Cyber Crime: అత్యాశకు పోయారా?.. అంతే సంగతులు. ఊహించని లాభాలు వస్తాయని ముందు వెనకా ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టారా? పూడ్చ లేని నష్టం ఖాయం. నెట్టింట్లో పొంచి ఉన్న సైబర్ క్రిమినల్స్(Cyber criminals) ఇటీవలిగా ఆన్ లైన్ ఇన్వెస్ట్ మెంట్(Online investment).. ట్రేడింగ్ ఫ్రాడ్లకు పాల్పడుతూ లక్షలు.. కోట్లు కొల్లగొడుతున్నారు. ఇలాంటి వారి ఉచ్ఛులో చిక్కకండి అని సైబర్ క్రైం పోలీసులు పదే పదే హెచ్చరికలు చేస్తున్నా కొందరు తేలికగా డబ్బు సంపాదించుకోవచ్చని వీరి వలలో పడుతూనే ఉన్నారు. కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. తీరా మోసపోయామని గ్రహించాక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే, అప్పటికే సైబర్ నేరగాళ్లు వీరి నుంచి కొల్లగొట్టిన డబ్బును వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేసుకుని స్వాహా చేసేస్తున్నారు. దాంతో బాధితులు పోగొట్టుకున్న డబ్బు రికవరీ కావటం లేదు. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే ఈ నేరాల్లో అసలు సూత్రధారులు పట్టుబడక పోతుండటం. కమీషన్ కోసం కక్కుర్తి పడి సైబర్ క్రిమినల్స్ కు తమ తమ బ్యాంక్ ఖాతాలను సమకూరుస్తున్న వారే దొరుకుతుండటం.
ముప్పయి మూడు రకాలు
అందుబాటులోకి వచ్చిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ పటిష్టమైన పోలీసింగ్ ను అమలు చేస్తున్న నేపథ్యంలో సాంప్రదాయ నేరాలు గణనీయంగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే, అదే సమయంలో సైబర్ నేరాలు ఏయేటికాయేడు శరవేగంతో పెరిగిపోతున్నాయి. ముప్పయి మూడు రకాలుగా పైగా మోసాలు చేస్తున్న సైబర్ క్రిమినల్స్ ప్రతీ సంవత్సరం ఒక్క హైదరాబాద్(Hyderabad) కమిషనరేట్ పరిధి నుంచే ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా కొల్లగొడుతున్నారు. దీనిని బట్టే సైబర్ నేరగాళ్లు ఏ స్థాయిలో మోసాలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కాగా, కొన్ని రోజులుగా సైబర్ మోసగాళ్లు ఎక్కువగా ఆన్ లైన్ ఇన్వెస్ట్ మెంట్.. ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతున్నారు. గడిచిన రెండు నెలల కాలంలో సైబర్ నేరాలకు సంబంధించిన నమోదైన కేసుల్లో 80శాతానికి పైగా ఈ తరహా నేరాలే ఉండటం గమనార్హం. రకరకాల మార్గాల్లో జనానికి చెందిన మొబైల్ ఫోన్.. ఆధార్ కార్డుల నెంబర్లతోపాటు పర్సనల్ డిజిటల్ డేటాను సేకరిస్తున్న సైబర్ క్రిమినల్స్ రాండంగా ఆయా సెల్ ఫోన్లకు మెసెజీలు పంపిస్తున్నారు.
Also Read: Rashmika Mandanna: రష్మిక మందన్నా ‘ది గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
చిన్న చిన్న మొత్తాల్లో పెట్టుబడులు
ఇంట్లో కూర్చుని..పెద్దగా కష్టపడకుండా లక్షలు సంపాదించాలానుకుంటున్నారా?…అయితే మా సూచనలను ఫాలో చేయండి అంటూ మెసెజీలు పంపిస్తున్నారు. తమను తాము క్వాలిఫైడ్ బిజినెస్ అడ్వయిజర్లమని చెప్పుకొంటున్నారు. ఈ మెసెజీలు చూసి ఆశపడి ఎవరైనా సంప్రదించిన వారిని మెల్లిగా ఉచ్ఛులోకి లాగుతున్నారు. ముందుగా చిన్న చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టించి వాటిపై లాభాలు వచ్చాయని డ్యాష్ బోర్డుల్లో చూపించి అవతలి వారిని ముగ్గులోకి లాగుతున్నారు. ఆదాయం…అందులోనూ అమెరికన్ డాలర్ల రూపంలో కనిపిస్తుండటంతో క్రిమినల్స్ మాయలో పడుతున్న ఎంతోమంది లక్షలు…కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ మెంట్లుగా పెట్టి నిలువునా ముగినిపోతున్నారు. అన్ లైన్ ట్రేడింగ్ చేస్తూ అడ్డంగా మోసపోతున్నారు. ఈ తరహా నేరాలకు పాల్పడుతున్న సైబర్ క్రిమినల్స్ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలైన ఎక్స్, టెలిగ్రాం, ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ ల ద్వారా నేరాలు చేస్తుండటం గమనార్హం.
మాయ మాటలు నమ్మి 43లక్షలు..
సైబర్ నేరగాళ్ల మాయ మాటలు నమ్మి హైదరాబాద్ కు చెందిన ఓ వృద్ధుడు ఏకంగా 43లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. వాట్సాప్ మెసెజ్ ద్వారా సదరు వృద్ధునితో టచ్ లోకి వచ్చిన మోసగాళ్లు మేం చెప్పినట్టుగా యాక్సెస్ బ్యాంకుకు చెందిన యాక్సెస్ సెక్యూరిటీ ఐపీవో అలాట్ మెంట్ లో పెట్టుబడులు పెట్టండి…ఊహించని లాభాలు సంపాదించండి అని చెప్పారు. ఇది నమ్మి బాధితుడు 43లక్షలు పెట్టుబడులుగా పెట్టాడు. ఆ తరువాత అతని పేర షేర్లు అలాట్ అయినట్టుగా సైబర్ క్రిమినల్స్ డ్యాష్ బోర్డు ద్వారా నమ్మించారు. దాంతోపాటు నాన్ ఇంట్రెస్ట్ లోన్ కింద అదనంగా షేర్లు అలాట్ అయినట్టుగా పేర్కొని వాటికి పేమెంట్ చేయాలని సూచించారు. లేనిపక్షంలో మొత్తం నగదు ఫ్రీజ్ అవుతుందంటూ భయపెట్టారు. అప్పటికిగానీ బాధితునికి అసలు విషయం అర్థం కాలేదు. దాంతో సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిన బాధితుడు తన డబ్బు వాపసు ఇప్పించాలంటూ ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ కే చెందిన మరో వృద్ధునికి కూడా ఇలాగే టోకరా ఇచ్చిన సైబర్ మోసగాళ్లు 6.36లక్షలు కొట్టేశారు. ఇలా చెబుతూ పోతే పదుల సంఖ్యలో ఉదంతాలు ఉన్నాయి.
బీ అలర్ట్.. సీపీ సజ్జనార్..
ఇలాంటి మోసాలపట్ల అలర్ట్ గా ఉండాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ సూచించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాంలైన ఫేస్ బుక్, వాట్సాప్, టెలిగ్రాం, ఇన్ స్టాగ్రాం తదితర యాప్ ల నుంచి కళ్లు చెదిరే లాభాలు సొంతం చేసుకోవచ్చంటూ వచ్చే మెసెజీలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని పేర్కొన్నారు. అనధికారిక ట్రేడింగ్ అప్లికేషన్లను ఇన్ స్టాల్ చేసుకోవద్దని చెప్పారు. www.sebi.gov.in అన్న వెబ్ సైట్ కు వెళ్లి ఆయా ట్రేడింగ్ సంస్థల విశ్వసనీయతను పరిశీలించాలన్నారు. మోసపోయినట్టు గ్రహిస్తే 1930 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. www.cybercrime.gov.in అన్న వెబ్ సైట్ కు కూడా సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.
Also Read: Hyderabad: మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్.. మళ్లీ జంట జలాశయాల గేట్లు ఎత్తివేత
