Singareni Collieries: సింగరేణి సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి తమిళనాడు పవర్ జనరేషన్ కార్పోరేషన్ కు బొగ్గును సరఫరా చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఈ బ్లాక్ నుంచి ఏటా 2.88 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరాకు తమిళనాడు జెన్ కో(Tamil Nadu Gen Co) తో సింగరేణి సంస్థ మరో 10 రోజుల్లో ఇంధన సరఫరా ఒప్పందం చేసుకోనుంది. ఈమేరకు శుక్రవారం హైదరాబాద్(Hyderabad) సింగరేణి భవన్ లో తమిళనాడు పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఎండీ ఎం గోవిందరావు, సింగరేణి సీఎండీ ఎన్ బలరాం నాయక్(Balaram Nayak) తో చర్చలు జరిపారు. తమిళనాడులోని తుత్తుకూడి జిల్లా ఉడింగిడిలో ఉన్న 1200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కోసం ప్రతీ ఏడాది 2.88 మిలియన్ టన్నుల జీ-11 బొగ్గు అవసరముందని తమిళనాడు జెన్ కో ఎండీ ఎం గోవిందరావు పేర్కొన్నారు.
సింగరేణి సీఎండీ బలరాం స్పందిస్తూ..
సింగరేణి నుంచి ఈ బొగ్గును సరఫరా చేయాల్సిందిగా కోరారు. దీనిపై సింగరేణి సీఎండీ బలరాం స్పందిస్తూ ఒడిశా(Odhisha)లోని నైనీ బొగ్గు బ్లాక్(Naini coal block) నుంచి ఉత్పత్తి ప్రారంభమైన నేపథ్యంలో రైలు, జల మార్గంలో సరఫరా చేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు బొగ్గు సరఫరాకు ఏర్పాట్లు చేయాల్సిందిగా నైనీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో తమిళనాడు జెన్ కో తో మరో 10 రోజుల్లో ఇంధన సరఫరా ఒప్పందం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సిందిగా బొగ్గు రవాణా, మార్కెటింగ్ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. సింగరేణితో తమిళనాడు జెన్ కోకు ఉన్న దీర్ఘ కాలిక బంధాన్ని మరింత బలపరిచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని బలరాం నాయక్(Balaram Nayak), గోవిందరావు(Govindgrao) పేర్కొన్నారు.
Also Read: Hydraa: నాలాల సమీపంలోని నివాసేతర భవనాలను హైడ్రా కూల్చివేత!
నార్త్ చెన్నై విద్యుత్ ప్లాంట్..
ఇదిలాఉండగా ఇప్పటికే సింగరేణి(Singareni) ద్వారా తమిళనాడు లోని నార్త్ చెన్నై విద్యుత్ ప్లాంట్ కు ప్రతీ ఏడాది 1.75 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా జరుగుతోంది. తాజాగా ఒడిశా(Odhisha)లోని నైనీ ప్రాజెక్టు నుంచి ఏడాదికి 2.88 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరాకు అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో నైనీ బొగ్గు కు మొదటి వినియోగదారుగా తమిళనాడు నిలవనుండటం విశేషం. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోల్ మూవ్ మెంట్) వెంకన్న, జీఎం( కో ఆర్డినేషన్, మార్కెటింగ్) శ్రీనివాస్ పాల్గొన్నారు.
Also Read: Web series: ‘ఏఐ’ యుగంలో ఎదురయ్యే సమస్యలను ఎత్తిచూపే సిరీస్..
