Telangana formation cm reventh reddy motivate speech :
తెలంగాణ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తొలిత పోలీసుల గౌరవ వందనాన్ని అందుకున్న సీఎం తర్వాత తన ప్రసంగాన్ని జై తెలంగాణ అంటూ ప్రారంభించారు. ముందుగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు తెలిపారు. ఆరు దశాబ్దాల కల సాకారం చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజాప్రభుత్వం జరుపుకుంటున్న సంబురం
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘4 కోట్ల తెలంగాణ ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం ఇది. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్దం పూర్తయింది. బానిసత్వాన్ని తెలంగాణ భరించదు.. ప్రేమను పంచడం, పెత్తనాన్ని ప్రశ్నించడమే తెలంగాణ ప్రజల తత్వం. సంక్షేమం ముసుగులో తెలంగాణను చెరబట్టాలని చూస్తే తెలంగాణ సమాజం సహించదు.. మా పాలనలో స్వేచ్ఛ పునరుద్ధరణకు తొలి ప్రాధాన్యం ఇచ్చాం. స్వేచ్ఛపై గత ప్రభుత్వ హయాంలో దాడి జరిగింది. సామాజిక న్యాయం మేడిపండు చందమైంది. ప్రజల సంపద గుప్పెడు మంది చేతుల్లోకి వెళ్లింది.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు విధ్వంసానికి గురయ్యాయి. ప్రజల కోసం ఎన్నికైన ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణలో ఉంది. ప్రజా ప్రభుత్వం జరుపుకుంటున్న మొదటి ఆవిర్భావ దినోత్సవం ఇది.. తెలంగాణ ప్రధాత సోనియాను ఈ ఉత్సవాలకు తమ మంత్రి వర్గం ఆహ్వానించింది.. ఏ హోదాలో సోనియాగాంధీని ఆహ్వానించారని కొందరు అడుగుతున్నారు.. బిడ్డ ఇంట్లో శుభకార్యానికి తల్లికి హోదా కావాలా? తల్లిని ఆహ్వానించడానికి బిడ్డకు ఒకరి పర్మిషన్ అవసరమా? ఏ హోదా ఉందని.. ఏ పదవిలో ఉన్నారని మహాత్మా గాంధీని మనం జాతిపితగా గుర్తించుకున్నాం. తెలంగాణ ఉన్నంతవరకు సోనియాను తల్లిగా గుర్తించి… గౌరవిస్తుంది. ఈ గడ్డతో ఆ తల్లి బంధం రాజకీయాలకు అతీతం’ అన్నారు.