా నది ఉపనది ప్రాంతంలోనూ, ప్రపంచంలో నాలుగైదు ప్రదేశాల్లో మాత్రమే లభ్యం కావడం అరుదైన విషయం.
డైనోసార్ పక్కనే..
బిర్లా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ మృత్యుంజయ రెడ్డి(Mrityunjaya Reddy) మాట్లాడుతూ ప్రాచీన కాలంనాటి చారిత్రక ఆనవాలును సింగరేణి సంస్థ భద్రపరిచి అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఆదిలాబాద్(Adhilabad)లో లభ్యమైన డైనోసార్ ఎముకలతో అస్థిపంజరాన్ని పునఃప్రతిష్టించామని, దాదాపు అదే కాలంలో సంచరించిన స్టెగోడాన్ అవశేషాలను డైనోసార్ పెవిలియన్ పక్కనే ఏర్పాటు చేశామని తెలియజేశారు. సింగరేణిలో లభ్యమైన స్టెగోడాన్ దంతాల్లో ఒక జతను బిర్లా మ్యూజియంకు అందజేయగా, మరొక జత దంతాలను గతంలోనే నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు సింగరేణి అందజేసింది.
Also Read: Jr NTR: బావమరిది వివాహంలో ఎన్టీఆర్ సందడి.. పిక్స్ వైరల్..
