Local Body Elections: స్థానిక సంస్థలకు రిజర్వేషన్ల ఖరారుతో ఎన్నికల నగారా మోగనుంది. దీంతో పల్లెలో రాజకీయ వేడి మొదలైంది ఈ ఎన్నికలలో బీసీలకు 42 శాతం సీట్లను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దానికి అనుగుణంగానే అధికారులు ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేశారు. ముందుగా జడ్పిటిసి ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పల్లెల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జడ్పిటిసి ఎంపీటీసీ స్థానాలు ఎన్నికలు పార్టీల ప్రాతిపదికన నిర్వహిస్తారు. అభ్యర్థులు పార్టీ బీఫామ్ పై పోటీ చేసి విజయం సాధించాల్సి ఉంటుంది. ఇందుకనుగూణంగా ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో పార్టీ అభ్యర్థుల అన్వేషణ చేపట్టి వారి బలబలాలపై దృష్టి సారిస్తున్నాయి.
మహిళ పాత్రే కీలకం
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఉమ్మడి పాలమూరులో మహిళలకు ప్రాధాన్యత దక్కింది. మహబూబ్ నగర్ జడ్పీ పీఠం బీసీ మహిళకు కేటాయించగా, నారాయణపేట జనరల్ మహిళకు కేటాయించారు. అదేవిధంగా నాగర్ కర్నూల్ బీసీ మహిళ, వనపర్తి బీసీ మహిళకు, జోగులాంబ గద్వాల జడ్పీ పీఠం ఎస్సీ జనరల్ మహిళకు దక్కనుంది.
ఎస్సీ జనరల్ కే జడ్పీ
స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో జిల్లా పరిషత్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. రిజర్వేషన్ల ప్రకారం చైర్మన్ పదవులను ఖరారు చేస్తూ ప్రభుత్వం జోగులాంబ గద్వాల జిల్లాకు జడ్పీ చైర్మన్ గా ఎస్సీ జనరల్ కు కేటాయిస్తూ గెజిట్ విడుదల చేసింది. దీంతో ఎంతోకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.శాసనసభ ఎన్నికల తర్వాత జడ్పిటిసిలుగా పోటీ చేసి జడ్పీ చైర్మన్ పదవి ఆశించిన క్రియాశీలక నేతలకు నిరాశనే మిగిల్చింది. జిల్లాలో 13 మండలాలకు గాను అలంపూర్, ఐజ మండలాలను ఎస్సీ జనరల్ కు కేటాయించగా ఇటిక్యాల ఎస్సీ మహిళకు రిజర్వేషన్ ఖరారు అయింది. మానవపాడు,ఎర్రవల్లి, రాజోలి బిసి జనరల్ కు కేటాయించగా కేటి దొడ్డి, మల్దకల్ ,వడ్డేపల్లి బీసీ మహిళకు కేటాయించారు. అదేవిధంగా ఉండవల్లి,గద్వాల మండల జడ్పిటిసిలుగా జనరల్ కు అవకాశం రాగా గట్టు,ధరూర్ మండల జడ్పిటిసి లకు జనరల్ మహిళకు రిజర్వేషన్ ఖరారు అయింది. జిల్లా వ్యాప్తంగా 142 ఎంపీటీసీలు, 13 ఎంపీపీ 13 జడ్పిటిసి స్థానాల రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల ప్రక్రియకు రిజర్వేషన్లు పూర్తి కావడంతో గ్రామాలలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే మండల, గ్రామాలలో కుల పెద్దలను , యువతను కలుస్తూ మద్దతు పొందే ప్రయత్నాలను ప్రారంభించారు.
సర్వం సిద్ధం..
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని గ్రామాల్లో ఎంపీటీసీ ఓటర్ల తుది జాబితాలను ఆందుబాటులో ఉంచారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు, ఇతర ఏర్పాట్లపై అధికారులు నెలరోజులుగా కసరత్తు చేస్తుండగా ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్టయింది. ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని, బ్యాలెట్ బాక్సులను, పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.