Eenadu groups chairman Ramoji rao died saturday early morning:
తెలుగు మీడియాలో ఆయనో సంచలనం. మీడియా మొఘల్ గా పేరుపొందిన ఈ నాడు సంస్థల చైర్మన్ రామోజీరావు (87) శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పరీక్షించిన వైద్యులు ఆయనను ఐసీయూకి తరలించారు. గుండె నొప్పి కూడా రావడంతో స్టంట్ వేశారు. వయోభారం రీత్యా పలు ఆరోగ్య సమస్యల కారణంగా రామోజీరావు గత కొంతకాలంగా బెడ్ కె పరిమితమయ్యారు. 5వ తేదీ మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావుకి స్టార్ హాస్పిటల్స్ వైద్యులు చికిత్స అందించారు. ఇటీవల ఆయనకు గుండె సమస్య ఏర్పడడంతో స్టంట్స్ కూడా వేసినట్లుగా చెబుతున్నారు. ఇక 7 వతేదీ మధ్యాహ్నం నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.. శుక్రవారం రాత్రి కూడా తీవ్ర విషమంగా ఉండడంతో ఆయనను వెంటిలేటర్ మీద ఉంచినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన కన్నుమూసినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.. శనివారం తెల్లవారుజామున 4:50 ని.లకు నిమిషాలకు తుది శ్వాస విడిచారు. పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు.
చరిత్రలో ఓ అధ్యాయం
కృష్ణాజిల్లా పెదపారుపూడి గ్రామంలో జన్మించిన ఆయన ఈనాడు మీడియా సంస్థలతో పాటు మార్గదర్శి చిట్ ఫండ్స్ అదే విధంగా ప్రియా పచ్చళ్ళు వ్యాపారం నిర్వహించేవారు. అంతేకాకుండా సినీ నిర్మాణంలో కూడా ఆయన నిర్మాతగా పలు సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఆయనకు భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ విభూషణ్ అవార్డును సైతం అందించారు. చివరిగా ఆయన నిర్మాతగా దాగుడుమూతలు దండాకోరు అనే సినిమా నిర్మించారు. ఇది 2015వ సంవత్సరంలో రిలీజ్ అయింది. తెలుగు మీడియాలో ప్రధానమైన ఈనాడు దినపత్రిక ద్వారా తెలుగు మీడియాను కొత్త పుంతలుతొక్కించిన రామోజీరావు చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యయాన్నే నిర్మించుకున్నారు. రైతు బిడ్డగా పుట్టిన ఆయన ఓ సామ్రాజ్యాన్నే స్థాపించుకున్నారు. ఏదైనా కొత్తగా చేయడం ఆయనకు ఉన్న అలవాటు. పది ఏళ్ల భవిష్యత్‌ను ముందుగానే ఊహించడం కూడా ఆయనకు ఉన్న మరో గొప్ప లక్షణం. అలాంటి ఆలోచనలతో పురుడుపోసుకున్నవే ఆయన సంస్థలు. ప్రియా పచ్చళ్లు మొదలుకొని నేటి ఈటీవీ భారత్ వరకు చేసిన ప్రతీదీ చాలా స్పెషల్ గా చెప్పుకుంటారు.