Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు కేవలం ఒక దర్శకుడిది మాత్రమే కాదు, ఇది ఒక బ్రాండ్ అని చెప్పుకోవాలి. కేవలం మూడు చిత్రాలతోనే ఈ యువ దర్శకుడు సృష్టించిన సంచలనం అసాధారణం. దానిలో ఒకటి హిందీ రీమేక్ అయినప్పటికీ, కేవలం రెండు ఒరిజినల్ సినిమాలతోనే తనదైన ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.
రామ్ గోపాల్ వర్మ లాంటి దిగ్గజ దర్శకుడు కూడా సందీప్ రెడ్డి వంగ సినిమాలకు, ఆయన టేకింగ్‌కు ఫిదా అయిపోయాడంటే, ఇది మామూలు విషయం కాదు. ప్రస్తుతం సందీప్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ‘స్పిరిట్’ అనే భారీ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రం పై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సందీప్ ఈ అంచనాలను మించేలా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. మరి, ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే, ‘స్పిరిట్’ రిలీజ్‌కు ఇంకా సమయం ఉండటంతో, తన మార్క్‌ను అభిమానుల్లో అలాగే నిలబెట్టేందుకు సందీప్ పక్కా ప్లాన్ వేస్తున్నాడు.
Also Read: Bathukamma Festival: శ్రీ చైతన్య పాఠశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. స్త్రీల సాంప్రదాయానికి ప్రతీక
సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు కేవలం దర్శకుడిగానే కాక, నిర్మాతగా కూడా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టబోతున్నాడు. తన సొంత నిర్మాణ సంస్థ ‘భద్రకాళి పిక్చర్స్’ పతాకం పై కొత్త నటీనటులు, దర్శకులతో సినిమాలు తీయాలని నిర్ణయించాడు. ఈ కొత్త ప్రయాణంలో మొదటి సినిమాకు ముహూర్తం కూడా ఖరారు చేశాడు. ఈ సినిమాకి రామ్ గోపాల్ వర్మ శిష్యుడైన వేణుని దర్శకుడిగా ఎంచుకున్నాడు. తెలంగాణ నేపథ్యంలో యూత్‌ఫుల్ కంటెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో ‘మేం ఫేమస్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ హీరోగా నటించనున్నాడు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రానుందని ఇండస్ట్రీ వర్గాల తెలిసిన సమాచారం. ఇప్పటివరకు దర్శకుడిగా బ్లాక్‌బస్టర్‌లు కొట్టిన సందీప్ రెడ్డి వంగ, నిర్మాతగా ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఈ కొత్త ప్రయాణంలో అతడు మరోసారి తనదైన ముద్ర వేస్తాడనడంలో సందేహం లేదు.