Gudem Village: ఆ గ్రామంలో 1920 నుంచి గిరిజనులు నివసించినట్లు రికార్డులు లేవు. కానీ చిన్న పొరపాటు పంచాయతీ ఎన్నికలకు శాపమైంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల పరిధిలోని గూడెం గ్రామంలో గిరిజనులు లేకపోయినప్పటికీ 1950లో ఈ గ్రామాన్ని నోటిఫైడ్ ఏరియాగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. 1987 నుంచి సర్పంచ్ తో పాటు పదింటిలో ఐదువార్డులను ఎస్టీలకు రిజర్వు చేసింది. గ్రామంలో 1800పై చిలుకు జనాభా ఉన్నప్పటికీ అందరూ గిరిజనేతరులే ఉన్నారు. అయినప్పటికీ రిజర్వు కావడంతో ఆ గ్రామంలో ఎన్నికలు జరగడం లేదు. పోటీచేసేవారు లేకపోవడంతో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు కూడా దాఖలు కావడం లేదు. దీంతో 38 ఏళ్ల నుంచి పంచాయతీ ఎన్నికలు జరగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈసారికూడా గూడెం గ్రామంకు రిజర్వేషన్ మారలేదు.
గ్రామస్తులు ఆవేదన వ్యక్తం
గూడెం గ్రామంలో పంచాయతీ పాలక వర్గం లేకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు లేకపోవడంతో గ్రామంలోని సమస్యల పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మౌలిక సమస్యలను ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లేవారు లేకపోవడంతో తిష్టవేస్తున్నాయి. దీంతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా గ్రామాభివృద్ది కుంటుపడింది. గ్రామపంచాయతీ భవన్ సైతం శిథిలావస్థకు చేరింది.
Also Read: Maruthi responds: వారికి ‘ది రాజాసాబ్’ దర్శకుడు స్ట్రాంగ్ కౌంటర్.. ఫ్యాన్స్ నుంచి అది చాలు..
గ్రామస్థులు పలుమార్లు ఆందోళనలు
మరోవైపు ఏజెన్సీ యాక్ట్ అమలులో ఉండటమే కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. తమ గ్రామాన్ని నోటిఫైడ్ ఏరియా నుంచి తొలగించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు చేశారు. గ్రామంలో ఎస్టీ జనాభా లేదని, రిజర్వేషన్ మార్చాలని గ్రామస్థులు పలుమార్లు ఆందోళనలు చేశారు. సామూ హిక నిరహార దీక్షలు, రాస్తారోకో, తదితర నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఎప్పటిలాగే ఉంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయాలనే ఆసక్తి, గ్రామంలో సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామనే పట్టుదలతో ఉన్నవారికి నిరాశే ఎదురవుతుంది. ప్రభుత్వం నాన్ ఏజెన్సీగా ప్రకటిస్తే తప్ప గూడెం గ్రామానికి ఎన్నికలు జరిగేలా లేవు.
రిజర్వేషన్ మార్చి ఎన్నికలు
ఈసారి సైతం ఆ గ్రామంఎస్టీ రిజర్వేషన్ మార్చలేదు. అలాగే ఉంది. ఈ సారి సైతం ఎన్నికలు జరుగకపోతే ఆ గ్రామం నుంచి ఎవరు నామినేషన్లు వేయకపోతే వెకెన్సీ లిస్టులో పెట్టే అవకాశం ఉందని పంచాయతీశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రిజర్వేషన్ మార్చి ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఎన్నికలకు ముందు ఆ చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read: Old Age Couple: 80 ఏళ్ల వయసులో వృద్ధ జంట ఆత్మహత్య.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!