– రేవంత్ సర్కార్ వినూత్న ఆలోచన
– అందుబాటులోకి మొబైల్ మెడికల్ ల్యాబ్‌లు
– అందరికీ అందనున్న ఉచిత వైద్య చెకప్‌లు
– అత్యాధునిక సాంకేతికతతో నిండిన వాహనాలు
– 25-75 సంవత్సరాల వారికీ ఉచిత బాడీ, రక్త పరీక్షలు
– పేదలకు ఉచితంగా మందులు, స్క్రీనింగ్ టెస్టులు
– త్వరలోనే అందుబాటులోకి తేనున్న రేవంత్ సర్కార్
Congress sarkar telangana plan to implement mobile health lab vehicles: ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. తెలంగాణలో గత సర్కార్ వైద్యాన్ని దాదాపు నిర్వీర్యం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ దవాఖానాలకు మేలు చేకూర్చేలా ప్రభుత్వ దవాఖానాలను ఉపయోగం లేకుండా చేశారనే విమర్శలు వచ్చాయి. మొక్కుబడిగా ప్రకటనలు తప్ప బస్తీ దవాఖానాలలో సైతం అధునాతన చికిత్సనందించే పరికరాలు సమకూర్చలేదని అంటుంటారు. పేదలు ఎంతో నమ్మకంతో అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వస్తారు. వారికి ఎలాంటి ఖర్చు లేకుండా, ఎంత ఖరీదైన వైద్యమైనా అందించాలి. కానీ, కేసీఆర్ పాలనలో అది జరగలేదని, రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిధిని 5 నుంచి 10 లక్షలకు పెంచిన రేవంత్ సర్కార్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి సామాన్య ప్రజలకు వైద్యం అందుబాటులోకి తేనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్యాలను దృష్టి పెట్టుకుని ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టుబోతోంది. ఈ మేరకు గ్రామాల్లో 104 ఆరోగ్య సేవలు మాదిరిగానే మొబైల్ మెడికల్ ల్యాబ్‌లను వైద్య, ఆరోగ్య శాఖ అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో అందరికీ ఉచితంగా హెల్ట్ చెకప్‌తో పాటు పరీక్షలు కూడా ఉచితంగా చేయనున్నారు. ఇందు కోసం అత్యాధునిక టెక్నాలజీతో వాహనాల్లో మెడికల్ ల్యాబ్‌లను సిద్ధం చేస్తున్నారు. పాతికేళ్ల నుంచి 75 ఏళ్ల వయసు వారికి అన్ని రకాల రక్త పరీక్షలు, క్యాన్సర్, షుగర్, గుండె జబ్బులకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తారు. ఆ పరీక్షల్లో ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నట్లు తెలిస్తే వారికి ఉచితంగా మందులు కూడా అందింజేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఎన్‌హెచ్‌ఎంలో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి కేంద్రం నుంచి 60 శాతం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చనున్నట్లుగా తెలుస్తోంది.