Blood Moon Eclipse 2025: ఖగోళంలో అత్యంత సాధారణంగా ఏర్పడే ప్రక్రియల్లో సూర్య, చంద్ర గ్రహణాలు ఒకటి. ఏడాదిలో ఈ గ్రహణాలను తరుచూ చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే ఆదివారం (సెప్టెంబర్ 7) చంద్ర గ్రహణం రానుంది. గ్రహణానికి ముందు చంద్రుడు చాలా ఎర్రగా కనిపించనున్నాడు. దీనిని ‘రెడ్ మూన్’ పిలుస్తున్నారు. అయితే చంద్రగ్రహణం నేపథ్యంలో గర్భంతో ఉన్న మహిళలు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఆదివారం జరగాల్సిన సీజేరియన్ ఆపరేషన్లను డాక్టర్లకు నచ్చజెప్పి వారు వాయిదా వేసుకుంటున్నట్లు సమాచారం.
ప్రసవం వాయిదా
చంద్ర గ్రహణం అదివారం రాత్రి 9:58 నిమిషాలకు ప్రారంభం అయ్యి కనీసం 3 గంటల 28 నిమిషాల పాటు ప్రభావం చూపనుంది. అయితే ఎన్నడూ లేనివిధంగా ఈసారి 42 నిమిషాల పాటు ఈ చంద్ర గ్రహణం ప్రక్రియ కొనసాగనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే గ్రహణం రోజు ప్రసవం జరిగితే శిశువులు అనారోగ్యంతో పుడుతారనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. అందుకే గ్రహణం రోజున గర్భవతులను ఇల్లు దాటి బయటకు రానివ్వరు. ఈ నేపథ్యంలో కాన్పు కోసం ఆస్పత్రిలో సిద్ధంగా ఉన్న గర్భిణీలు వెనకడుగు వేస్తున్నారు. చంద్రగ్రహణం ఉన్నందున.. ప్రసవాన్ని సోమ లేదా మంగళవారానికి వాయిదా వేయాలని డాక్టర్లను కోరుతున్నారు.
డాక్టర్లపై మరింత ఒత్తిడి
చంద్రగ్రహణం నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకూ గైనక్ ఆస్పత్రులు బోసిపోయి దర్శనమిస్తున్నాయి. అత్యవసర పేషెంట్స్ మినహా.. రాష్ట్రంలోని గర్భిణీలు ఎవరు గైనిక్ ఆస్పత్రులకు రావడం లేదు. ఒకవేళ ఎమర్జెన్సీ ఉన్నా గ్రహణం పడే సమయంలో రాత్రిపూట సిజేరియన్ చేయవద్దంటూ డాక్టర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీనితో డాక్టర్లు కూడ ఏమి చేయలేక పేషెంట్ చెప్పిన సమయానికి సిజేరియన్ చేసేందుకు అంగీకరిస్తున్నారు.
డిశ్చార్జ్ కు సైతం ససేమిరా
అదే సమయంలో ప్రసవం అయినా మహిళలు సైతం గ్రహణం రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కామని డాక్టర్లకు తేల్చి చెబుతున్నారు. కొందరు శనివారమే డిశ్చార్జ్ అవుతుండగా.. మరికొందరు మాత్రం సోమవారం (సెప్టెంబర్ 7) లేదా మంగళవారానికి (సెప్టెంబర్ 8) తమ డిశ్చార్జ్ ను పోస్ట్ పోన్ చేయించుకుంటున్నారు. గర్భిణీల్లో వచ్చిన కొత్త భయాల నేపథ్యంలో ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశముందని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు
రేపే బ్లడ్ మూన్
సెప్టెంబర్ 7న ‘బ్లడ్ మూన్’ (Blood Moon 2025) ఆకాశంలో కనువిందు చేయనుంది. బ్లడ్ మూన్ అంటే చంద్రుడు ఎర్రగా మారే ఖగోళ ఘట్టం. ఈ ప్రక్రియ సంపూర్ణ చంద్ర గ్రహణం (Total Lunar Eclipse) సమయంలో ఆవిష్కృతం అవుతుంది. సాధారణంగా చంద్రగ్రహణం సమయంలో భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళి రేఖలో ఉంటాయి. సూర్యుడు, చంద్రుడి మధ్యలోకి భూమి వస్తుంది. అప్పుడు భూమి నీడ చంద్రుడిని కప్పేస్తుంది. కాబట్టి, భూమిపైకి కనిపించే అవకాశం ఉండదు. అయితే, బ్లడ్ మూన్ సమయంలో భూవాతావరణంలోని సూర్యకాంతి వంపు తిరిగి చంద్రుడిపై పడుతుంది. ఆ వెలుతురు ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు కాంతికి తరంగదైర్ఘ్యం ఎక్కువ కాబట్టి భూమి వాతావరణాన్ని దాటి చంద్రుడిని తాకుతుంది. అందుకే, చంద్రుడు నెత్తురు మాదిరిగా ఎర్రటి వర్ణంలో కనిపిస్తాడు. దానిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు.