Gudumba: తెలంగాణ రాష్ట్రంలో నిషేధించిన గుడుంబాను సూర్యాపేట జిల్లాలో విచ్చలవిడిగా సాగుతోంది. ప్రధానంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్, బలరాం తండాల్లో గుడుంబా గుప్పుమంటోంది. గుడుంబా పానకం వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 18వ వార్డు పరిధిలోని పలు కాలనీలతో పాటు పల్లె ప్రాంతాల్లోనూ గుడుంబా తయారీ సాగుతున్నట్లు ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
గుడుంబా వ్యాపారులు ఎస్కేఫ్
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియా, బలరాం తండ ప్రాంతాల్లో నిత్యం గుడుంబా కాస్తూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇండస్ట్రియల్, బలరాం తండాల్లో స్థానికుల నుంచి అధికారులకు కంప్లైంట్స్ వెళ్ళినప్పుడు తూ తూ మంత్రంగా దాడులు నిర్వహించి వెళ్ళిపోతున్నారు. దాడులు చేసే సమయంలో ఎక్సైజ్ శాఖలో పనిచేసే ఓ డ్రైవర్.. గుడుంబా తయారీ దారులను అలెర్ట్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో దాడుల సమయంలో వారు ఇళ్లకు తాళాలు వేసి ఎస్కేప్ అవుతున్నారు. స్థానికులు ఆశించిన స్థాయిలో గుడుంబాను కట్టడి చేయకపోవడంతో పరిసర ప్రాంత ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుడుంబా తయారు చేసే ప్రాంతాల్లో తరచు చోరీలు సైతం జరుగుతున్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎక్సైజ్ శాఖ డ్రైవర్ అండదండలు
సూర్యాపేట ఎక్సైజ్ శాఖ లో పనిచేసే డ్రైవర్ మల్లేశం గుడుంబా వ్యాపారులకు, తయారీదారులకు పూర్తి అండదండలు అందిస్తున్నట్లు స్థానికుల నుంచి ఆరోపణలు ఉన్నాయి. గుడుంబా వ్యాపారులు, తయారుదారుల నుంచి లంచం తీసుకుని ఈ చర్యలకు పాల్పడుతున్నాడని చెబుతున్నారు. జిల్లాలో పనిచేసే డిస్టిక్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఈ చర్యలపై పకడ్బందీ చర్యలు చేపట్టడంతో పాటు ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న మల్లేశంను విధుల నుంచి తప్పించాలని ఇండస్ట్రియల్, బలరాం తండావాసులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Rahul Ramakrishna: నేనొక చిన్న నటుడ్ని.. నా బాధ్యత తెలుసుకున్నా.. ట్విట్టర్‌కు గుడ్ బై!
ఒరిస్సా, బిహార్ వాసులతో ఇబ్బందులు
ఇండస్ట్రియల్ లో పనిచేసే ఒరిస్సా, బీహార్ వాసులు గుడుంబా సేవించేందుకు వచ్చే పోయే సమయంలో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరచూ శాంతినగర్, బలరాం తండా, ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో చోరీలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఎక్సైజ్ అధికారులు గుడుంబాను అరికట్టి స్థానికులకు ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుతున్నారు. అటు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు సైతం ఈ మూడు ప్రాంతాల్లో గుడుంబా తయారీని, అమ్మకాలను నివారించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
