Konda Surekha: అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీరమరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలు వృథా కానివ్వబోమని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. వారి ఆశయాలకు అనుగుణంగా ఉద్యోగులు చేస్తున్నారని కొనియాడారు. విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని బహుదూర్ పురలోని నెహ్రూ జూ పార్కులో నిర్వహించారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది
అమరవీరులకు మంత్రితో పాటు సీఎస్ రామకృష్ణా రావు, డీజీపీ జితేందర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విధి నిర్వహణలో అసువులు బాసిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అటవీ శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వం అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అటవీ సంపదను రక్షించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతిభావంతులైన ఫ్రంట్‌లైన్ అధికారులకు ఏటా రూ. 10 వేలు నగదు పురస్కారం అందిస్తున్నామన్నారు.
Also Read: BJP vs Congress: ప్రధాని తల్లి ఏఐ వీడియో రచ్చ.. దుమ్మెత్తిపోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్
కొత్తగా 2,181 వాహనాలు
కలప అక్రమ రవాణాను కట్టడికి సాయుధ పోలీసు దళాల సహకారం తీసుకొని ముందుకు వెళుతున్నారన్నారు. అటవీ సంరక్షణ బలోపేతానికి రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా 2,181 వాహనాలు ఇచ్చామన్నారు. అడవుల్లో గడ్డి, నీటి వనరుల అభివృద్దితో పంటపొలాలు, పశువులపై వన్యప్రాణుల దాడులు అరికట్టగిలిగామన్నారు. క్రూరమృగాల దాడిలో బాధితులకు ఇచ్చే పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచామన్నారు. వనమహోత్సవంతో రాష్ట్రంలో 307.48 కోట్లకు పైగా మొక్కలను ఇప్పటి వరకు నాటామన్నారు.
పీడీ యాక్టుకు సవరణలు చేసి ఫారెస్టు అధికారులపై దాడి చేసే నేరస్తులపై కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారన్నారు. పోలీసు విధి నిర్వహణలో మృతిచెందిన కుటుంబాలకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో.. అటవీ అమరవీరులకు కూడా అందేలా చూడాలని సీఎస్ కు, పీసీసీఎఫ్ సువర్ణకు సూచించారు. అటవీ అధికారుల మీద దాడి జరిగిన ప్రతిసారి డీజీపీ సహకారం ఉంటుందని అందుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ప్రకృతిని కాపాడటం కోసం అటవీ అధికారులు ప్రాణత్యాగం
ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ మాట్లాడుతూ అడవులను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ అడవులను కాపాడేందుకు అధికారులు చేస్తున్న కృషి గొప్పదన్నారు. ప్రకృతిని కాపాడటం కోసం అటవీ అధికారులు ప్రాణత్యాగం చేశారని, అలాంటి వారిని గౌరవించడం మనందరి బాధ్యత అన్నారు. సీఎస్ రామకృష్ణా రావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ స్మగ్లర్లను ఎదుర్కొంటూ అడవులను కాపాడుతున్న అటవీ అధికారులు కృషి గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో హైద్రాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, సీసీఎఫ్ లు ప్రియాంక వర్గీస్, రామలింగం, జూ డైరెక్టర్ సునీల్ హీరామత్, క్యూరేటర్ వసంత, అధికారులు పాల్గొన్నారు.
Also Read: Konda Surekha: ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బీసీ బహిరంగ సభ!