TIMS Specialty Hospitals: టిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లలో జనరల్ ఓపీ లేకుండానే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, తదితర చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఓపీ కౌంటర్లు లేకుండానే వైద్యసేవలు అందించాలని ఆలోచిస్తున్నారు. స్పెషాలిటీ(Specialty), సూపర్ స్పెషాలిటీ(Super Specialty) సేవలకు ప్రయారిటీ ఇస్తూ వైద్యసేవలు కొనసాగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఇటీవల ఆఫీసర్లు గాంధీ(Gandhi), ఉస్మానియా(OU), నిమ్స్ దవాఖాన్ల తీరును పరిశీలించారు. జనరల్ ఓపీ, స్పెషాలిటీ ఓపీల వచ్చే పేషెంట్ల రద్దీ, వైద్య సేవలు అందుతున్న తీరుపై స్టడీ చేశారు. దీంతో పాటు డయాగ్నస్టిక్ సేవలు, ఎమర్జెన్సీ గోల్డెన్ అవర్, క్యాజువాలిటీ సేవలపై అధ్యయనం చేశారు.
సనత్ నగర్ లోని టిమ్స్..
ఆ తర్వాత జనరల్ ఓపీ లేకుండానే టిమ్స్ దవాఖాన్లు నిర్వహించడం వలన పేషెంట్ల రద్దీ తగ్గడంతో పాటు వైద్యసేవలు కూడా స్పీడ్ గా అందించవచ్చని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం. త్వరలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది. అయితే ఈ ఏడాది డిసెంబరులో సనత్ నగర్ లోని టిమ్స్ దవాఖానను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్మాణాలను వేగవంతం చేయిస్తుండగా, ఆ తర్వాత మిగతా దవాఖాన్లను వరుసగా ప్రారంభించనున్నారు. ఈ దవాఖాన్లు అన్నీ అందుబాటులోకి వస్తే వైద్యసేవల రూపు రేఖలే మారనున్నాయని డాక్టర్లు, ప్రభుత్వ ఆఫీసర్లు భావిస్తున్నారు. బెడ్ల కొరత అనే అంశమే తెరమీదకు రాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం గాంధీ, నిమ్స్, ఉస్మానియాలో ఐసీయూ బెడ్ల కొరత వేధిస్తున్నది. ఈ హాస్పిటల్స్ అందుబాటులోకి వస్తే ఆ సమస్యకు చెక్ పడనున్నది.
Also Read: BRS women wing: బీఆర్ఎస్ మహిళా విభాగ అధ్యక్షురాలి పదవి ఎవరికి?
ఎక్స్ క్లూజీవ్ కేంద్రాలుగానే..?
హైదరాబాద్‌లో నిర్మిస్తున్న మూడు టిమ్స్ ఆసుపత్రులు సూపర్ స్పెషాలిటీ కేంద్రాలుగా మారనున్నాయి.అల్వాల్, సనత్‌నగర్, కొత్తపేటలో వెయ్యి పడకల సామర్థ్యంతో ఏర్పాటవుతున్న ఈ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. సనత్ నగర్ టిమ్స్ లో గుండె, కొత్త పేట్ టిమ్స్ లో జీర్ణకోశ, అల్వాట్ టిమ్స్ లో నాడీ సంబంధిత వ్యాధులకు ప్రత్యేక చికిత్స అందనుంది. కొత్తగా నిర్మిస్తున్న మూడు టిమ్స్ ఆసుపత్రులతో పాటు వరంగల్ హెల్త్ టవర్ దవాఖానలోనూ రిఫరల్, ఎమర్జెన్సీ సేవలకే ప్రయారిటీ ఇవ్వనున్నారు. దీని వలన వైద్యసేవల్లో క్వాలిటీ పెరుగుతుందని డాక్టర్లు టీమ్ చెప్తున్నది. బేసిక్ ట్రీట్మెంట్, చిన్న చిన్న రోగాలకు ప్రాథమిక స్థాయిలోనే పీహెచ్సీలు, యూపీహెచ్ సీలు, బస్తీ దవాఖానలు, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లతో పాటు ఏరియా, జిల్లా దవాఖాన్లు కూడా ఉన్నాయి. వీటికి అదనంగా జిల్లాకో మెడికల్ కాలేజీ కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో కొత్తగా అందుబాటులోకి రాబోయే టిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లలో స్పెషాలిటీ వైద్యమే అందిస్తే బెటర్ అంటూ అధికారులు కూడా చెప్తున్నారు.
ప్రాథమిక, ద్వితీయ శ్రేణి దవాఖాన్ల నుంచి రిఫరల్స్, ఎమర్జెన్సీ సేవలను మాత్రం తప్పనిసరిగా అందించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖాన్లలో జనరల్, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ లు కలిపి అందిస్తున్న నేపథ్యంలో పేషెంట్ల రద్దీ తీవ్రంగా ఉన్నది. దీంతో వైద్యసేవల్లో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ పరిస్థితి రాకూడదంటే ఎక్స్ క్లూజీవ్ కేంద్రాలుగా నే నిర్వహించాల్సిన పరిస్థితి ఉన్నదని వివరిస్తున్నారు.
రీసెర్చ్ యూనిట్లగానూ…?
కార్పొరేట్ స్థాయిలో అందుబాటులోకి రానున్న టిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లలో ఎయిమ్స్, నిమ్స్ మాదిరిగా రీసెర్చ్ యూనిట్ లనూ ఏర్పాటు చేయనున్నారు. దీని వలన వైద్య విద్యార్ధులకు రీసెర్చ్ నిర్వహించేందుకు వెసులుబాటు ఉండనున్నది. తద్వారా వైద్యసేవల్లో మరింత అడ్వాన్స్, క్వాలిటీ ట్రీట్మెంట్ లకు అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలపై జాతీయ స్థాయిలో సెమినార్లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అంతేగాక అత్యాధునిక మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లతో పాటు ట్రామ కేర్ సెంటర్లు, ఆసుపత్రులకు అనుబంధంగా మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు కూడా పనిచేయనున్నాయి. దీంతో సూపర్ స్పెషాలిటీ సేవలు స్పీడప్ కానున్నాయి. తద్వారా ప్రజలకు క్వాలిటీ ట్రీట్మెంట్ అందుబాటులోకి రానున్నది.
Also Read: Mallu Bhatti Vikramarka: రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు