Telangana: ప్రభాకర్ రావు సహకరించటం లేదు.?
prabhakar rao ( Image Source: Twitter)
Telangana News

Telangana: ప్రభాకర్ రావు సహకరించటం లేదు.. సుప్రీంకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు

Telangana: ఫోన్​ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ప్రభాకర్ రావు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఉన్నా దర్యాప్తునకు ఏమాత్రం సహకరించటం లేదని రాష్ట్రప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆయనకు కల్పించిన మధ్యంతర రక్షణను రద్దు చేయాలని కోరారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ ఛీఫ్​ ప్రభాకర్​ రావు ప్రధాన నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తల్లోనే ఫోన్ ట్యాపింగ్ బాగోతం వెలుగు చూసింది.

మూడోసారి కూడా ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ పెద్దలు ప్రభాకర్ రావు ద్వారా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు వేర్వేరు పార్టీలకు చెందిన అగ్రనాయకులు, బడా వ్యాపారులు, పారిశ్రామిక వేత్తల ఫోన్లను ట్యాప్ చేయించిన విషయం వెలుగు చూసింది. దాంతో ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఆ వెంటనే ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయాడు. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించి పాస్ పోర్టును సైతం రద్ధు చేయించిన తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో స్వదేశానికి తిరిగి వచ్చాడు. అయితే, వచ్చే ముందు తనకు బెయిల్​ మంజూరు చేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయటానికి నిరాకరించింది.

అయితే, ప్రభాకర్ రావుపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర రక్షణ కల్పించింది. అదే సమయంలో విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. ఆ తరువాత ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరయ్యాడు. అయితే, పదిసార్లు నోటీసులు ఇచ్చి పిలిపించినా ప్రభాకర్ రావు కేసుకు సంబంధించి ఎలాంటి కీలక వివరాలు వెల్లడించలేదు. తాను ఏం చేసానో పై అధికారులు అందరికీ తెలుసని మాత్రమే చెబుతూ వచ్చాడు. ఫోన్​ ట్యాపింగ్ లో అసలు సూత్రధారులు ఎవరని ఎన్నిరకాలుగా ప్రశ్నించినా పెదవి విప్పలేదు. సాక్ష్యాధారాలను రూపుమాపిన దానిపై అడిగిన ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు ఇవ్వలేదు. దాంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రభాకర్ రావుకు కల్పించిన మధ్యంతర రక్షణను తొలగించాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్ బీ.వీ.నాగరత్న ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేసులో నిందితులుగా ఉన్నవారు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లు, సాక్ష్యాధారాలను చెరిపి వేశారని తెలిపారు. డేటా రికవరీ చేయటానికి కూడా ప్రభాకర్ రావు సహకరించటం లేదని చెప్పారు. ప్రభాకర్ రావు కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను దర్యాప్తు అధికారులకు అప్పగించినట్టు తెలిపారు. అయితే, అప్పగించటానికి ముందే వాటిని పూర్తిగా ఫార్మాట్ చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ల్యాప్ టాప్ ను సైతం ఫార్మాట్ చేసినట్టు చెప్పారు. కాగా, ప్రభాకర్ రావు తరపు న్యాయవాది శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ సిట్ అధికారులు ఎప్పుడు పిలిచినా తన క్లయింట్ విచారణకు హాజరవుతున్నట్టు చెప్పారు. దర్యాప్తునకు సహకరిస్తున్నట్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు విచారణను వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేసింది.

Just In

01

Xiaomi Launch: అల్ట్రా ఫీచర్లతో Xiaomi 17 Ultra లాంచ్

Phone Tapping Case: ట్యాపింగ్ వెనుక రాజకీయ ఆదేశాలేనా? కేసీఆర్, హరీశ్ రావుల విచారణపై చర్చ!

Gram Panchayat: గ్రామ పంచాయతీలకు నిధులొస్తాయా?.. సర్పంచుల్లో టెన్షన్!

Ugandhar Muni: ఎవరి మనోభావాలు దెబ్బ తీయకుండా.. ‘శంబాల’ కథ రాశా!

Mana Shankara Varaprasad Garu: పూనకాలు లోడింగ్.. ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ డేట్ ఫిక్స్!