Dussehra Liquor Sales: తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డును సృష్టించాయి. ప్రతీ సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా దసరా సందర్భంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. గాంధీ జయంతి రోజున దసరా వచ్చినప్పటికీ.. మందు బాబులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఒక రోజు ముందే స్టాక్ తెచ్చుకొని మరి.. క్రితం ఏడాది మద్యం రికార్డును బద్దలు కొట్టారు. గత నెల సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1 తేదీల్లో ఏకంగా రూ. 698.33 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ప్రొబిహిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వర్గాలు ప్రకటించాయి.
రోజూవారీగా లెక్కలు..
తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 29న రూ.278 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 30న రూ.333 కోట్లు, అక్టోబర్ 1న రూ.86.23 కోట్ల మేర మద్యం అమ్ముడిపోయింది. అయితే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం అమ్మకాలు జరగలేదు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ మూడు రోజుల అమ్మకాలు ఏకంగా 60-80 శాతం మేర పెరగడం గమనార్హం. దీని ప్రభావం స్పష్టంగా సెప్టెంబర్ నెల మద్యం విక్రయాల్లో కనిపించింది. గతేడాది సెప్టెంబర్ లో రూ.2838 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది అది రూ. 3048 కోట్లకు చేరడం విశేషం.
7 శాతం పెరిగిన సేల్స్
మెుత్తంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ దసరాకు మద్యం సేల్స్ 7 శాతం పెరిగినట్లు ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. 2024 సెప్టెంబర్ నెలలో 28.81 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్ కు వచ్చే సరికి వాటి సేల్స్ 29.92 లక్షల కేసులకు చేరుకోవడం గమనార్హం. అదే సమయంలో 7 లక్షల 22వేల కేసు బీర్లు సైతం అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నారు.
Also Read: Monkeys: మీకు ఓటు కావాలా? అయితే వెళ్లి కోతులు పట్టుకోండి.. నేతలకు వింత షరతు!
అక్టోబర్ 2న నిషేధం ఎందుకు?
నేషనల్ హాలీడేస్ గా పేర్కొనే రిపబ్లిక్ డే (జనవరి 26), స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15), గాంధీ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా మద్యం విక్రయాలపై ఆంక్షలు విధిస్తుంటారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తెచ్చినందుకు గుర్తుగా గాంధీ జయంతి రోజున ఎలాంటి హింసకు తావు ఉండకూడదన్న ఉద్దేశంతో మద్యం నిషేధాన్ని ప్రతీ సంవత్సరం అమలు చేస్తూ వస్తున్నారు. అలాగే గాంధీజీ వెజిటేరియన్ కాబట్టి.. ఆయన జీవనశైలిని గౌరవించే ఉద్దేశ్యంతో మాంసాన్ని సైతం ఆ రోజున విక్రయించేందుకు అనుమతి లేదు. కాబట్టి అక్టోబర్ 2న ఎవరైన మద్యం, మాంసం విక్రయిస్తే చట్టపరంగా శిక్షార్హులు అవుతారని చట్టాలు స్పష్టం చేస్తున్నాయి.
