cm ( Image Source: Twitter )
తెలంగాణ

CM Revanth Reddy: దేశానికే ఆదర్శంగా నిలవనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

 CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి అభివృద్ధి దిశగా దేశంలోనే మరింత ముందడుగు వేస్తుందని రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి అన్నారు.ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో 134 కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలో మంత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ..
తెలంగాణ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నట్లు, కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ జూపల్లి కృష్ణారావు వాకాటి శ్రీహరి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఉన్న మా ప్రజా ప్రభుత్వం విద్య, వైద్య సేవలు, యువతకు నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఆ దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామం దేశంలోనే ఓ ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంది అన్నారు. ఇటీవల గ్రామంలోని 516 గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు అన్నింటికీ సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామం విద్యుత్ స్వావలంబన సాధించిందని అన్నారు. గ్రామస్తులకు విద్యుత్ వినియోగంలో స్వాతంత్ర్యం కల్పించడమే కాదని, అదే సమయంలో ఆర్థిక ఆదాయాన్ని కూడా గ్రామ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించారన్నారు.

పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రభుత్వ భవనాలకు కూడా సోలార్ ఏర్పాటు, విద్యుత్ బిల్లుల లేకుండానే జీవిత జీవన విధానం, పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక ఆదాయం రెండింటికీ దోహదమని, ఈ కార్యక్రమం పునరుత్పత్తి శక్తికి ప్రాధాన్యతనిచ్చే దిశగా రాష్ట్రస్థాయిలోని ప్రథమంగా కొండారెడ్డిపల్లి గ్రామాన్ని మార్గనిర్దేశం చేస్తుందని మంత్రులు తెలిపారు. ప్రతి ఇంటి నుండి నెలకు 360 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అన్నారు. ఇంటి వినియోగం తర్వాత మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. సెప్టెంబర్ నెలలో మొత్తం గ్రామం నుండి సుమారు ఒక లక్ష యూనిట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపారన్నారు. దీంతో ఒక్క నెలలోనే గ్రామస్తులు కి సుమారు రూ.5 లక్షల ఆదాయం సమకూరిందని మంత్రులు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ఏర్పాట్లతో పాటు, విద్యార్థులకు నైపుణ్యమైన వైద్య విద్యను అందించడంతోపాటు ప్రతి జిల్లాలో డయాబెటిస్ నుండి క్యాన్సర్ వరకు చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాట్లు చేసిందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన గంట (గోల్డెన్ అవర్)లోపు వైద్యం అందించే విధంగా తెలంగాణవ్యాప్తంగా ట్రామా సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రులు పేర్కొన్నారు. క్యాన్సర్ నివారణకు రాష్ట్ర ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, క్యాన్సర్ నివారణకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు తెలిపారు.

తెలంగాణలో నైపుణ్యమైన యువతను తీర్చిదిద్దాలని ఉద్దేశంతో 65 ఏటీసీ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని, వాటిని సమూలంగా మార్చి ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యం కలిగిన శిక్షణ అందించాలన్న లక్ష్యంతో గత ఏడాది ఇదే ప్రాంగణంలో ఏటీసీలకు పునాదులు వేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం 65 ఏటీసీలకు అదనంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో మరో 51 ఏటీసీలను ప్రారంభిస్తామన్నారు.
ఈ 116 ఏటీసీలు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తాయని తెలిపారు. రాష్ట్రంలోని ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ATCs) ఒక్కో ఏటీసీ కేంద్రానికి 45 కోట్ల రూపాయలతో ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. నైపుణ్యం పెంచుకోవడానికి ప్రభుత్వం అన్ని అవకాశాలను కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవాలని మంత్రులు యువతకు పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రతి జిల్లాలో పాల శీతలీకరణ కేంద్రాల నిర్మాణానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా రైతులు పాడి పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రులు సూచించారు.పాల ఉత్పత్తుల ద్వారా అనేక లాభాలతో పాటు అధిక మొత్తంలో లాభాలు పొందవచ్చని తెలిపారు. లాభదాయకమైన ఆదాయ వనరులుగా పాడి పరిశ్రమ రూపాంతరం చెందిందని, గ్రామీణ ప్రాంతంలోని రైతులు పాడి పశువులను పెంపొందించుకునే దిశగా కృషి చేయాలని సూచించారు. ప్రస్తుతం 2025 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ మద్ధతుతో 2.50 కోట్లు ఖర్చు చేసి బియంసియు కొండారెడ్డిపల్లి సామర్ధ్యాన్ని రోజుకు 13,000 లీటర్ల నుండి 30,000 లీటర్లకు పెంచారన్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో రోజుకు 30,000 లీటర్ల పాల సేకరణ చేసే మోడల్ బియంసియులలో మొట్టమొదటి బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ మన బియంసియు కొండారెడ్డిపల్లి మాత్రమే అన్నారు. అదేవిధంగా ఆదునిక ప్రమాణాలతో ప్రయోగశాల పరికరాలు మరియు ఇతర పనులకు మరో 1.05 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు మంత్రులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, వివిధ శాఖల రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, కొండారెడ్డిపల్లి అభివృద్ధి కమిటీ చైర్మన్, కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పాల్గొన్నారు.

134 కోట్ల అభివృద్ధి పనులు

మొత్తం 134 కోట్ల రూపాయల వ్యయంతో 18 రకాల అభివృద్ధి పనులకు అంకురార్పణ జరిగింది. 6 కోట్ల రూపాయలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు కొత్త సముదాయ భవనాల నిర్మాణాలు, 30 లక్షల రూపాయలతో పాల సేకరణ కేంద్రం, 30 లక్షల రూపాయలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ (మాల), 30 వేల లీటర్ల సామర్థ్యంతో ఆధునిక పరికరాలతో పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభించబడ్డాయి. 20 లక్షల రూపాయలతో 10 సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు, 1 కోటి 30 లక్షల రూపాయలతో సోలార్ వీధి దీపాల ఏర్పాట్లకు శంకుస్థాపనలు చేశారు.

10 లక్షల రూపాయలతో పశువైద్యశాల కంపౌండ్ వాల్,  భవన బ్యాలెన్స్ పనులు, 85 లక్షల రూపాయలతో మిషన్ భగీరథ ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్ (OHSR) నిర్మాణం, 7 కోట్ల రూపాయలతో 6 కిలోమీటర్ల రహదారి డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు, 20 లక్షల రూపాయలతో 7 కిలోమీటర్ల పరిధిలో 30 వేల మొక్కల అవెన్యూ ప్లాంటేషన్ పనులు ప్రారంభించబడ్డాయి.

అలాగే 25 లక్షల రూపాయలతో అంగన్‌వాడీ కేంద్రం, 5 కోట్లు 50 లక్షల రూపాయలతో కొండారెడ్డిపల్లి–రాంనగర్ బిటి రహదారి, 50 లక్షల రూపాయలతో డ్వాక్రా భవనం, 35 లక్షల రూపాయలతో గ్రంథాలయం భవనం ఫస్ట్ ఫ్లోర్‌లో కల్చరల్ సెంటర్ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా 10 కోట్లు 31 లక్షల రూపాయలతో వ్యవసాయ పంపుసెట్ల సోలరైజేషన్ కోసం మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన చేశారు. 50 లక్షల రూపాయలతో కమ్యూనిటీ సెంటర్ నిర్మాణం, 55 కోట్ల రూపాయలతో కొండారెడ్డిపల్లి గేట్ నుండి పోల్కంపల్లి గ్రామం వరకు రహదారి మెరుగుదల పనులు (భూసేకరణతో సహా), కొండారెడ్డిపల్లి ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి పోల్కంపల్లి వరకు మిషన్ భగీరథ గ్రిడ్ పైప్‌లైన్ పనులు ప్రారంభించబడ్డాయి.

Just In

01

Ram Charan: చేతులపై కిరోసిన్ పోసుకుని మ్యూజిక్ కొట్టావా థమన్.. ‘ఓజీ’ మ్యూజిక్‌పై చరణ్ రియాక్షన్

Jatadhara: ‘జటాధర’ ధన పిశాచి వచ్చేది ఎప్పుడంటే..

KTR: జూబ్లీహిల్స్‌లో టూరిస్ట్ మంత్రుల ఎన్నికల ప్రచారం.. ఎన్నికలు అయిపోగానే గాయబ్!

Toss controversy: టాస్ సమయంలో ఊహించని సీన్.. పాకిస్థాన్ కెప్టెన్‌తో మాట్లాడని రవిశాస్త్రి

CM Revanth Reddy: దేశానికే ఆదర్శంగా నిలవనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం