Son Kills Father: తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. అనుమానం పెనుభూతమై ఓ కుటుంబం నిలువునా విచ్చిన్నమై పోయింది. చేతబడితో తన కూతుర్ని బలిగొన్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తి కన్న తండ్రిని దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని కారు డిక్కీలో మోసుకెళ్లి వాగులో పడేశాడు. తల్లి, పెద్ద కుమారుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. కుమారుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వాసవి నగర్ కి చెందిన బాలయ్య(70) సెప్టెంబర్ 3న తన చిన్న కుమారుడు బీరయ్య చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. 2 నెలల క్రితం బీరయ్య కుమార్తె (16) ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. తన తండ్రి చేతబడి చేయడం వల్లే కుమార్తె మరణించిందని బీరయ్య అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే హత్యకు రెండ్రోజుల ముందు పొలం దగ్గర తండ్రితో మరో విషయంలో గొడవ జరిగింది. దీంతో తండ్రిపై బీరయ్య కోపం కట్టలు తెంచుకుంది.
శవాన్ని డిక్కీలో తరలించి..
సెప్టెంబర్ 3న పొలంలో ఉన్న బాలయ్య వద్దకు కుమారుడు బీరయ్య వెళ్లాడు. మరోమారు గొడవ పెట్టుకున్నాడు. వెంట తెచ్చుకున్న కర్రతో తలపై బాది హత్య చేశాడు. అనంతరం బాలయ్య మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని వంగూరు మండలంలోని దుందుభి వాగులో పడేశాడు. అనంతరం అటు నుంచి అటు హైదరాబాద్ కి వెళ్ళిపోయాడు. అప్పటికే భర్త ఇంటికి రాలేదని భార్య చంద్రమ్మ.. పెద్ద కుమారుడు మల్లయ్యకు సమాచారం ఇచ్చింది. అయితే తండ్రి పనిమీద పక్కనున్న తండాకి వెళ్లి ఉండొచ్చని మల్లయ్య నచ్చజెప్పాడు.
Also Read: Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!
పెద్ద కుమారుడి ఫిర్యాదుతో..
మరుసటి రోజు ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా మల్లయ్యకు తండ్రి జాడ కనిపించలేదు. దీంతో పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. చిన్న కుమారుడిపై అనుమానంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. హైదరాబాద్ లో ఉన్న అతడ్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో జరిగినదంతా బీరయ్య చెప్పేశాడు. దీంతో దుందుభి వాగులో బాలయ్య మృతదేహాం కోసం గాలింపు చేపట్టారు. చివరికి బాడీ కొరటికల్లు గ్రామం వద్ద వాగులో తలలేని స్థితిలో బాలయ్య మృతదేహం కనిపించింది. తల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Also Read: Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!
మృతుడి భార్య ఏమన్నారంటే?
భర్త మరణం గురించి తెలిసి బాలయ్య భార్య చంద్రమ్మ కన్నీరు మున్నీరు అయ్యారు. తండ్రి కొడుకుల మధ్య ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని పేర్కొన్నారు. ఉన్నదంతా పిల్లలకే ఖర్చు పెట్టారని తెలిపారు. కూతురు చావుకు తన భర్తే కారణమని చిన్న కొడుకు బీరయ్య అనుమానం పెంచుకున్నాడని దాని వల్లే ఈ హత్య చేసి ఉంటాడని చంద్రమ్మ ఆరోపించారు.