- ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని డిమాండ్
- కాంగ్రెస్ పార్టీకి సొంతంగా 99 స్థానాలు రావడంతో రాహుల్ కీలక పాత్ర
- రాహుల్ గాంధీకి కూటమి మిత్ర పక్షాల నుంచి మద్దతు
- మోదీకి ప్రత్యామ్నాయ నేతగా రాహుల్ నే కోరుకుంటున్న కాంగ్రెస్ కూటమి
- 2014, 2019లో ప్రతిపక్ష హోదాను సైతం దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్
- జోడోయాత్రతో రాహుల్ కు జనంలో పెరిగిన క్రేజ్
- ప్రచారంలోనూ మోదీని ఇరుకున పెట్టిన రాహుల్
- రాహుల్ కు అన్ని విధాలా అర్హత ఉందంటున్న రాజకీయ పండితులు
Increased the pressure on Rahul Gandhi as opposition leader in parliament:
మొన్నటి దాకా అయనో పప్పు అన్న నేతలంతా నేడు నిప్పు అంటున్నారు. రాహుల్ అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ అంటున్నారు అభిమానులు. ఎన్నో అవమానాలు, ఓటమి భారాలు, నిరాశానిస్తేజాల మధ్య ఊగిసలాడిన రాహుల్ భవితవ్యం నిన్నటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా గ్రాఫ్ పెరిగిపోయింది. సొంత పార్టీనేతలే కాదు ఇండియా కూటమి అగ్ర నేతలు కూడా రాహుల్ నాయకత్వానికి మద్దతుగా నిలిచారు. మోదీకి సరైన ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీ ఆవిర్భవించనున్నాడని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లోక్ సభ ఎన్నికలలో తనదైన శైలిలో ప్రచారం చేసిన రాహుల్ అనేక సందర్భాలలో మోదీని ఇరుకున పెట్టడం దేశమంతా గమనిస్తూనే ఉంది. పైగా రాహుల్ పై వ్యక్తిగత కక్షతో బీజేపీ ఆయనను జైలుకు పంపడం కూడా సానుభూతి పెరిగినట్లయింది అని రాజకీయ పండితులు చెబుతున్నారు.
కూటమి విజయంలో కీలక పాత్ర
ప్రస్తుత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకోవడంలో, అటు కూటమి పక్షాల విజయంలో తనవంతు పాత్ర పోషించిన ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీని ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రమంగా కూటమి సభ్యులు కూడా రాహుల్ గాంధీని ప్రధాన ప్రతిపక్ష నేతగా చూడాలని అనుకుంటున్నాయి. ఈ మేరకు రాహుల్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడిలు చేస్తున్నాయి మిత్ర పక్షాలు. ఇండియా కూటమిలోని చిన్నాచితకా పార్టీల నేతలు ఆయన ఎంపికను సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2014లో కాంగ్రెస్ 48, 2019 ఎన్నికలలో 52 స్థానాలు గెలుచుకున్న స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. అదే సమయంలో కాంగ్రెస్ పక్ష నేతగా రాహుల్ ను కొనసాగించాలనే డిమాండ్ వచ్చినా రాహుల్ మాత్రం సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుత ఎన్నికలలో కేవలం కాంగ్రెస్ పార్టీకే ఎవరి మద్దతూ లేకుండా 99 సీట్లు వచ్చాయి. ఇంచుమించు సెంచరీ సాధించారు రాహుల్. ఇక లోక్ సభలో 10 శాతం సీట్లు అంటే కనీసం 55 సీట్లు అయినా వస్తేనే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. ప్రస్తుతం ఆ స్థానాలు గెలిచినందున ఆ హోదాలో రాహుల్‌గాంధీ ఉండాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఆయన ప్రస్తుత ఎన్నికల్లో రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి భారీ మెజారీ్టలతో గెలవడంతో పాటు మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడులో కూటమి పక్షాలకు మెజార్టీ స్థానాలు దక్కడంలో కీలకపాత్ర పోషించారు.
ప్రతిపక్ష నేతగా ఉండాలని రాహుల్ పై ఒత్తిడి
ఈ దృష్ట్యానే పార్టీ నేతలు ఆయన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాణిక్యం ఠాగూర్ ‘ఎక్స్’లో స్పందిస్తూ ‘నేను మా నాయకుడు రాహుల్ గాంధీ పేరు మీద ఓట్లు అడిగాను. ఆయన లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడిగా ఉండాలని భావిస్తున్నాను. ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు కూడా అలాగే ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను’ అని పోస్ట్ చేశారు. మరో సీనియర్ నేత డీకే శివకుమార్ సైతం రాహుల్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటారని జోస్యం చెప్పారు. ఒకవేళ రాహుల్ కాదన్న పక్షంలో సీనియర్ నేతలైన శశిథరూర్, గౌరవ్ గొగోయ్, మనీశ్ తివారీ, కేసీ వేణుగోపాల్‌లలో ఒకరిని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేస్తారని చెబుతున్నారు. దీనిపై శనివారం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తర్వాత నిర్ణయం చేస్తారని అంటున్నారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన 8వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సీడబ్యూసీ భేటీ జరగనుంది. ఇక రాహుల్ గెలిచిన రెండు స్థానాల్లో దేనిలో కొనసాగుతారు, దేనిని వదులుకుంటారన్న దానిపై ఇదే భేటీలో కొంత స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
మోదీకి సరైన ప్రత్యామ్నయం
2019లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష బాధ్యతలనుంచి తప్పుకున్నారు రాహుల్ గాంధీ. . ఇప్పుడు పార్టీని, కూటమిని ముందుండి నడిపించి.. అపోజిషన్ లీడర్‌కు కావాల్సిన అర్హతలన్నీ సాధించారు. అంతేకాదు, నరేంద్ర మోదీని ఎదుర్కోవడం అంత కష్టమేం కాదనే భావనను కూటమిలోని పార్టీలకు కల్పించగలిగారు రాహుల్ గాంధీ.మొత్తానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాకు రాహుల్‌గాంధీనే కరెక్ట్ అని తనను తాను నిరూపించుకున్నారు. . ప్రస్తుతం.. పార్లమెంట్‌లో ఓ బలమైన నాయకుడిగా రాహుల్ గాంధీ ప్రొజెక్ట్ అయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.