Pruthivi Raj – Dulquer: లగ్జరీ కార్ల పన్ను ఎగవేతకు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), కస్టమ్స్ విభాగం అధికారులు సంయుక్తంగా ‘నమకూర్’ పేరిట స్పెషల్ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేరళలోని పలు జిల్లాల్లో సోదాలు నిర్వహించారు. తిరువనంతపురం, ఎర్నాకులం, కొట్టాయం, కోళికోడ్, మలప్పురం జిల్లాల్లోని 30 ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో స్టార్ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ ఇళ్లు సైతం ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నటుల ఇళ్లల్లో సోదాలు..
‘ఆపరేషన్ నమకూర్’ లో భాగంగా.. స్టార్ హీరోలు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లల్లోనూ అధికారులు తనిఖీలు చేశారు. పనంపిల్లి నగర్‌లోని దుల్కర్ నివాసానికి వెళ్లి సోదాలు చేపట్టారు. అలాగే.. కొచ్చి, తిరువనంతపురంలో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాల్లోనూ ఏకకాలంలో తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ సోదాల్లో ఎలాంటి విలాసవంతమైన కార్లను అధికారులు గుర్తించలేదని టాక్. దీంతో వారు అక్కడి ఇళ్ల నుంచి వెనుదిరిగినట్లు సమాచారం.
VIDEO | Kochi: Customs officials conduct raids at the residences of Mollywood actors Prithviraj Sukumaran and Dulquer Salmaan as part of Operation Numkhor.
(Full video available on PTI Videos – https://t.co/dv5TRARJn4) pic.twitter.com/U6m49IDtL9
— Press Trust of India (@PTI_News) September 23, 2025
భూటాన్ నుంచి కార్ల దిగుమతి
అధికారుల సమాచారం ప్రకారం.. ఎనిమిది రకాల లగ్జరీ వాహనాలను భూటాన్ ద్వారా భారత్‌కు దిగుమతి చేసి పన్నులు ఎగ్గొట్టారు. ముందుగా ఈ వాహనాలను హిమాచల్ ప్రదేశ్‌లో రిజిస్టర్ చేసి తరువాత దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో అసలు రిజిస్ట్రేషన్ నంబర్లను మార్చి వాటి మూలాన్ని దాచే ప్రయత్నం చేశారు. వాహనాలను స్వాధీనం చేసుకొని.. యజమానులకు నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వాహనాల అసలైన పత్రాలను సమర్పించాలని వారికి ఆదేశించనున్నట్లు తెలిపారు.
Also Read: No Diwali Gifts: ప్రజాధనంతో ఉద్యోగులకు గిఫ్టులా? కేంద్రం కన్నెర్ర.. కీలక ఆదేశాలు
పలు దశల్లో సోదాలు
ప్రముఖుల ఇళ్లలో సోదాలు జరగడం మీడియా దృష్టిని ఆకర్షించినప్పటికీ ఇది కేవలం సిస్టమేటిక్ ఆపరేషన్‌లో భాగమేనని డీఆర్ఐ, కస్టమ్స్ అధికారులు తెలిపారు. లగ్జరీ వాహనాల మార్కెట్ విలువ అధికంగా ఉండటం వల్ల పన్ను ఎగవేతకు ఎక్కువ అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ‘నమకూర్’ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. అయితే ఈ ఆపరేషన్ పలు దశల్లో కొనసాగనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. వాహనాల డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలు, రవాణా మార్గాలపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొన్నారు.