Panchayat Secretaries: అధికారుల నిర్లక్ష్యం పంచాయతీకార్యదర్శులకు (Panchayat Secretaries) శాపంగా మారింది. దీంతో సర్వీసే కాదు.. ఇంక్రీమెంట్లు సైతం కోల్పోతున్నారు. కార్యదర్శులు విజ్ఞప్తులు చేస్తున్నా పట్టించుకున్నదాఖలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. మంత్రిగానీ, కమిషనర్ గానీ చొరవ తీసుకుంటే తప్పా కార్యదర్శుల ఎఫెక్టీవ్ డేట్ వచ్చేలా కనబడటం లేదు. పంచాయతీ కార్యదర్శులుగా ఉద్యోగానికి ఎంపికై 2019ఏప్రిల్ 12న విధుల్లో చేరారు. నోటిఫికేషన్ ప్రకారం 9355 మంది ఉన్నారు. ఇందులో 2వేల మంది ఇతర ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోయారు. కామన్ ఎఫెక్టివ్ డేట్ కోసం సుమారు 7వేల మంది ఎదురు చూస్తున్నారు. 2023 ఏప్రిల్ 11వ తేదీవరకు 4 సంవత్సరాలు కంప్లీట్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా సర్వీసు అందరికీ ఓకే విధంగా ఉండేలా ఈ ఏడాది మే19న పంచాయతీరాజ్ కమిషన్ అన్ని జిల్లాల డీపీఓ(జిల్లా పంచాయతీరాజ్ అధికారి)లకు మెమో 2560/cpr and RE/ b2/2027 ఇచ్చారు. దాని ప్రకారం గ్రేడ్-4 కన్వర్టు అయినా జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఎఫెక్టీవ్ డేట్ ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన్నారు.
Also Read: GHMC: జీహెచ్ఎంసీ మూడు కీలక శాఖ అధికారులకు స్థానచలనం.. ఉత్తర్వులు జారీ!
31 జిల్లాలు ఉండగా అన్ని జిల్లాల కు డీపీఓలు
కానీ డీపీఓలు మాత్రం జాప్యం చేస్తున్నారనేది స్పష్టమవుతోంది. రాష్ట్రంలో 31 జిల్లాలు ఉండగా అన్ని జిల్లాల కు డీపీఓలు ఉన్నాయి. అయితే 9 జిల్లాలకు చెందిన డీపీఓలు మాత్రమే కమిషనర్ ఆదేశాలను పాటించారు. అందులో మేడ్చల్, వనపర్తి, సూర్యాపేట, జనగామ, నారాయణపేట, జగిత్యాల, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట జిల్లాలకు చెందిన డీపీఓలు ఎఫెక్టీవ్ డేట్ కు సంబంధించిన ఫైల్ ను కలెక్టర్ కు పెట్టారు. ఇంకా 22 జిల్లాల డీపీఓల నుంచి స్పందన కరువైందనే విమర్శలు ఉన్నాయి. ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. మెమో ఇచ్చి 5 నెలలు గడుస్తున్నా డీపీఓలు స్పందించకపోవడం వారి పనితీరును సైతం స్పష్టం చేస్తుంది.
నిలిచిన సెకండ్ ఇంక్రీమెంట్
డీపీఓల నిర్లక్ష్యంతో పంచాయతీ కార్యదర్శులకు సెకండ్ ఇంక్రిమెంట్ సైతం నిలిచిపోయింది. ఎఫెక్టీవ్ డేట్ కోసం ఇంకా 6వేల మంది పంచాయతీ కార్యదర్శులు ఎదురుచూస్తున్నారు. ఈ డేట్ ఇస్తేనే ప్రొబిషన్ డిక్లరేషన్ కు వెసులుబాటు ఉంటుంది. పంచాయతీ కార్యదర్శులందరికి ఒకే తేదీ ఉంటుంది. ఇది ఇలా ఉంటే పంచాయతీ కార్యదర్శులకు ఈ ఏడాది ఏప్రిల్ లో సెకండ్ ఇంక్రిమెంట్ రావల్సి ఉంది. కానీ కామన్ ఎఫెక్టీవ్ డేట్ కోసం డీపీఓలు పైల్ ను కలెక్టర్ కు అందజేయకపోవడంలో జరుగుతున్న జాప్యమే కారణమని పలువురు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యదర్శులు ఎవరైనా విధుల్లో నిర్లక్ష్యం చేసినా, తప్పు చేసినా మెమోలు, వివరణలు వెంటనే తీసుకొంటున్నారని, కానీ మాకు రావాల్సిన బెనిఫిట్స్ మాత్రం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. రిపోర్ట్ ఇవ్వడంలో ఆలస్యం అయితే మాపై చర్యలు తీసుకుంటారని, ఎఫెక్టీవ్ డేట్ పై ఆలస్యం చేస్తున్న డీపీఓలపై ఎవరు చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు సర్వత్రా చర్చజరుగుతుంది.
లోపించిన కమిషనర్ కార్యాలయం మానిటరింగ్
కమిషనర్ కార్యాలయం నుంచి మెమో ఇచ్చారు. వదిలేశారు. దానిపై మానిటరింగ్ చేయకపోవడంతో జిల్లా పంచాయతీ రాజ్ అధికారులు ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉద్దేశ పూర్వకంగానే డీపీఓలు ఫైల్ ఆపుతున్నారనేది కూడా స్పష్టమవుతోంది. ఈ తరుణంలో మంత్రి సీతక్క, కమిషనర్ కార్యాలయం అధికారులు చొరవ తీసుకుంటే తప్ప కార్యదర్శులకు ఎపెక్టీవ్ డేట్ వచ్చే అవకాశం లేదు. ఆ దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? లేకుంటే చూసిచూడనట్లు వ్యవహరిస్తారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Also Read: OG Movie: ఎక్స్ లో ట్రెండ్ అవుతున్న డిజాస్టర్ ఓజీ.. ఆ ఫ్లాప్ మూవీతో పోలుస్తున్న ట్రోలర్స్