Telangana BJP: అధికార ప్రతినిధుల నియామకంపై బీజేపీ ఫోకస్
అమ్మో.. సికింద్రాబాదా?
అధికార ప్రతినిధుల నియామకంలో కొత్త ట్విస్ట్!
గతంలో ఆ లోక్‌సభ స్థానంవారికే పదవులంటూ విమర్శలు
ఆచితూచి అడుగులు వేస్తున్న రాష్ట్ర నాయకత్వం
పదవులు దక్కని వారి ఆశలన్నీ ఆ పోస్టుపైనే..
దాదాపు 20 మందికి ఛాన్స్?
ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఇటీవల రాష్ట్ర కమిటీని ప్రకటించిన బీజేపీ.. త్వరలోనే అధికార ప్రతినిధులను నియమించనుంది. అయితే, అధికార ప్రతినిధుల నియామకంలో పార్టీ ఆచితూచి వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ నియామకంలో పలు జాగ్రత్తలు తీసుకోనున్నట్లు సమాచారం. ఎందుకంటే, నూతన రాష్ట్ర కమిటీ నియామకంలో జరిగిన పొరపాట్లను ఈసారి జరగకుండా జాగ్రత్తలు పాటించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర కమిటీ నియామకంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న నేతలకే చోటు కల్పించారనే విమర్శలు వచ్చాయి. ఈ అంశంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఒక్క సికింద్రాబాద్ లోక్ సభ పరిధిలోనే 12 మందికి ఎలా ఛాన్స్ ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఆ కమిటీలో ఉన్నవారంతా మంచి వారని చెబుతూనే వారితో బీజేపీ అధికారంలోకి రారని ఘాటుగా స్పందించారు. దీంతో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధి అంటేనే అమ్మో.. అనుకునే పరిస్థితికి తీసుకొచ్చారు.
Read Also- Bhatti Vikramarka: మహిళల ఆర్థికాభివృద్ధికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం.. డిప్యూటీ సీఎం వెల్లడి
సికింద్రాబాద్ పార్లమెంట్‌కే ఎక్కువ పదవులు వచ్చాయన్న విమర్శల నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం అధికార ప్రతినిధుల నియామకంలో కొత్త ట్విస్ట్ పెట్టినట్లుగా తెలుస్తోంది. పదవి ఆశిస్తున్న వారిది ఏ పార్లమెంట్ సెగ్మెంట్ అనే అంశంపైనా దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ అయితే.. సమాలోచనలు చేశాకే నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. మరోసారి ఇలాంటి విమర్శలకు తావు లేకుండా చూడాలనే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు సమాచారం. స్పోక్స్ పర్సన్ పోస్ట్ కోసం ఆశావహులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి గతంలో కంటే ఎక్కువ మందికి అవకాశం కల్పించాలనే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also- H1B Visa Fee Hike: హెచ్-1బీ వీసా మార్పులపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్టును ఆశిస్తున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంది. అయితే, దీనికి తోడు రాష్ట్ర కమిటీలో చోటుదక్కని వారి కన్ను సైతం ఈ ఆ పోస్టుపై పడినట్లుగా తెలుస్తోంది. ఈ పోస్టుపైనే పలువురు నాయకులు ఆశలు పెట్టుకున్నట్లు చర్చించుకుంటున్నారు. కాగా దాదాపు 25 మంది పేర్లతో కూడిన జాబితా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అందులో నుంచి ఫైనల్ గా ఎంతమందిని ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. దాదాపు 20 మందికి ఫైనల్ గా అవకాశం దక్కే చాన్స్ ఉందని తెలుస్తోంది. అన్నీ ఓకే అయితే ఈ జాబితాను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధుల నియామకంలో ఇంత ఆచితూచి వ్యవహరిస్తున్న రాష్ట్ర నాయకత్వం చివరకు ఏం చేస్తుందనేది చూడాలి. మళ్లీ విమర్శలకు అవకాశం కల్పిస్తుందా? లేక అందరికీ సమన్యాయం చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.