- వైద్య రంగంలో సమూల మార్పుల దిశగా కాంగ్రెస్ అడుగులు
- తెల్ల కార్డుతో నిమిత్తం లేకుండా అందరికీ ఉచిత వైద్యం
- ఎన్నికల కోడ్ ముగియగానే వైద్యశాఖలో బదిలీల ప్రక్రియ
- వైద్యారోగ్య శాఖను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్
- కనీస సదుపాయాలు కల్పించని బస్తీ దవాఖానాలు
- కార్పొరేట్ ఆసుపత్రును పెంచి పోషించిన బీఆర్ఎస్
- గత పాలకులపై మండిపడుతున్న రాజకీయ విమర్శకులు
- ఢిల్లీ, కేరళ, ఒడిషా తరహా పాలసీలను అమలుచేసేందుకు సిద్ధం
Revanth Reddy government focus on Medical Health Department:
ఎన్నికల కోడ్ ముగియగానే రాష్ట్రంలో పాలన పరిగెత్తించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారా? ఇప్పటికే కొన్ని కీలక శాఖల మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం ఇకపై వైద్యారోగ్య శాఖను సమూలంగా ప్రక్షాళన చేయదలుచుకున్నారా? అంటే అవుననే అంటున్నారు అధికారులు. లోక్ సభ ఎన్నికల కోడ్ ముగియగానే వైద్యారోగ్య శాఖలో జనరల్ ట్రాన్స్ ఫర్స్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సంవత్సరాల తరబడి అతుక్కుపోయి అవినీతికి అలవాటు పడ్డ అధికారులను బదిలీ చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫైల్ కదలికలు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అధికారులు సిద్ధం చేశారు. కోడ్ పూర్తి కాగానే వైద్యారోగ్య శాఖలో బదిలీల ప్రాసెస్ మొదలుకానుంది. హెచ్‌వోడీలు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, డీఎమ్‌హెచ్‌వోలను బదిలీలు చేపట్టనున్నారు. దీంతో పాటు వైద్యారోగ్యశాఖలోని డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ విభాగాల్లో ఎక్కువ కాలం ఒకే చోట పనిచేసే వివిధ రకాల కేడర్లలో పనిచేసే ఎంప్లాయిస్‌ను కూడా ట్రాన్స్ ఫర్ చేయనున్నారు. ఈ మేరకు లాంగ్ స్టాండింగ్ ఆఫీసర్లు, స్టాఫ్ వివరాలను వెంటనే పంపించాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చొంగ్తూ అన్ని విభాగాల హెచ్‌వోడీలకు సర్క్యులర్ పంపించారు.
కార్పొరేట్ ‘కాసు’పత్రులు
ఏ దేశంలోనైనా ప్రజల ప్రాథమిక ప్రాధాన్యతావసరాలు విద్య, వైద్యం, ఉద్యోగం బ్యాడ్ లక్ ఏమిటంటే గత పదేళ్లుగా తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఈ రంగాలను దాదాపు నిర్వీర్యం చేసింది. ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ వేస్తూ విద్య, వైద్య రంగాలను కమర్షియల్ గా మార్చేసింది. తెలంగాణలో కొన్ని జిల్లాలకు కలెక్టర్లుగా పని చేసిన అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించిన సందర్భాలున్నాయి. తమ కుటుంబ సభ్యులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయ్యేలా చూసిన ఘటనలున్నాయి. అలా చేయడం మూలంగా ప్రజల్లో ప్రభుత్వ విద్య, వైద్యం మీద ప్రజల్లో నమ్మకంకలుగుతుందనే ఓ ఆశ.
ఈ రాష్ట్రాలలో వీటికి ప్రాధాన్యం
ప్రస్తుతం దేశంలో విద్య, వైద్యం, మీద బాగా ఫోకస్ చేస్తున్న రాష్ట్రాల్లో చెప్పుకోదగినవి ఢిల్లీ, కేరళ, ఒడిషా. ఒడిషాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ మూడు రంగాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. ఢిల్లీలో ఇప్పటికే ఉచిత ప్రజా వైద్యాన్ని అద్భుతంగా అమలు చేయగలుగుతున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. కార్పోరేట్ స్థాయి హాస్పిటల్స్ నిర్మించి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను డిజిటల్ రేంజికి తీసుకెళ్లారు. పేద ప్రజలకు మెరుగైన ప్రభుత్వ విద్యను అందిస్తున్నారు. నిరుద్యోగుల విషయంలోనూ కేజ్రీవాల్ చక్కటి నిర్ణయాలే తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాలలో భాగంగా ఒకానొక సమయంలో బస్సుల్లో మహిళలకు ఉచితం ప్రయాణం అని ప్రకటించారు కూడా. కేరళ లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులకు ఉద్యోగాల్లో ప్రధాన్య ఇస్తున్నాయి. మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనూ విద్యా వ్యవస్థను సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారు.
ఆ దిశగానే రేవంత్ సర్కార్ అడుగులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అత్యవసరమైన, అతి ముఖ్యమైన విద్య, వైద్యం, ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. ప్రజల భవిష్యత్ ను, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యావైద్య శాఖలో సమూల మార్పులు తేవాలని భావిస్తోంది. పైగా సగటు ప్రజలు తమ సంపాదనలో సగభాగంపైనే వీటిపై ఖర్చుపెడుతున్నారు. వీటిని ఉచితంగా అందిస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిమితిని 5 నుంచి 10 లక్షలకు పెంచిన రాష్ట్ర సర్కార్ తెల్ల కార్డే కాదు…పింక్ కార్డు దారులకూ ఉచిత వైద్యం అందించే దిశగా అడుగులు వేస్తోంది. అయితే పెద్ద ఆపరేషన్లకు మినిమమ్ ఛార్జీలు వసూలు చేసే దిశగా ప్రైవేటు ఆసుపత్రులతో సంప్రదింపులు జరిపేలా అడుగులు వేస్తున్నారు.