JubileeHills Congress Ticket: బీసీ నేతకే జూబ్లీహిల్స్ టిక్కెట్
ఇన్‌ఛార్జ్ మంత్రుల రిపోర్ట్ ఆధారంగానే ఎంపిక
కంటోన్మెంట్ తరహాలోనే గెలుస్తాం
రెండు, మూడు రోజుల్లోనే అభ్యర్థి ప్రకటన
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం
సీఎం రేవంత్‌తో మంగళవారం చర్చించే ఛాన్స్ ఉందన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో టిక్కెట్ (JubileeHills Congress Ticket) ఇచ్చే అవకాశం ఉందని టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు మూడు రోజుల్లోనే టికెట్ ఖరారు చేసే అవకాశం ఉన్నదని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయమపై సీఎం రేవంత్ రెడ్డితో మంగళవారం చర్చించిన తర్వాత అభ్యర్థుల లిస్ట్‌ను ఏఐసీసీకి పంపిస్తామన్నారు. ఉప ఎన్నికలో ముగ్గురు ఇంఛార్జి మంత్రుల రిపోర్టు ఆధారంగా అభ్యర్థి ఎంపిక ఉంటుందని వివరించారు. కంటోన్మెంట్ ఉపఎన్నిక మాదిరిగానే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలిచి తీరుతామని ఆయన దీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాపాలనకు తేడా సుస్పష్టంగా కనిపిస్తోందన్నారు. అభివృద్ది, సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కట్టడం ఖాయమని మహేష్ కుమార్ గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Also- Pharma Hub: ఫార్మా రంగంలో మరో మైలురాయి.. రూ.9 వేల కోట్ల పెట్టు బడులకు అమెరికా కంపెనీ అంగీకారం
ఇక, మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను వక్రీకరించారని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. అసత్యాల ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. డిసెంబర్ చివరి నాటికి పార్టీ పదవులన్నీ భర్తీ చేస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ముందే ఊహించామన్నారు. త్వరలోనే కామారెడ్డి బహిరంగ సభ ఉంటుందన్నారు. రెండు మూడు రోజుల్లో ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్, ముగ్గురు మంత్రులతో కలిసి జూబ్లీహిల్స్‌లో ‘బస్తీ బాట’ చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇక స్థానిక పరిస్థితుల బట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, జనసమితి అభ్యర్థులకు టికెట్ లభిస్తుందన్నారు. ఎంఐఎం మద్దతు గురించి పార్టీలో అందరి నాయకులతో డిస్కషన్ చేస్తామన్నారు.
Read Also- Kadiyam Kavya: బీఆర్ఎస్ పార్టీకి బాకీ అనే పదం ఎత్తే అర్హత లేదు.. కడియం కావ్య కీలక వ్యాఖ్యలు
మరోవైపు, సుప్రీంకోర్ట్ తీర్పు శుభపరిణామమని వ్యాఖ్యానించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఆపాలని సుప్రీంకోర్టులో వేసిన కేసును కోర్టు కొట్టి వేయడాన్ని స్వాగతిస్తున్నామని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్ ఒక జీవో ఇచ్చి బీసీ రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేసిందన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లు బిసి రిజర్వేషన్లు అమలు కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. 8న హైకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. బీసీలకు రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్లు అమలుకు అన్ని వర్గాలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు.
