Etela Rajender: పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి సర్కార్ వద్ద నిధులున్నాయని, కానీ విద్యార్థుల రీయింబర్స్ మెంట్ విడుదల చేయడానికి మాత్రం నిధులు రిలీజ్ చేయడంలేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) విమర్శలు చేశారు. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తే కమీషన్లు వస్తాయని, ఆ ఆశతోనే వారికి నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కమీషన్ల ద్వారా వచ్చిన డబ్బును ఢిల్లీకి పంపించుకోవచ్చనే యోచనలో కాంగ్రెస్ నేతలున్నారని ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం సెంట్రల్ దగ్గర విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యదర్శి నరేష్ యాదవ్ చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు ఈటల పాల్గొని మద్దతు తెలిపారు.
Also Read: Muslim Population: దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల వెనుక అసలు కారణం ఇదేనా?
ఈ ప్రభుత్వానికి పట్టింపులేదు
అనంతరం రాజేందర్ మాట్లాడుతూ.. కాలేజీ యాజమాన్యాలు సర్కార్ కు అనేకసార్లు అల్టిమేటం ఇచ్చాయని, అయినా ఈ ప్రభుత్వానికి పట్టింపులేదని విమర్శలు చేశారు. ఇంజినీరింగ్ పూర్తయిన విద్యార్థులు మాస్టర్స్ కోసం, ఉద్యోగాల కోసం వెళ్దామంటే యాజమాన్యాలు ఫీజు చెల్లించలేదని సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని, దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, కొందరు అప్పులు చేసి కట్టి సర్టిఫికెట్ తీసుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
విద్యావ్యవస్థలో రూ.10 వేల కోట్ల బకాయిలు
గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలివ్వడం లేదన్నారు.పిల్లలకు డైట్ చార్జీలు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఈటల మండిపడ్డారు. విద్యావ్యవస్థలో రూ.10 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, కాంగ్రస్ నేతలకు వారి దందాలు తప్పా ప్రజల సమస్యలు పట్టించుకునే సమయం లేదని ఆగ్రమం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయకుండా వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: KTR: ఫార్ములా-ఈ రేస్‌తో గ్లోబల్ మొబిలిటీ హబ్‌గా హైదరాబాద్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
