TS BJP: కమిటీపై కేంద్రమంత్రుల మార్క్!
కొత్తగా చేరిన నేతలకు నో ఛాన్స్
చెల్లుబాటుకాని ఈటల, ధర్మపురి, డీకే సిఫార్సులు
ఎమ్మెల్యేల ప్రతిపాదనలు చెత్తబుట్టలు
నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి జ్వాలలు!
సొంత మార్క్ చూపించలేకపోయిన కాషాయసారథి
కేంద్రమంత్రుల వైపే మొగ్గు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : ఎన్నో రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. బీజేపీ నూతన కమిటీని (TS BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సోమవారం ప్రకటించారు. మొత్తం 22 మంది సభ్యులతో కమిటీని ప్రకటించగా, అందులో ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది సెక్రటరీలు, ట్రెజరర్, జాయింట్ ట్రెజరర్, చీఫ్ స్పోక్స్ పర్సన్‌గా ఒక్కొక్కరిని నియమించారు. వీరితో పాటు మోర్చాలను సైతం ప్రకటించారు.
7 మోర్చాల్లో కొత్తగా ఐదుగురికి అవకాశం కల్పించారు. రెండు మోర్చాలకు పాత వారినే కొనసాగిస్తూ ప్రకటించారు. అయితే ఈ కొత్త కమిటీ నియామకంలో కేంద్ర మంత్రుల మార్క్ కనిపిస్తోందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్న రాంచందర్ రావు ప్రమేయం కాస్త తగ్గిందేమో అనేట్లుగా కమిటీ కూర్పు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కొత్త కమిటీ ఏర్పాటులో పలువురు ఎంపీల ప్రతిపాదనలు ఏమాత్రం చెల్లుబాటుకాలేదని చర్చించుంటున్నారు. ఈ ఇష్యూతో మరోసారి కొత్త, పాత నేతల మధ్య వ్యవహారం తెరపైకి వచ్చినట్లుగా శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మల్కాజిగిరి ఎంపీ ఈటల, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మాటలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదనే టాక్ వినిపిస్తోంది. వారితో పాటు పలువురు ఎమ్మెల్యేల ప్రతిపాదనలు సైతం చెత్తబుట్టదాఖలు చేసినట్టుగా చెవులు కొరుక్కుంటున్నారు. దీంతో కాషాయ పార్టీలో మళ్లీ నివురుగప్పిన నిప్పులా అసంతృప్తి జ్వాలలు రాజుకునేలా ఉన్నాయి. కొత్త కమిటీ కూర్పులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కేంద్ర మంత్రుల వైపే మొగ్గు చూపినట్లుగా చర్చించుకుంటున్నారు.
Read Also- Little Hearts: ‘లిటిల్ హార్ట్స్’ 3 డేస్ కలెక్షన్లు ఎంతో తెలుసా? ఆ రెండు సినిమాలూ అవుట్!
కొత్త కమిటీలో చోటు కోసం ఎంతో మంది నేతలు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. ఎవరికి వారుగా ప్రసన్నం చేసుకున్నా నిరాశే ఎదురైంది. ఎవరికి వారుగా ఫలానా పదవి తనదేనని చెప్పుకుని తిరిగిన నేతలకు రాష్ట్ర నాయకత్వం మొండిచేయి చూపించింది. విజ్ఞప్తులు, వినతులు అందించి మొర పెట్టుకున్నా పెద్దగా పట్టించుకోలేదని కొత్త కమిటీ కూర్పుతో అర్థమవుతోంది. అనుకున్న పేర్ల కంటే ఎవరూ ఊహించని పేర్లు కమిటీలో రావడం గమనార్హం. పూర్తి భిన్నంగా ఈ జాబితా రావడంతో అందరూ అవాక్కయ్యారు. పాత కమిటీలో ఉన్న ఐదుగురికి మాత్రమే కొత్త కమిటీలో అవకాశం కల్పించడం గమనార్హం.
Read Also- Karimnagar District: ప్రైవేటు ఆస్పత్రిలో దారుణం.. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న యువతిపై లైంగిక దాడి!
కొత్త కమిటీలో పాత జనరల్ సెక్రటరీలను పూర్తిగా తొలగించి కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. కొత్త కమిటీలో కనీసం 40 శాతం పాత వారికి అవకాశం కల్పించాలని పెట్టుకున్న నిబంధనలను పెద్దగా పట్టించుకన్నట్లుగా కనిపించడంలేదు. పూర్తిగా కొత్తవారైతే కార్యక్రమాలను లీడ్ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నా చివరకు పూర్తిగా కొత్త వారికే ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించారు. బీజేపీలో జనరల్ సెక్రటరీ అనేది కీ పొజిషన్. బీజేపీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సమానంగా ఉన్న పొజిషన్ జనరల్ సెక్రటరీయే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా మోర్చాలను మినహాయిస్తే 22 మందితో కూడిన కమిటీలో ఆరుగురు మహిళలకు బీజేపీ ప్రాధాన్యతను కల్పించింది. వైస్ ప్రెసిడెంట్లలో ముగ్గురికి, సెక్రటరీల్లో ముగ్గురికి పార్టీ చోటు కల్పించింది.
కొత్త కమిటీ ఇదే..
ప్రధాన కార్యదర్శులు : గౌతమ్ రావు, వీరేందర్ గౌడ్, వేముల అశోక్
వైస్ ప్రెసిడెంట్లు : బూర నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లు, బండారి శాంతి కుమార్, ఎం జయశ్రీ, కొల్లి మాధవి, కల్యాణ్ నాయక్, రఘునాథ్ రావు, బండా కార్తీక్ రెడ్డి
సెక్రటరీలు : శ్రీనివాస్ రెడ్డి, కొప్పు భాష, భరత్ ప్రసాద్, బండారు విజయలక్ష్మి, స్రవంతి రెడ్డి, కరణం పరిణిత, బద్దం మహిపాల్ రెడ్డి, తూటిపల్లి రవికుమార్
ట్రెజరర్ : దేవకీ వాసుదేవ్
జాయింట్ ట్రెజరర్ : విజయ్ సురానా జైన్
చీఫ్ స్పోక్ పర్సన్ : ఎన్వీ సుభాశ్
బీజేపీ మోర్చా అధ్యక్షులు వీరే
మహిళా మోర్చా : మేకల శిల్పారెడ్డి
యువ మోర్చా : గణేష్ కుందె
కిసాన్ మోర్చా : బస్వాపురం లక్ష్మీనర్సయ్య
ఎస్సీ మోర్చా : కాంతి కిరణ్
ఎస్టీ మోర్చా : నేనావత్ రవి నాయక్
ఓబీసీ మోర్చా : గంధమల్ల ఆనంద్ గౌడ్
మైనారిటీ మోర్చా : సర్దార్ జగ్ మోహన్ సింగ్