Nitish, modi, babu
Top Stories

Narendra Modi: మోదీతో.. జర పైలం..!

– మిత్రపక్షాల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు
– కీలకంగా మారిన చంద్రబాబు, నితీష్
– మోదీ ఏకపక్ష నిర్ణయాలు ఇక కష్టమేనా?
– భాగస్వామ్య పక్షాల్లో చీలిక తీసుకురావడంలో బీజేపీ టాప్
– భవిష్యత్‌లో టీడీపీ, జేడీయూల మధ్య చీలిక తప్పదా?
– మొదటినుంచీ ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా మోదీ
– బీజేపీ బలపడేందుకు ప్రాంతీయ పార్టీలను బలిపెట్టిన చరిత్ర
– మోదీతో జాగ్రత్తగా ఉండాలంటున్న రాజకీయ పండితులు

Chandrababu Nitish be careful with Modi policies in future: ఎట్టకేలకు మిత్ర పక్షాల సాయంతో సంపూర్ణం కాకపోయినా సంకీర్ణంగా ప్రభుత్వం ఏర్పాటైంది. పదేళ్లుగా తనకు తిరుగే లేదని భావించిన బీజేపీకి ఇప్పటిదాకా మిత్ర పక్షాల అవసరమే లేకుండా పోయింది. కానీ, ఈసారి ఎన్నికల ఫలితాలతో తప్పనిసరిగా ఆ అవసరం ఏర్పడింది. మోదీ పాతికేళ్ల రాజకీయ ప్రయాణాన్ని గమనిస్తే ఎదుటివారి డిమాండ్లకు తలొగ్గి పనిచేస్తారనేది ఎక్కడా కనబడదని అంటుంటారు రాజకీయ మేధావులు. పైకి, కనిపించని మొండితనం, సమయానుకూల ప్రవర్తన, శత్రువులను చాకచక్యంతో ఎదుర్కోవడం, దారికి రాకుంటే వారిపై ప్రభుత్వ సంస్థలను పురిగొల్పడం మోదీ స్టయిల్ అని చెబుతుంటారు. మొదట్నుంచి ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకమైన మోదీ, ఇప్పుడు అదే ప్రాంతీయ పార్టీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో వీటి మధ్య చీలికలు రాకుండా ఉంటాయా? అనే చర్చ జరుగుతోంది.

చాపకింద నీరులా కాంగ్రెస్ కూటమి

సంకీర్ణ పార్టీల మద్ధతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిని మోదీకి ఇకపై ఏక పక్ష నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉండదు. తప్పనిసరిగా చంద్రబాబు, నితీష్ కుమార్‌ల సలహాలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే చాపకింద నీరులా కాంగ్రెస్ కూటమి అవసరమైతే ప్రభుత్వ ఏర్పాటుకు వెనుకాడబోమని సంకేతాలు ఇస్తోంది. ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి చేసి కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు చేయకపోయినా, ప్రజా తీర్పును అమలు చేసేందుకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం, కొన్నాళ్లు దానిని స్థిరంగా నిలుపుకొని అప్పుడు నెంబర్‌ గేమ్‌ ప్రారంభించడం మోదీ వ్యూహం అయి ఉండొచ్చన్న అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ, జేడీయూలను చీలుస్తారా?

తనకు పంటికింద రాయిగా మారబోయే టీడీపీ, జేడీయూలను మోదీ చీల్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఇందుకు గత చరిత్రే సాక్ష్యంగా చెబుతున్నారు రాజకీయ విమర్శకులు. గతంలో తన మిత్రపక్ష పార్టీలనే చీల్చిన ఘనమైన చరిత్ర బీజేపీది. మోదీ, షా రాజకీయ వ్యూహాలను ఎప్పటికప్పుడు పసిగట్టకపోతే ముందు మునిగేది టీడీపీ, జేడీయూలేనని హెచ్చరిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు దెబ్బ కొట్టడం కమలనాథుల నైజమని అంటున్నారు రాజకీయ పండితులు. మోదీ, అమిత్‌ షా మిత్రలాభం పాటిస్తూనే, తగిన సమయం చూసుకొని వదిలేసిన ఉదంతాలు ఉన్నాయి. ఆయా పార్టీలలో ముసలం పుట్టించిన సందర్భాలూ ఉన్నాయి. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు బలపడటాన్ని మోదీ తన స్వభావరీత్యానే ఇష్టపడరనే అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే, గతంలో భాగస్వామ్య పక్షాలైన శివసేన, అకాలీదళ్‌, అన్నాడీఎంకే, ఎల్జేపీ, పీడీపీ, తాజాగా జేజేపీ ఇలా అన్ని పార్టీల్లో బీజేపీ చీలిక తెచ్చింది. కనుక రానున్న రోజుల్లో ఏమైనా జరగొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులోనూ ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్‌కంటే, ప్రాంతీయ పార్టీలు బీజేపీకి కొట్టిన దెబ్బలే ఎక్కువ. బీజేపీకి మెజార్టీ దక్కకపోవడానికి అదొక ప్రధాన కారణం.

నిండా ముంచుతుందా?

మరోసారి కొలువుదీరిన మోదీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వ భవితవ్యం ప్రాంతీయ పార్టీల చేతిలో ఉంది. బీజేపీ బలపడితే, నిలబెట్టిన పార్టీలనే నిండా ముంచుతుంది అన్నది చరిత్రే. ఆ చరిత్రలో మరోసారి టీడీపీ, జేడీయూ జారి పడతాయా? లేక మోదీ, షాల నెంబర్‌ గేమ్‌ను అధిగమిస్తాయా? అన్నది భవిష్యత్తు తేల్చనున్నది.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?