Rishab Pragathi: ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి (Rishab Shetty), అతని వైఫ్ ప్రగతి (Pragathi)ల లవ్ స్టోరీ గురించి సినీ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara Chapter 1) సక్సెస్‌ను పురస్కరించుకుని ఓ స్టేజ్‌పై తన భర్తను కౌగిలించుకుని ప్రగతి కన్నీటి పర్యంతమైన విషయం తెలిసిందే. ఈ సంఘటన తర్వాత అందరూ ప్రగతి గురించి ఆరాలు తీస్తున్నారు. ఈ క్రమంలో రిషభ్, ప్రగతిల ప్రేమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మరో విశేషం ఏమిటంటే.. తమ ప్రేమ కథ గురించి స్వయంగా ప్రగతినే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం. ఆమె చెప్పిన విషయాలు వింటే.. వారి ప్రేమకథతో ఓ సినిమా కూడా తీయవచ్చని అంతా అనుకుంటారు. ఇంతకీ వారి ప్రేమకథ ఏంటని అనుకుంటున్నారా? ఆ విషయంలోకి వస్తే..
Also Read- Niharika NM: నా సీన్ వస్తుంటే నా ఫ్యామిలీ కళ్లు మూసుకోకూడదు.. అలాంటి పాత్రలే చేస్తా!
ప్రేమ కథ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరంటే..
రిషబ్ శెట్టి వైఫ్ ప్రగతి ఓ ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్. ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రానికి కూడా ఆమెనే కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. సినిమాలోని ప్రతి పాత్రకు ఆమె సెట్ చేసిన కాస్ట్యూమ్స్ గురించి అంతా మాట్లాడుకుంటున్నారంటే, ఆమె ఏ రేంజ్‌లో ఈ సినిమా కోసం పని చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇంక రిషబ్ శెట్టి, ప్రగతిలను పక్కపక్కన చూసిన వారంతా, వారిది పెద్దలు కుదిర్చిన వివాహమని అనుకుంటారు. కానీ, వారిది ప్రేమ వివాహం. అదీ కూడా సినిమా స్టైల్‌లో వారి ప్రేమ కథ నడవడం విశేషం. వీరి ప్రేమ కథ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో కాదు.. రిషబ్ శెట్టి తమ్ముడు రక్షిత్ శెట్టి. అవును, రక్షిత్ శెట్టికి ప్రగతి వీరాభిమాని. ఆయన సినిమా చూడటానికి వచ్చి, రిషబ్ ప్రేమలో పడిందట ప్రగతి. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదా. ఈ విషయం స్వయంగా ఆమెనే చెప్పింది.
Also Read- Panjaram Trailer: ఒక కథ చెబుతా వింటారా? కానీ భయపడకండి!
అలా కలుసుకున్నారు
రక్షిత్‌శెట్టి హీరోగా వచ్చిన ‘ఉళిదవారు కండంతే’ సినిమా అంటే ఆమెకు చాలా ఇష్టమట. ఆ సినిమా చూసిన తర్వాత అతనికి ఫ్యాన్‌గా మారిపోయిందట. ఆ సినిమా తర్వాత రిషబ్ శెట్టి దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ‘రిక్కీ’ సినిమా చూసేందుకు స్నేహితులతో కలిసి థియేటర్‌కు వచ్చిన ప్రగతి, అక్కడ రిషబ్ శెట్టిని పరిచయం చేసుకుందట. అందరూ రక్షిత్‌తో ఫొటోలు దిగుతుంటే, ఓ సైడ్‌గా నిలబడి ఉన్న రిషబ్‌పై ఆమె చూపు పడటం, అతనే దర్శకుడని తెలుసుకుని వెళ్లి ఓ సెల్ఫీ తీసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆ టైమ్‌లోనే కొద్దిపాటి సంభాషణ జరిగిందట. ఆ సంభాషణలలో ఇద్దరిదీ ‘కుందాపుర’ అనే గ్రామమని తెలియడంతో.. ఇంకాస్త చనువు ఏర్పడిందని, ఆ తర్వాత ఫేస్‌బుక్‌లో రిషబ్‌కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడంతో, అతను ఓకే చేయడంతో, పరిచయం ఇంకాస్త ముదిరింది. అలా ఒకరి ఫోన్ నెంబర్ మరొకరు అడిగి తెలుసుకుని, తరుచూ మాట్లాడుకుంటూ స్నేహబంధం పెంచుకున్నారట. అది క్రమక్రమంగా పెరిగి ప్రేమగా మారిందని, ఇద్దరూ ఒకే ఊరి వారు కావడంతో వారి ప్రేమకు పెద్దలు కూడా పెద్దగా అడ్డు చెప్పలేదని, అలా మా పెళ్లి జరిగిందని ప్రగతి చెబుతున్న ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
