Acre Rs177 Crores: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి ఎవరూ ఊహించని, అంచనా వేయని రీతిలో స్పందన వచ్చింది. ఎంఎస్ఎన్ రియాల్టీ కంపెనీ పెను సంచలనం సృష్టించింది. ఒక్కో ఎకరా రూ.177 కోట్లు చొప్పున మొత్తం 7.67 ఎకరాల ల్యాండ్ పార్సిల్‌ను వేలంలో కంపెనీ కొనుగోలు చేసింది. ప్రారంభ ధర ఎకరాకు రూ.101 కోట్లకు వేలంపాట ప్రారంభించగా, పోటీ విపరీతంగా ఉండడంతో ఎకరా విలువ చివరికి రూ.177 కోట్ల స్థాయికి వెళ్లింది. పోటీదారులను వెనక్కి నెట్టి ఎంఎస్ఎన్ రియాల్టీ భూమిని దక్కించుకుంది. ఈ భారీ ధర ఒక్క హైదరాబాద్ నగరంలోనే కాకుండా, బహుశా దక్షిణ భారతదేశంలోనే ఇదే అత్యధిక ధర కావొచ్చని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు.
చిన్నబోయిన నియోపోలీస్!
గతంలో కోకాపేట నియోపోలిస్‌లో ఒక్క ఎకరా రూ.100.75 కోట్లు పలికింది. ఈ ధర నాడు పెనుసంచలనమైంది. ప్రతిఒక్కరూ నోరెళ్లబెట్టారు. కొన్నేళ్లు కూడా గడవకముందే నియోపోలిస్ వేలం రికార్డును నాలెడ్జ్ సిటీ భూముల వేలం బద్దలుకొట్టడం చర్చనీయాంశంగా మారింది. దక్షిణ భారత దేశంలోనే అత్యధిక ధరకు భూములు కొన్న కంపెనీ ఎంఎస్ఎన్ రియాల్టీ అంటూ పేరు మార్మోగిపోతోంది. కొనుగోలు చేసిన భూమి నాలెడ్జ్ సిటీలో కీలక ప్రాతంలో ఉండడంతో కంపెనీ అత్యధిక బిడ్ వేసింది.
