Gadwal Court: జైలు శిక్షకు బదులుగా సమాజ సేవ
ప్లకార్డు పట్టుకుని అవగాహన కల్పించాలి
బీఎన్ఎస్ కొత్త చట్టం కింద జిల్లాలో తొలి తీర్పు
గద్వాల, స్వేచ్ఛ : భారత న్యాయ సురక్ష స్మృతి (బీఎన్‌ఎస్‌ఎస్) చట్టం ప్రకారం జోగులాంబ గద్వాల జిల్లాలో (Gadwal Court) తొలిసారి ఆసక్తికరమైన తీర్పు వెలువడింది. చట్టంలోని 355వ సెక్షన్ కింద గురువారం గద్వాల మొదటి అదనపు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉదయ్ నాయక్.. మద్యం మత్తులో పోలీసులకు చిక్కిన ఓ వ్యక్తికి జైలు శిక్షకు బదులుగా సమాజ సేవను శిక్షగా విధిస్తూ తీర్పునిచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని కేటి దొడ్డి మండలం ఉమ్మిత్యాల గ్రామానికి చెందిన ఈరన్న (30) అనే వ్యక్తి, అదే మండలంలోని నందిన్నె గ్రామం వెలుపల ప్రధాన రోడ్డు పక్కన మద్యం సేవిస్తూ పోలీసులకు చిక్కాడు. అదుపులోకి తీసుకున్న స్థానిక ఎస్సై బిజ్జా శ్రీనివాసులు కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచారు.
Read Also- Rain Alert: వర్షాలపై అలర్ట్.. హెల్ప్‌లైన్ నంబర్ విడుదల చేసిన హైదరాబాద్ కలెక్టరేట్
ఈ కేసు విచారణ సందర్బంగా కోర్టులో హాజరైన నిందితుడు ఈరన్న తన తప్పును అంగీకరించాడు. దీనితో కోర్టు పునరావాసం, సమాజానికి మేలు చేసే విధంగా శిక్షను విధించడం సముచితమని అభిప్రాయపడింది. తీర్పు ప్రకారం, నిందితుడు శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రి జంక్షన్ వద్ద “మత్తులో వాహనం నడపవద్దు” అని రాసివున్న ప్లకార్డును పట్టుకుని నిలబడాలని ఆదేశించింది. మద్యం మత్తులో వాహనాలు నడిపే వారికి హెచ్చరికలు వెళ్లేలా చూడాలని, అవగాహన పెంపొందించాలని సూచించింది. శిక్ష దండన రూపంలో కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి ఉదయ నాయక్ ఈ సందర్భంగా తన తీర్పులో పేర్కొన్నారు.
Read Also- Kavitha: కవితను కలిసిన కేసీఆర్ సొంతూరి ప్రజలు.. ఎందుకో తెలుసా?
ఈ తీర్పు సమాజంలో మద్యం మత్తులో వాహనం నడిపే వారిపై కఠిన హెచ్చరికగా, అలాగే ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే అలవాట్లపై ఒక జాగృతి సందేశంగా నిలిచే అవకాశం ఉంది. కాగా, సీఆర్‌పీసీ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్‌ఎస్), 2023 నూతన చట్టం జూలై 1, 2024 నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.